RDOs transfer
-
AP: భారీగా ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీగా ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
గంటా పంతమే నెగ్గింది
వచ్చిన కొద్దిరోజులకే అనకాపల్లి ఆర్డీవో బదిలీ వుడా కార్యదర్శి. ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకూ.. పోర్టు ట్రస్ట్ డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌కు స్థానచలం విశాఖపట్నం: జిల్లాకు చెందిన పలువురు అధికారులను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ(సీఆర్డీఏ)కు డిప్యూటీ కలెక్టర్లుగా బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 36 మందికి స్థానచలం కలిగించగా, వారిలో జిల్లాకు చెందిన నలుగురున్నారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన అనకాపల్లి ఆర్డీవో బి.పద్మావతికి కూడా ఈ బదిలీల్లో వేటు పడింది. అనకాపల్లి ఆర్డీవోగా ఆమె నియామకాన్ని రాష్ర్ట మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వ్యతిరేకించారు. అయినప్పటికీ మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చక్రం తిప్పి ఆమెను జిల్లాకు రప్పించారు. నాటి బదిలీల్లో పట్టుబట్టి మరీ పద్మావతిని అనకాపల్లి ఆర్డీవోగా పోస్టింగ్ ఇప్పించారు. నాటి నుంచి మంత్రి గంటాతో పాటు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్‌లు ఈమె నియామకాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఏదోవిధంగా ఆమెను సాగనంపేందుకు మంత్రి గంటా విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు తనపంతం నెగ్గించుకున్నారు. నవంబర్‌లో జరిగిన సాధారణ బదిలీల్లో ఇక్కడకు వచ్చిన ఆమె అనతి కాలంలోనే బదిలీ వేటుకు గురయ్యారు. కాగా వుడా కార్యదర్శిగా పనిచేస్తున్న జీసీ కిషోర్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూ టీవ్ డెరైక్టర్ ఎఎన్ సలీంఖాన్, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.పద్మలతలు సీఆర్డీఏకు బదిలీ అయ్యారు. అదే విధంగా విశాఖపట్నం సెంట్రల్ మెడికల్ స్టోర్ ఇన్చార్జిగా అనకాపల్లి యూఎఫ్‌డబ్ల్యూసీ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్.ఎఫ్.రవీంద్రను నియమిస్తూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. -
పరువు తీస్తున్నారు: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్డీవో బదిలీలకు కోట్ల రూపాయిల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో చంద్రబాబు... తన కేబినెట్లోని మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీల విషయంలో అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా వస్తున్నాయి... ఈ నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన మంత్రులకు సూచించారు. అధికారుల బదిలీల కోసం రచ్చకెక్కడం సరికాదని మంత్రులకు హితవు పలికారు. బదిలీలపై రచ్చ చేసి ప్రభుత్వ పరువు తీస్తున్నారని చంద్రబాబు మంత్రులపై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆర్డీవోల బదిలీలపై సీఎం కార్యాలయం జోక్యం చేసుకోవడం సరికాదని కొంతమంది మంత్రులు ఈ సందర్భంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. -
అయ్యన్న వైపే చంద్రబాబు మొగ్గు!
హైదరాబాద్: విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య వివాదం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చింది. ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో అయ్యన్నపాత్రుడి ప్రతిపాదనకే ఆమోదం తెలిపే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రులమధ్య నెలకొన్న విభేదాలు ఆర్డీవోల బదిలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం ఆర్డీవోను బదిలీ చేసే విషయంలో టీడీపీ నాయకులు గొడవ పడిన విషయాన్ని అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీఎంఓ అధికారుల పట్ల మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరించిన తీరును చంద్రబాబుకు వివరించారు. కార్యాలయం తలుపులు తీసి మరీ గట్టిగా గొడవ పడ్డారని సీఎంఓ అధికారులు సీఎంకు తెలియజేశారు. దాంతో చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అయిన కె.ఇ.కృష్ణమూర్తితో, సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్రలతో మాట్లాడారు. బదిలీ ఎందుకు ఆపవలసి వచ్చిందో సతీష్ చంద్ర సీఎంకు వివరించారు. అయ్యన్న వ్యాఖ్యలను సతీష్ చంద్ర సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ ఆర్డీఓ వెంకట మురళిపై ఆరోపణల అంశాన్ని కేఈ కృష్ణమూర్తి సీఎంకు వివరించారు. మంత్రులు గంటా, అయ్యన్నల వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయ్యన్న ఉపయోగించిన పదజాలంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. విశాఖ ఆర్డీఓగా రామచంద్రా రెడ్డి నియామకం వైపే చంద్రబాబు మొగ్గు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ** -
మళ్లీ అలా మొదలైంది ...
ఏ రెండు పార్టీలను కానీ ... ఏ రెండు వర్గాలను కానీ... ఏ ఇద్దరు వ్యక్తులను గాని రాజకీయాలు...కుదురుగా ఉండనియ్యవు. శత్రువులను మిత్రులగా మారుస్తుంది.. అంతలోనే మిత్రులను శత్రువులుగా మారుస్తుంది. అదే పవర్ ఫుల్ పొలిటికల్ గేమ్. దీనిలో ప్రవేశించిన వారిలో 99 శాతం మంది అధిపత్యం కోసం పోటీ పడుతుంటారు. చివరకు నీవెంత అంటే నీవెంత అనే స్థాయికి చేరుకుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ విశాఖ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు... గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు. వీరిద్దరు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవులు చేపట్టినా....వారి మధ్య సఖ్యత లేదు. ఇద్దరి మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల కాలంలో మంత్రివర్యులు సఖ్యతగా ఉన్నా మళ్లీ వ్యవహారం మొదటికొట్టింది. టీడీపీ స్థాపించిన నాటి నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీనే అంటిపెట్టుకున్నారు. దాంతో ఆయనకు ఆ పార్టీ పలుమార్లు మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానానే కట్టబెట్టింది. ఆ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖను అయ్యన్నపాత్రుడు చేపట్టారు. ఇక గంటా శ్రీనివాసరావు మాత్రం పలు పార్టీలు మారి ఆయా పార్టీలలో మంత్రి పదవులు అనుభవించి చివరకు సైకిల్ ఎక్కారు. మొదటి నుంచి గంటా అంటే అయ్యన్నపాత్రుడు మంట అన్న విషయం విదితమే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని భావించిన గంటా సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నించిన యత్నాలను అయ్యన్నపాత్రుడు తీవ్రంగా అడ్డుకున్నారు. అంతేకాకుండా తన మాట పెడ చెవిన పెట్టి గంటాను సైకిల్ ఎక్కించుకున్నారని చంద్రబాబుపై అయ్యన్న కొంత కాలం గుర్రుగా ఉన్నారు. వలస నేతల వల్ల పార్టీ భ్రష్టుపడుతుందంటూ అయ్యన్నపాత్రుడు...చంద్రబాబు సమక్షంలోనే బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత అయ్యన్న, గంటాల మధ్య బాబు కలిసి పనిచేసుకుపోవాలని సయోధ్య కుదిర్చారు. అయినా అవకాశం వచ్చినప్పుడల్లా వారి మధ్య జగడాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రుల మధ్య ఆర్డీవో బదిలీ చిచ్చు పెట్టింది. దాంతో ఆర్డీవోను ఇక్కడే ఉంచాలని గంటా పట్టుబడితే... లేదు ఆ ఆర్డీవోను బదిలీ చేయాలని అయ్యన్నపాత్రుడు ఉడుం పట్టుబడ్టారు. దీంతో ఇద్దరి మధ్య వైరం తారస్థాయికి చేరింది. చంద్రబాబు సింగపూర్ నుంచి రాగానే వీరిద్దరూ ఆయన దగ్గరే పంచాయితీ పెట్టి తేల్చుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.