బంగారుతల్లి పథకం, ఎస్.కోట వెలుగు కార్యాలయంలో భద్రంగా ఉన్న ‘బంగారుతల్లి’ పథకం రికార్డులు
ప్రజా సంక్షేమం దృష్ట్యా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు తెలుగుదేశం పరిపాలనలో అతీగతీ లేకుండా పోయాయి. టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ఆ పథకాల పేర్లు మార్చారే తప్ప వాటి అమలు కొనసాగింపు కాలేదు. దీంతో లబ్ధిదారులు ఆ పథకాలేమయ్యాయి...అంటూ ఆవేదన చెందుతున్నారు. బంగారు తల్లి పథకం తీరిదే...దీని పేరు మాఇంటి మహలక్ష్మిగా మార్చేసి ఇక పనైపోయిందనుకున్నారు పాలకులు. ఫలితంగా ఆ పథకం లక్ష్యాలు లబ్ధిదారులకు దూరమయ్యాయి.
శృంగవరపుకోట రూరల్: పుట్టిన ఆడపిల్లకు గ్రాడ్యుయేషన్ వరకు రూ.1,05,500, ఆ ఆడపిల్లల పెళ్లి సమయంలో రూ.50,000 మొత్తంగా రూ.1,55,500 మా ఇంటి మహాలక్ష్మి (‘బంగారుతల్లి’ పేరు మార్పు) పథకంలో నమోదైన ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు దశల వారీగా నగదు జమ చేసే పథకానికి తెలుగుదేశం ప్రభుత్వం పాతరేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం బంగారుతల్లి పథకం పేరుతో చట్టం కూడా చేసి 2013 సంవత్సరం మే 1 నుంచి పుట్టిన ఆడపిల్లల తల్లుల పేరున బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా నగదును జమ చేయడం ప్రారంభించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 జూన్–14 నుంచి ఆడపిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ నిలిపేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు శాఖ నుంచి బంగారుతల్లి పథకం నిర్వహణను ‘మా ఇంటి మహాలక్ష్మి’ పేరుతో ఐసీడీఎస్‌లు అమలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేశారు. కేవలం బంగారుతల్లి పథకాన్ని ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చడంతోనే మిన్నకుండిపోయి పథకంలో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయక ప్రభుత్వం పక్కన పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చట్టం ఇలా..
పుట్టిన ఆడపిల్లలను ఏ ఒక్కరూ దరిద్రంగా భావించరాదనే ఉద్దేశంతో ఆడపిల్లలను బాగా చదివించి వారికి పెళ్లి చేసే వరకు లబ్ధిదారులుగా ఉన్న ఆడపిల్లల తల్లుల పేరున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చట్టం చేసారు. ఇందులో భాగంగా 2013 మే 1 నుంచి పుట్టిన ఆడపిల్లలకు ఆస్పత్రుల్లో ప్రసవాలకు రూ.2500, మొదటి సంవత్సరం టీకాల నిమిత్తం రూ.1000, రెండవ సంవత్సరం రూ.1000, 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఆడపిల్లలకు సంవత్సరానికి రూ.1500ల చొప్పున, 6 నుంచి 10సంవత్సరాల వయసు వరకు రూ.2వేలు, 6, 7, 8 తరగతుల వరకు రూ.2500, 9, 10 తరగతులకు రూ.3వేలు, ఇంటర్మీడియెట్ చదువుకు రూ.3500, గ్రాడ్యుయేషన్ కోర్సుకు (నాలుగు సంవత్సరాలు) రూ.4000 చొప్పున అప్పటి వరకు రూ.1,05,000 ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం, ఆడపిల్ల పెళ్లి ఖర్చుల కోసం రూ.50వేలు, మొత్తంగా రూ.1,55,500 నగదు జమ చేయడం బంగారుతల్లి పథకం ఉద్దేశంగా పొందుపర్చిన చట్టంలో పేర్కొన్నారు.
లబ్ధిదారుల్లో నిరాశ..
ఈ పథకం కింద జిల్లాలో 26 మండలాల్లో మొత్తం 13,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 2015 జూన్ నెల వరకు వివిధ దశల్లో నగదు జమయ్యేది. తరువాత తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని నిలిపేసింది. పేరు మార్చిందే తప్ప ఆడపిల్లలకు అన్యాయం చేసిందని తల్లులు శాపనార్ధాలు పెడుతున్నారు.
ఇది తగదు..
బంగారుతల్లి పథకం కింద ఒక దఫా రూ.2,500 అప్పటి ప్రభుత్వంలో అందుకున్నాను. ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి ఎంతో మేలు కలిగించే విధంగా అప్పటి కాంగ్రెస్æ ప్రభుత్వం చట్టం చేసి బంగారుతల్లి పథకాన్ని అమలులోకి తెచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చటంతోనే సరిపెట్టి ఇదే పథకాన్ని నిర్వీర్యం చేసి ఆడపిల్లల కుటుంబాలను మోసం చేయటం తగదు. ఏ ప్రభుత్వమొచ్చిన ఇటువంటి పథకాన్ని కొనసాగించాలి.
– పాలిశెట్టి వెంకటసత్యదేవి, పోతనాపల్లి, శృంగవరపుకోట
ఉత్తర్వులే ఇచ్చారు..
వెలుగు శాఖ ఆధ్వర్యంలో అమలు చేసిన బంగారుతల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా పేరు మార్చటంతో పాటు ఐసీడీఎస్‌కు బదలాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు మాత్రమే జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి రికార్డులు కూడా ఇంకా వెలుగు శాఖ ఆధీనంలోనే ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక, పథకం కొనసాగింపు చేయాలనే ఆదేశాలైతే రానిమాట వాస్తవం.
– శాంతకుమారి, సీడీపీఓ, శృంగవరపుకోట
Comments
Please login to add a commentAdd a comment