అయ్యన్న - చంద్రబాబు - గంటా
హైదరాబాద్: విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య వివాదం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చింది. ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో అయ్యన్నపాత్రుడి ప్రతిపాదనకే ఆమోదం తెలిపే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రులమధ్య నెలకొన్న విభేదాలు ఆర్డీవోల బదిలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం ఆర్డీవోను బదిలీ చేసే విషయంలో టీడీపీ నాయకులు గొడవ పడిన విషయాన్ని అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీఎంఓ అధికారుల పట్ల మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరించిన తీరును చంద్రబాబుకు వివరించారు. కార్యాలయం తలుపులు తీసి మరీ గట్టిగా గొడవ పడ్డారని సీఎంఓ అధికారులు సీఎంకు తెలియజేశారు.
దాంతో చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అయిన కె.ఇ.కృష్ణమూర్తితో, సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్రలతో మాట్లాడారు. బదిలీ ఎందుకు ఆపవలసి వచ్చిందో సతీష్ చంద్ర సీఎంకు వివరించారు. అయ్యన్న వ్యాఖ్యలను సతీష్ చంద్ర సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ ఆర్డీఓ వెంకట మురళిపై ఆరోపణల అంశాన్ని కేఈ కృష్ణమూర్తి సీఎంకు వివరించారు. మంత్రులు గంటా, అయ్యన్నల వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయ్యన్న ఉపయోగించిన పదజాలంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. విశాఖ ఆర్డీఓగా రామచంద్రా రెడ్డి నియామకం వైపే చంద్రబాబు మొగ్గు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.
**