సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో నం.550 నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జీవో అమలు చేయడంలో ఎదురైన ఇబ్బందులపై చంద్రబాబు శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల వల్ల నష్టపోతున్నామని రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ 2001లో జారీచేసిన జీవో నం.550 ప్రకారం జరుగుతోంది. ఈ జీవో ప్రకారం రిజర్వు కేటగిరీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో సీటు తీసుకుని, ఆ తర్వాత దానిని వదులుకుంటే.. ఆ సీటును మళ్లీ అదే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థితో భర్తీ చేయాలి. అయితే దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సిన సీట్లను ఓపెన్ కేటగిరీలో వదులుకున్న రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేయడం సరికాదని, దీనిపై న్యాయం చేయాలని అభ్యర్థించారు. స్పందించిన హైకోర్టు గతేడాది మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీడీపీ సర్కార్‌కు సూచించింది. కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యలేదు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులనే ఈ ఏడాది కౌన్సెలింగ్‌కు కూడా అమలు చేయడంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. ప్రతిభకు నష్టం జరుగుతుందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ 50 శాతాన్ని మించుతోందని పేర్కొంటూ జీవో నం.550ని నిలిపివేసింది. ఇప్పటి వరకూ దీనిని పట్టించుకోని సర్కార్.. రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ కూడా చివరి దశకు వచ్చిన తరుణంలో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామనడం వల్ల ఉపయోగమేమిటని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ప్రభుత్వం తరఫున వేర్వేరుగా రెండు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
23న ఏయూలో ‘జ్ఞానభేరి’
ఈనెల 23న విశాఖ జిల్లా ఆంధ్ర యూనివర్సిటీలో జ్ఞానభేరి కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇటీవల శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీలు, ఉన్నత విద్యామండలికి చెందిన రూ.కోట్ల నిధులు ఖర్చు చేసి జ్ఞానభేరి పేరిట ప్రభుత్వ ప్రచార కార్యక్రమం నిర్వహించడమేమిటని విద్యార్థి, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఏయూలో అయిపోయిన తర్వాత.. కాకినాడ జేఎన్‌టీయూ లేదా అనంతపురం జేఎన్‌టీయూలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఉండవల్లిలోని తన నివాసం నుంచి గ్రామ వికాసం కార్యక్రమంపై టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాలు, వార్డుల్లో పర్యటించి ప్రజల్ని చైతన్యపరచాలని సూచించారు.
కేరళ ముఖ్యమంత్రికి చంద్రబాబు ఫోన్
కేరళలో వరద పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌ను సీఎం చంద్రబాబు ఆరా తీశారు. శనివారం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. సాయమందించడానికి సిద్ధంగా ఉన్నామని, నిధుల సమీకరణకు సహాయపడతామని హామీ ఇచ్చారు.
‘మెడికల్’ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించండి
Published Sun, Aug 19 2018 3:23 AM | Last Updated on Sun, Sep 2 2018 5:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment