భారీ అప్పులు ఎందుకిచ్చారు? | Chandrababu Naidu asks banks to give huge debts for farmer loans | Sakshi
Sakshi News home page

భారీ అప్పులు ఎందుకిచ్చారు?

Published Mon, Feb 23 2015 1:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

భారీ అప్పులు ఎందుకిచ్చారు? - Sakshi

భారీ అప్పులు ఎందుకిచ్చారు?

* రైతు రుణాలపై బ్యాంకర్లను తప్పుబట్టిన సీఎం చంద్రబాబు
* ఆర్‌బీఐకి నివేదిక పంపుతానని బెదిరింపు
* బ్యాంకులు ఇవ్వడం వల్లే రైతులు అప్పుల ఊబిలోకి దిగుతున్నారని ఆగ్రహం

 
 ఏ సీఎం అయినా బ్యాంకర్లను ఏం కోరతారు? రాష్ర్టంలోని రైతులకు విరివిగా రుణాలిచ్చి ఆదుకోవాలనే విజ్ఞప్తి చేస్తారు, లేదా ఆదేశిస్తారు. కానీ, మన రాష్ట్రంలో మాత్రం సీఎం చంద్రబాబు స్టైలే వేరు!. రైతులను ఆదుకున్న బ్యాంకులవారినే ఆయన తిట్టి.. కొట్టినంత పనిచేస్తారు!. ‘రైతులకు ఇంత పెద్ద మొత్తంలో అప్పులెందుకిచ్చారు. మీ మీద రిజర్వ్‌బ్యాంకుకు ఫిర్యాదు చేస్తా’-అంటూ బ్యాంకర్లపై చిందులు కూడా తొక్కుతారు. తాజాగా రాష్ట్రంలో ఇదే జరిగింది. ఫలితంగా భవిష్యత్తులో రాష్ట్ర రైతులు తమ అవసరాలకు చాలినన్ని నిధుల కోసం ప్రైవేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి దాపురించనుంది. ఎప్పుడూ.. ‘అలా ముందుకు వెళ్దాం!’ అనే బాబు.. రైతుల విషయంలో మాత్రం ‘ఇలా వెనక్కి వెళ్లే’ నిర్ణయాలనే తీసుకుంటుండడం ఆలోచించాల్సిన విషయం!!.
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఇటీవల సీఎం చంద్రబాబు బ్యాంకర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు వ్యాఖలకు బ్యాంకర్లు విస్తుపోయారు. పెద్ద మొత్తంలో బ్యాంకులు అప్పులు ఇవ్వడం వల్లే రైతులు రుణాల ఊబిలో కూరుకుపోయారంటూ సీఎం వ్యాఖ్యానించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను మించి రుణమెందుకు ఇస్తున్నారంటూ ఎడాపెడా వాయించి వదిలిపెట్టారు. అంతటితో ఆగకుండా రైతులకు ఇష్టానుసారం రుణాలిచ్చారని పేర్కొంటూ రిజర్వ్‌బ్యాంకుకు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. దీంతో బ్యాంకర్లు నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 తీసుకుంటున్న సొమ్ము చాలకనే..
 రైతులు, బ్యాంకు శాఖల అధికారుల మధ్య ఉన్న అవగాహన ఆధారంగా బ్యాంకులు వ్యవసాయ రుణాలను మంజూరు చేస్తాయి. అంటే.. సదరు రైతులు వ్యవసాయం చేస్తున్నారా? లేదా?.. వారికి పొలం ఉందా? కౌలుకు తీసుకుని చేస్తున్నారా? అనే విషయాలను తెలుసుకున్న తర్వాతే బ్యాంకులు రైతులకు పంట రుణాలను మంజూరు చేస్తాయి. పొలంపై తీసుకున్న రుణం సరిపోకపోతే రైతులు తమ వద్దవున్న బంగారాన్ని కుదవ పెట్టి బ్యాంకుల నుంచి అదనంగా రుణం తీసుకుంటారు. అదేవిధంగా ప్రతి పంటకూ ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ఉన్నప్పటికీ ఆ మేరకు రుణం తీసుకుంటే ఆ సొమ్ము.. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కారణంగా రైతులకు పూర్తి అవసరాలకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’తో సంబంధం లేకుండా రైతులకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తుంటాయి. ఈ క్రమంలో బ్యాంకులు రైతులకు సరిపడిన మేరకు రుణాలు మంజూరు చేయకపోయిన పక్షంలో అన్నదాతలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవలసి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, సీఎం చంద్రబాబు మాత్రం క్షేత్రస్థాయి విషయాలను ఎంతమాత్రమూ పట్టించుకోకుండానే బ్యాంకర్లపై విరుచుకుపడడం విడ్డూరంగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
 
 భవిష్యత్తులో.. రైతులకు మొండిచేయి..!
 బ్యాంకర్లపై బాబు వ్యాఖ్యల వెనుక రైతు రుణాల మాఫీ నుంచి తప్పుకోవడమే కారణమై ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సగానికిపైగా రైతుల ఖాతాలను రుణ విముక్తి నుంచి ఏరివేసిన సీఎం.. అంతటితో సరిపెట్టకుండా భవిష్యత్తులో రైతులకు బ్యాంకుల నుంచి కావాల్సిన మేరకు రుణాలు పుట్టకుండా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అరకొర రుణ విముక్తిలో చంద్రబాబు సర్కారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ షరతు విధించినందున భవిష్యత్‌లో రైతులకు బ్యాంకులు కావాల్సినంత రుణాలను మంజూరు చేయవని అధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. అంటే రైతులు వ్యవసాయ పెట్టుబడికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేలా స్వయంగా ముఖ్యమంత్రే వ్యవహరించినట్లు అవుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  
 
 వైఎస్ ఆదుకుంటే.. బాబు ఆడుకుంటూ..
 రుణ మాఫీపై చంద్రబాబు మాట తప్పడం వల్ల ప్రస్తుత సీజన్‌లో వ్యవసాయ రుణ పరపతి విధానం దారుణంగా దెబ్బతింది. రుణాల మంజూరులో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేలా దివంగత వైఎస్ పావలా వడ్డీతో బాటలు వేశారు. ఆయన హయాంలో కరువు పీడిత జిల్లాల్లో రైతుల రుణాలపై కేంద్రం ద్వారా వడ్డీ మాఫీ చేయించారు. మరో అడుగు ముందుకేసి రైతుల రుణ మాఫీపై కూడా కేంద్రంపై ఒత్తిడి చేసి అమలు చేసిన ఘనత సొంతం చేసుకున్నారు. రైతులను వైఎస్ అలా ఆదుకుంటే.. బాబు రైతులతో ఆడుకుంటున్నారనే చెప్పాలి. తన ధోరణితో రైతులకు బ్యాంకుల నుంచి రుణం పుట్టకుండా చేస్తున్నారు. ఇప్పటికే ‘వెబ్ ల్యాండ్’ పేరిట ఒక బ్యాంకులో ఒక పొలంపై రుణం తీసుకుంటే మరో బ్యాంకులో అప్పుపుట్టకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ అంటూ రుణాలకు కోత విధించారు. ఇప్పుడు బ్యాంకులనే తప్పుబడుతూ  వాటిపై ఆర్‌బీఐకి నివేదిక పంపుతానని బాబు బెదిరింపు ధోరణితో వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement