మళ్లీ అలా మొదలైంది ...
ఏ రెండు పార్టీలను కానీ ... ఏ రెండు వర్గాలను కానీ... ఏ ఇద్దరు వ్యక్తులను గాని రాజకీయాలు...కుదురుగా ఉండనియ్యవు. శత్రువులను మిత్రులగా మారుస్తుంది.. అంతలోనే మిత్రులను శత్రువులుగా మారుస్తుంది. అదే పవర్ ఫుల్ పొలిటికల్ గేమ్. దీనిలో ప్రవేశించిన వారిలో 99 శాతం మంది అధిపత్యం కోసం పోటీ పడుతుంటారు. చివరకు నీవెంత అంటే నీవెంత అనే స్థాయికి చేరుకుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ విశాఖ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు... గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు. వీరిద్దరు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవులు చేపట్టినా....వారి మధ్య సఖ్యత లేదు. ఇద్దరి మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల కాలంలో మంత్రివర్యులు సఖ్యతగా ఉన్నా మళ్లీ వ్యవహారం మొదటికొట్టింది.
టీడీపీ స్థాపించిన నాటి నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీనే అంటిపెట్టుకున్నారు. దాంతో ఆయనకు ఆ పార్టీ పలుమార్లు మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానానే కట్టబెట్టింది. ఆ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖను అయ్యన్నపాత్రుడు చేపట్టారు. ఇక గంటా శ్రీనివాసరావు మాత్రం పలు పార్టీలు మారి ఆయా పార్టీలలో మంత్రి పదవులు అనుభవించి చివరకు సైకిల్ ఎక్కారు. మొదటి నుంచి గంటా అంటే అయ్యన్నపాత్రుడు మంట అన్న విషయం విదితమే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని భావించిన గంటా సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నించిన యత్నాలను అయ్యన్నపాత్రుడు తీవ్రంగా అడ్డుకున్నారు. అంతేకాకుండా తన మాట పెడ చెవిన పెట్టి గంటాను సైకిల్ ఎక్కించుకున్నారని చంద్రబాబుపై అయ్యన్న కొంత కాలం గుర్రుగా ఉన్నారు.
వలస నేతల వల్ల పార్టీ భ్రష్టుపడుతుందంటూ అయ్యన్నపాత్రుడు...చంద్రబాబు సమక్షంలోనే బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత అయ్యన్న, గంటాల మధ్య బాబు కలిసి పనిచేసుకుపోవాలని సయోధ్య కుదిర్చారు. అయినా అవకాశం వచ్చినప్పుడల్లా వారి మధ్య జగడాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రుల మధ్య ఆర్డీవో బదిలీ చిచ్చు పెట్టింది. దాంతో ఆర్డీవోను ఇక్కడే ఉంచాలని గంటా పట్టుబడితే... లేదు ఆ ఆర్డీవోను బదిలీ చేయాలని అయ్యన్నపాత్రుడు ఉడుం పట్టుబడ్టారు. దీంతో ఇద్దరి మధ్య వైరం తారస్థాయికి చేరింది. చంద్రబాబు సింగపూర్ నుంచి రాగానే వీరిద్దరూ ఆయన దగ్గరే పంచాయితీ పెట్టి తేల్చుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.