చంద్రబాబు బ్యానర్‌తో తరలుతున్న ఇసుక
చిత్తూరు, నాగలాపురం : తెలుగుదేశం నాయకులు సరికొత్త పంథాలో ఇసుక అక్రమ రవాణాను దర్జాగా సాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో ఉన్న బ్యానర్లను ట్రాక్టర్ల ముందు భాగంలో కట్టుకుని ఇసుక తరలిస్తున్నారు. బ్యానర్లపై శాండ్ ట్రాన్స్‌పోర్ట్ ఫర్ గవర్నమెంట్ పర్పస్ అట్ సత్యవేడు (సత్యవేడులో ప్రభుత్వ అవసరాల కోసం ఇసుక రవాణా) అని ముద్రించి ఉంది. శుక్రవారం సుమారు 20 ఇసుక ట్రాక్టర్లకు ఈ రకమైన బ్యానర్లను కట్టుకుని నాగలాపురం మండల పరిధిలోని ఆరణియార్ నదీ పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలించారు. ఈ ట్రాక్టర్లలో అధిక శాతం ఇటీవల ప్రభుత్వం రుణంగా ఇచ్చిన రైతు రథాలే ఉన్నాయి.
కొన్ని ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లూ లేవు. చంద్రబాబు బ్యానర్లతో ఇసుకను తరలిస్తున్నారు ఏమిటని తహసీల్దార్ శ్రీనివాసులును వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిన్నదురై, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మోహన్ ముదలియార్, జిల్లా కార్యదర్శి జగదీష్‌రెడ్డి, మండల కార్యదర్శి విజయకుమార్ ఫోన్‌లో ప్రశ్నించారు. సత్యవేడులో ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణానికి జాయింట్ కలెక్టర్ ఐదు ట్రాక్టర్లకు ఇసుక పర్మిట్లు ఇచ్చారని ఆయన బదులిచ్చారు. తహసీల్దార్ సమాధానం సరైనదికాదని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహించారు. నిబంధనలకు విరుద్ధంగా జాయింట్ కలెక్టర్ ఇసుక పర్మిట్లు ఇవ్వరని వాదించారు. అందులోను నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లకు అసలు పర్మిట్లు ఇవ్వరని తెలిపారు. నాగలాపురం మండల పరిధిలో ఎటువంటి ఇసుక రీచ్‌లకు అనుమతులు లేవని, ఈ పరిస్థితుల్లో జాయింట్ కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్లు ఇచ్చారనడం సరికాదని తెలిపారు. మండలంలో జరిగే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోకపోవడం, రవాణా చేసేవారికి పర్మిట్లు ఉన్నాయా ? లేవా ? అనే విషయాలను తహసీల్దార్ పరిశీలించకపోవడం సమంజసంకాదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment