ch ayyanna patrudu
-
పశుగణ క్షేత్రంలో..మంత్రుల రణం
సాక్షి, విశాఖపట్నం:జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ నూతన పాలకవర్గ నియామకం జిల్లా మంత్రులు సీహెచ్ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య మరోసారి చిచ్చు రేపింది. చీటికీ మాటికీ వీరిద్దరి మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న జిల్లా యంత్రాంగానికి ఈ పరిణామం ప్రాణసంకటంగా మారింది. తొలుత గంటా సిఫార్సుతో కొత్త పాలకవర్గ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ అయ్యన్న ఆగ్రహంతో యూ టర్న్ తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ ఆదేశాల మేరకే నియామకాలు.. ఎన్నికలు నిర్వహించామని, ఇప్పుడు తమపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమంటూ పశుసంవర్ధక శాఖాధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సిన తరుణంలో.. పాలకవర్గ ఎన్నిక జరిగి 65 రోజులు దాటిపోయింది. మరో రెండ్రోజుల్లో పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఎన్నిక ముగిసి బాధ్యతలు చేపట్టే సమయంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పాత పాలకవర్గాన్నే కొనసాగించాలంటూ తాను సిఫార్సు చేసినా పట్టించుకోకుండా కొత్త పాలకవర్గాన్ని ఎందుకు నియమించారంటూ సోమవారం ఉన్నట్టుండి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై ఫైర్ అయ్యారు. ఎన్నికలు ఆపమని, పాత పాలకవర్గాన్ని కొనసాగించాలంటూ తాను సిఫార్సు చేసినా పట్టించుకోకుండా ఎన్నికలు ఎందుకు నిర్వహించారంటూ ఒంటికాలిపై లేచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఈ కమిటీకి చైర్మన్‌గా ఎలా నియమిస్తారంటూ కలెక్టర్‌పై చిందులు తొక్కారు. అంతా నీ ఇష్టమేనా? అంటూ ఆయనపై మండిపడ్డారు. అంతే కాకుండా సీఎంఒ కార్యాలయంతోపాటు ఇన్చార్జి మంత్రి చినరాజప్పకు కూడా ఫిర్యాదు చేశారు. పైగా ఈ ఎన్నికను సాయంత్రంలోగా నిలుపుదల చేయకపోకే మంత్రి పదవికే తాను రాజీనామా చేస్తానంటూ బెదిరింపులకు దిగారు. మంత్రి అయ్యన్నతోపాటు ఇన్చార్జి మంత్రి చినరాజప్ప సైతం ఫైర్ అవడంతో కలెక్టర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు పశుగణాభివృద్ధి సంస్థ ఈవోతోపాటు పశుసంవర్ధక శాఖ జేడీ, ఇతర అధికారులను పిలిపించుకొని పరిస్థితిని సమీక్షించారు. తొలుత 17మందిని నామినేట్ చేయడమే కాకుండా ఎన్నికల నిర్వహణకు స్వయంగా ఆదేశాలిచ్చిన కలెక్టర్ మంత్రి అయ్యన్న ఒత్తిళ్లతో కొత్త పాలకవర్గ నియామకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ వివాదం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ పాలకవర్గం ప్రస్తుత పదవీ కాలం ఈ నెల 5వ తేదీతో ముగియనుంది. రాఘవేంద్రరావు అధ్యక్షునిగా ఉన్న ఈ పాలకవర్గాన్ని కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేశారు. రెండు దఫాలుగా ఈ కమిటీయే కొనసాగుతోంది. కొత్త పాలకవర్గం ఏర్పాటు కోసం కసరత్తు మొదలైంది. ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న రాఘవేంద్రరావు నేతృత్వంలోని పాత పాలకవర్గాన్ని కొనసాగించడంపై మరో మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాల్సిందేనని కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో 17మందిని నామినేట్ చేస్తూ కలెక్టర్ జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. నామినేట్ చేసిన 21 రోజుల తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నికల కోసం జనవరి 21న కలెక్టర్ పేరిటే నోటీసులు జారీ చేశారు. సరిగ్గా అదే సమయంలో 23వ తేదీన పాతపాలకవర్గాన్ని కొనసాగించాలంటూ మంత్రి అయ్యన్న పాత్రుడు సిఫార్సు లేఖ పంపారు. అయితే అప్పటికే ఎన్నికకు నోటీసులు జారీ చేయడం, మంత్రి గంటా ఒత్తిళ్లు కారణంగా 27వ తేదీన బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో భీమిలికి చెందిన మాజీ ఎంపీపీ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గాడు వెంకటçప్పడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ మేరకు కలెక్టర్‌తోపాటు ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో కూడా అదే నెలలో నియమామకం పూర్తయినట్టుగా లేఖ కూడా రాశారు. నా నియామకాన్ని ఎందుకుఅడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదు బీసీ మంత్రి అయి ఉండి కూడా బీసీ అభ్యర్థినైన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. నేనే పార్టీలో సీనియర్ కార్యకర్తను. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడగా ఉన్నాను. గతంలో రెండుసార్లు భీమునిపట్నం ఎంపీపీగా చేశాను. మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మండల పార్టీ అధ్యక్షునిగా కూడా చేశా. పార్టీలో సీనియర్ అయిన నన్ను కాదని కాంగ్రెస్‌కు చెందిన పాత పాలకవర్గ అధ్యక్షుడు రాఘవేంద్రరావు నేతృత్వంలోని కమిటీని కొనసాగించాలంటూ అయ్యన్న సిఫార్సు చేయడం ఎంతవరకు సమంజసం? నా ఎన్నిక పూర్తిగా నిబంధనల మేరకే జరిగింది. నాతో సహా 17 మందిని కలెక్టర్ స్వయంగా నామినేట్ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అంతా బైలా ప్రకారం జరిగిన ఈ ఎన్నికలో నేను అధ్యక్షునిగా ఎన్నికయ్యా. నేనేమీ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కాదు.. పక్కా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఏ కారణంతో అయ్యన్న నా నియామకాన్ని అడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదు.–గాడు వెంకటప్పడు, డీఎల్‌డీఎ చైర్మన్‌గా ఎన్నికైన వ్యక్తి -
అడ్రస్ లేని అయ్యన్న.. వేడుకలకే గంటా సరి
కుండపోతతో జనం అష్టకష్టాలు జాడ లేని జిల్లా మంత్రులు పదిమంది మృత్యువాత పడినా స్పందించని సచివులు అడ్రస్ లేని అయ్యన్న.. వేడుకలకే గంటా సరి విశాఖపట్నం: పెను తుపానులను తలదన్నేలా అల్పపీడనం ప్రభావంతో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలకు ఇప్పటివరకు పది మంది మృత్యువాత పడ్డారు. 14 వంతెనలు దెబ్బతిన్నాయి. 10 చెరువులకు గండ్లు పడ్డాయి. దాదాపు పది వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు అధికారులే నిర్ధారించారు. మరో రెండురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శక్తి మేరకు చర్యలు చేపడుతున్నా.. దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షించాల్సిన.. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల జాడ మాత్రం కనిపించడం లేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నా వారు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం వర్షాల పరిస్థితి, సహాయ చర్యలపై సమీక్షించకపోవడం మంత్రుల అంతులేని నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అడ్రస్ లేని అయ్యన్న: చీటికీ మాటికీ తాను సీనియర్ మంత్రినని చెప్పుకునే అయ్యన్న.. వర్షాల దెబ్బకు జిల్లా అతలాకుతలమవుతున్నా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పోనీ జిల్లాను పక్కనపెట్టి కనీసం తను ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గాన్ని కూడా ఆయన కన్నెత్తి చూడలేదు. తను ఇన్చార్జి మంత్రిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల బాగానే పర్యటిస్తున్న అయ్యన్న కనీసం భారీవర్షాల సమయంలోనైనా సొంత జిల్లాలో పర్యటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వ్యక్తిగత పనుల మీద కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన సోమవారం గుంటూరులో జరిగిన సమావేశంలో పాల్గొన్నారని, మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తారని తెలిసింది. పండుగలు, పబ్బాలకే గంటా పరిమితం: ఇక మరో మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరి కూడా విమర్శలకు తావిచ్చేలానే ఉంది. ప్రభుత్వం విశాఖ వేదికగా అట్టహాసంగా నిర్వహిస్తున్న సదస్సులు, సమావేశాల్లో ఆడంబరంగా కనిపించే మంత్రి గంటాకు జిల్లా ప్రజల వర్షం కష్టాలు మాత్రం పట్టలేదు. సహజంగానే విశాఖనగరం దాటి జిల్లాలో పర్యటించని గంటా ఇటీవల కాలంలో నగరంలోని సదస్సులు, ఉత్సవాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు మూటకట్టుకుంటున్నారు. ఆదివారం నగరంలోనే ఉన్న ఆయన వివిధ షాపుల ప్రారంభోత్సవాలకు హాజరై బిజీగా గడిపారే గానీ,, వర్షాలపై అధికారులతో మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు. ఇక సోమవారం మాతాఅమృతమయి జన్మదినవేడుకల్లో పాల్గొనేందుకు కేరళ వెళ్లారు. నాలుగు నెలల ముందు రోనూ తుపాను సంభవించినప్పుడు కూడా ఇదే నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించారు. ఇప్పుడు భారీవర్షాలు పడగెత్తిన సమయంలోనూ ఇద్దరు మంత్రులూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సామాన్యప్రజల నుంచే కాదు టీడీపీ శ్రేణుల నుంచి కూడా అసంతృప్తి పెల్లుబికుతోంది. -
రాజకీయ బదిలీలకు రంగం సిద్ధం
మంత్రి సిఫార్సులతో ఒత్తిడి తెస్తున్న తహసీల్దార్లు ఏలూరు : రాజకీయ బదిలీలకు తెరలేస్తోంది. తమకు అనుకూలంగా ఉండే తహసీల్దార్లను నియమించాలంటూ పలువురు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జి మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడును కోరారు. సరేనన్న మంత్రి ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ జిల్లా అధికారులను గురువారం ఆదేశించారు. కొందరు తహసీల్దార్లకు సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు. అవి శుక్రవారం జిల్లా అధికారులకు అందాయి. బదిలీలకు గడువు ముగిసినప్పటికీ జిల్లా ఇన్చార్జి మంత్రి సిఫార్సు లేఖలు ఇవ్వడంతో తహసీల్దార్లను వారు కోరుకున్న స్థానానికి పంపించేందుకు రంగం సిద్ధమవుతోంది. నిబంధనల ప్రకారం తహసీల్దార్లు ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన పరిస్థితి లేదు. ఈ దృష్ట్యా ఇప్పట్లో వారికి బదిలీలు ఉండవని అంతా భావించారు. అయితే, మంత్రి ఆదేశాల మేరకు నిబంధనలను పక్కనపెట్టి తహసీల్దార్ల బదిలీలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జిల్లాలో పలువురు మండల స్థాయి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది. -
'విభజన హామీలపై బీజేపీ దొంగాట'
విశాఖపట్నం : విభజన హామీలపై బీజేపీ దొంగాట ఆడుతోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆదివారం విశాఖపట్నం నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహనాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను కేంద్రమే అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. -
విశాఖ టీడీపీలో కలకలం
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా టీడీపీలో మళ్లీ కలకలం మొదలైంది. జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, సిహెచ్ అయ్యన్నపాత్రుడి మధ్య వర్గ పోరు సద్దుమణిగినట్లే ఉండి... మళ్లీ వారి మధ్య వైరం తారస్థాయికి చేరింది. ఉన్నతవిద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకి చెక్ పెట్టేందుకు పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చకచకా పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా జిల్లాలోని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సదరు నేతలిద్దరిని మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు, ఏపీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్, ఆ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్వయంగా చంద్రబాబు నివాసానికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా వారు చంద్రబాబుతో మంతనాలు సాగించారు. కాగా ఈ భేటీని గంటాకు తెలియకుండా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే చంద్రబాబుతో కొణతాల భేటీ కావడంపై మీడియా ద్వారా తెలుసుకున్న గంటా వర్గం వెంటనే అప్రమత్తమైంది. అయ్యన్న వర్గం చంద్రబాబుతో భేటీపై చర్చించేందుకు స్వయంగా గంటా ఛాంబర్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, పీలా గోవింద్, పి.గణబాబు అత్యవసరంగా సమావేశమయ్యారు. అయితే టీడీపీలో కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీల చేరికను గంటా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. -
ముట్టడి... కట్టడి
మంత్రి గంటాకు చెక్‌పెడుతున్న ప్రత్యర్థులు చేతులు కలిపిన అయ్యన్న, ఎంవీవీఎస్ మూర్తి జారుకుంటున గంటా వర్గీయులు అనకాపల్లి, పెందుర్తి పరిణామాలతో సంకట స్థితి రాసకందాయంలో జిల్లా టీడీపీ వర్గపోరు జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రాభవానికి చెక్ పడుతోందా! సొంతింటి ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా ఆయనను బలహీనపరుస్తున్నారా? అందుకోసం ఆయన వ్యతిరేకులంతా ఏకమవుతున్నారా! జిల్లా టీడీపీలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఓ వైపు గంటా వ్యతిరేకులు అంతా ఏకమవుతూ... మరోవైపు ఆయన వర్గీయులను ఒక్కొక్కరిగా దూరం చేస్తూ ద్విముఖ వ్యూహంతో రాజకీయం సాగిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు తెలిసే ఈ వ్యవహారం సాగుతుండటంతో మంత్రి గంటా చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వస్తోంది. విశాఖపట్నం : మంత్రి గంటాను రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు ఆయన ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారు. మంత్రి నారాయణ సహకారంతో చక్రం తిప్పొచ్చన్న ధీమాతో గంటా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ జిల్లా రాజకీయ సమీకరణలు తమకు అనుకూలంగా మలచుకుంటూ అయ్యన్నవర్గం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇంతకాలం మంత్రి అయ్యన్న, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రమే గంటాను బహిరంగంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ తాజాగా ఆ జాబితాలో ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి వచ్చి చేరారు. మంత్రి పదవిపై కన్నేసిన ఆయన జీవీఎంసీ పరిధిలో పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం నగరంలోని పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఎమ్మెల్సీ మూర్తితో సన్నిహితంగా ఉంటున్నారు. మరోవైపు అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల రాజకీయ సమీకరణలు కూడా గంటాను బలహీనపరిచేవిగానే ఉన్నాయి. మంత్రి అయ్యన్న, ఎమ్మెల్సీ మూర్తి చాపకింద నీరులా అనకాపల్లి, పెందుర్తిలలో రాజ కీయ సమీకరణలను ప్రభావితం చేస్తున్నారు. తనకు కనీస సమాచారం కూడా లేకుండా జరుగుతున్న ఈ పరిణామాలతో గంటా వర్గం ఆత్మరక్షణలో పడిపోయింది. మంత్రి గంటాగానీ ఆయన వర్గీయుల సమ్మతితో నిమిత్తం లేకుండానే తాను నిర్ణయాలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దాంతో ఎదురుదాడి చేసేందుకు కూడా గంటా వర్గీయులకు అవకాశం లేకుండాపోయింది. జారుకుంటున్న నేతలు తాజా పరిణామాలతో మంత్రి గంటా వర్గంలోని కీలక నేతలు పునరాలోచనలో పడ్డారు. ఆయన నీడలో ఉండేకంటే తాము స్వతంత్రంగానో ఎమ్మెల్సీ మూర్తికి సన్నిహితంగానో వ్యవహరిస్తేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు స్వతంత్ర వైఖరి అవలంబిస్తున్నారు. సీనియర్ అయిన ఆయన కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గంటాను తప్పిస్తే ఎమ్మెల్సీ మూర్తికిగాని, తనకుగాని మంత్రియోగం పడుతుందని... అన్నీ కలసివస్తే ఇద్దరం కూడా కేబినెట్ బెర్త్‌లు దక్కవచ్చన్నది ఆయన యోచన. కాబట్టి గంటా వర్గీయుడిగా ముద్రపడి అమాత్య యోగం అవకాశాలను ఎందుకు జారవిడుచుకోవాలని ఆయన భావిస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో తన ప్రయోజనాలు కాపాడలేని మంత్రి గంటా వర్గీయుడిగా కొనసాగడం శుద్ధ దండగన్నది ఎమ్మెల్యే బంగారు సత్యనారాయణమూర్తి ఉద్దేశంగా ఉన్నట్లు తెలిసింది. అదే కోణంలో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కూడా గంటా పట్ల కినుక వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా టీడీపీలో మంత్రి గంటా రాజకీయ ప్రాభవానికి క్రమంగా గ్రహణం పడుతోందని. మరీ పట్టు నిలుపుకునేందుకు మంత్రి గంటా ఏ రీతిలో ఎదురుదాడి చేస్తారన్నది ప్రస్తుతం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. గంటా అంత సులువుగా ప్రత్యర్థులకు రాజకీయ మైదానాన్ని విడిచిపెట్టరని... రాజకీయ ఆట కొనసాగిస్తారని ఆయన సన్నిహితులు చెబతున్నారు. అదే జరిగితే జిల్లా టీడీపీలో పరిణామాలు మునుముందు మరింత రసకందాయంలో పడనుండటం ఖాయంగా కనిపిస్తోంది. -
నచ్చిన అధికారిని నియమించుకుంటే తప్పేంటి ?
ఏలూరు: తమకు అనుకూలమైన అధికారులకే బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతూ... 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నామని....ఆ సమయంలో అధికారులు బదిలీలపై తాము ఎవరిని ప్రశ్నించలేదన్నారు. ప్రస్తుతం తమకు నచ్చిన అధికారిని నియమించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తనకు, తన సొంత జిల్లాకు చెందిన మంత్రి గంటా మధ్య ఎలాంటి విబేధాలు లేవని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అది అంతా మీడియా సృష్టే అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. -
'ఆయన సమర్థుడు ... ఇక్కడే ఉంచండి'
-
'ఆయన సమర్థుడు ... ఇక్కడే ఉంచండి'
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఉన్నతాధికారుల బదిలీలలో వింత రాజకీయం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆర్డీవో అధికారులు బదిలీ అంశంలో కత్తులు నురుకున్న ఇద్దరు మంత్రులు... ఓ ఉన్నతాధికారి బదిలీ విషయంలో మాత్రం ఒకే మాట మీద నిలబడ్డారు. దీంతో మంత్రుల వ్యవహారశైలిపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జిల్లాలోని డీఆర్డీఏ పీడీ సత్యశ్రీనివాస్‌ను బదిలీ చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన సమర్థుడైన అధికారి అని... ఆయన్ని విశాఖలోనే కొనసాగించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం చంద్రబాబుకు సిఫారసు చేశారు. ఇదే మాటను వారం రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పొల్లు పోకుండా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని సమాచారం. అయితే విశాఖ ఆర్డీవో వెంకట మురళీ బదిలీల వ్యవహారంలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న సదరు మంత్రివర్యులు సత్య శ్రీనివాస్ విషయంలో మాత్రం ఒకే మాట మీద నిలబడటంతో ఇదేమిటీ చెప్మా అని అటు పార్టీ నాయకులు, జిల్లా అధికారులు చెవులు కొరుకుంటున్నారు. -
ఆంధ్రజ్యోతికే ఎందుకు కనిపిస్తుందో...
హైదరాబాద్: మంత్రి వర్గ సహచరుడు గంటా శ్రీనివాసరావుకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏపీ అటవీశాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అనంతరం అయ్యన్నపాత్రుడు విలేకర్లతో మాట్లాడుతూ... గంటాకు తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు మీడియానే లేనిపోని రాద్దాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. తమ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ఒక్క ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చింది.... అయితే ఏ మీడియాకు కనిపించని వివాదం ఒక్క ఆంధ్రజ్యోతికే ఎందుకు కనిపిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఆర్డీవోల బదిలీ విషయంలో ఏ ఐఏఎస్ అధికారిని దూషించలేదని తెలిపారు. ఐఏఎస్ అధికారులంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. అధికారుల బదిలీ కోసం పోట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోమవారం సీఎం చంద్రబాబు తమ జిల్లాలో పర్యటించనున్నారు.. ఆ విషయంపై చర్చించేందుకే చంద్రబాబుతో భేటీ అయినట్లు అయ్యన్నపాత్రుడు వివరించారు. -
మళ్లీ అలా మొదలైంది ...
ఏ రెండు పార్టీలను కానీ ... ఏ రెండు వర్గాలను కానీ... ఏ ఇద్దరు వ్యక్తులను గాని రాజకీయాలు...కుదురుగా ఉండనియ్యవు. శత్రువులను మిత్రులగా మారుస్తుంది.. అంతలోనే మిత్రులను శత్రువులుగా మారుస్తుంది. అదే పవర్ ఫుల్ పొలిటికల్ గేమ్. దీనిలో ప్రవేశించిన వారిలో 99 శాతం మంది అధిపత్యం కోసం పోటీ పడుతుంటారు. చివరకు నీవెంత అంటే నీవెంత అనే స్థాయికి చేరుకుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ విశాఖ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు... గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు. వీరిద్దరు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవులు చేపట్టినా....వారి మధ్య సఖ్యత లేదు. ఇద్దరి మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల కాలంలో మంత్రివర్యులు సఖ్యతగా ఉన్నా మళ్లీ వ్యవహారం మొదటికొట్టింది. టీడీపీ స్థాపించిన నాటి నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీనే అంటిపెట్టుకున్నారు. దాంతో ఆయనకు ఆ పార్టీ పలుమార్లు మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానానే కట్టబెట్టింది. ఆ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖను అయ్యన్నపాత్రుడు చేపట్టారు. ఇక గంటా శ్రీనివాసరావు మాత్రం పలు పార్టీలు మారి ఆయా పార్టీలలో మంత్రి పదవులు అనుభవించి చివరకు సైకిల్ ఎక్కారు. మొదటి నుంచి గంటా అంటే అయ్యన్నపాత్రుడు మంట అన్న విషయం విదితమే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని భావించిన గంటా సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నించిన యత్నాలను అయ్యన్నపాత్రుడు తీవ్రంగా అడ్డుకున్నారు. అంతేకాకుండా తన మాట పెడ చెవిన పెట్టి గంటాను సైకిల్ ఎక్కించుకున్నారని చంద్రబాబుపై అయ్యన్న కొంత కాలం గుర్రుగా ఉన్నారు. వలస నేతల వల్ల పార్టీ భ్రష్టుపడుతుందంటూ అయ్యన్నపాత్రుడు...చంద్రబాబు సమక్షంలోనే బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత అయ్యన్న, గంటాల మధ్య బాబు కలిసి పనిచేసుకుపోవాలని సయోధ్య కుదిర్చారు. అయినా అవకాశం వచ్చినప్పుడల్లా వారి మధ్య జగడాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రుల మధ్య ఆర్డీవో బదిలీ చిచ్చు పెట్టింది. దాంతో ఆర్డీవోను ఇక్కడే ఉంచాలని గంటా పట్టుబడితే... లేదు ఆ ఆర్డీవోను బదిలీ చేయాలని అయ్యన్నపాత్రుడు ఉడుం పట్టుబడ్టారు. దీంతో ఇద్దరి మధ్య వైరం తారస్థాయికి చేరింది. చంద్రబాబు సింగపూర్ నుంచి రాగానే వీరిద్దరూ ఆయన దగ్గరే పంచాయితీ పెట్టి తేల్చుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. -
బాబుకన్నా నేనే సీనియర్: అయ్యన్నపాత్రుడు
పార్టీలోకి ‘గంటా’ లాంటి గజదొంగలొస్తున్నారు పవన్ పార్టీ పెడితే వారు అందులోకీ వెళతారు ప్రతిష్ట దెబ్బతింటోంది.. బాబు ఆలోచించాలి నర్సీపట్నం, న్యూస్‌లైన్: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చ ర్యలు చేపడితే పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అధ్యక్షుడు చంద్రబాబునాయుడినైనా ప్రశ్నించే హక్కు తనకు ఉందని పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. చంద్రబాబు కంటే తానే పార్టీలో సీనియర్‌నని, ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కొనసాగుతున్నానని చెప్పారు. ఇంటింటికీ తెలుగుదేశం వంద రోజుల పండుగను బుధవారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి ఉద్దేశంతో ఆ మహనీయుడు స్థాపించిన టీడీపీకిలోకి మాజీ మంత్రిగంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కన్నబాబు వంటి గజదొంగలు రావడంతో ప్రతిష్ఠత దెబ్బతింటుందని ఆందోళనవ్యక్తంచేశారు. దీనిపై చంద్రబాబు పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే గంటా అండ్‌కో వల్ల పార్టీకి ప్రమాదమని హెచ్చరించారు. తనకు ప్రజాబలం ఉందని, ఎక్కడైనా పోటీచేసే సత్తా ఉందని చెప్పే ‘గంటా’ దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేయాలని సవాల్ విసిరారు. గంటా ఎక్కడ అడుగుపెట్టినా ఆ పార్టీలు భూస్థాపితమవుతున్నాయని విమర్శించారు. చిరంజీవితో జతకట్టి పార్టీ జెండాయే పీకేశారని, కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టడం వల్ల ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైం దని తెలిపారు. రేపోమాపో పవన్‌కళ్యాణ్ కొత్తపార్టీని ప్రకటించే అవకాశం ఉందని, గంటా ఆ పార్టీలోకి కూడా జంప్ అవుతారేమోనని ఎద్దేవాచేశారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించడం వల్ల తనకు నష్టం కలుగుతుందన్న విషయం తెలుసని, ఆయన అవునన్నా, కాదన్నా, తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా టీడీపీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
టీడీపీలోకి గంటానా... నే నొప్పుకోను
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉత్తరాంధ్రలోని ఆ పార్టీ నేతలతో విశాఖపట్నంలో బుధవారం అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్లో ఆ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవలుతోపాటు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సిహెచ్ అయ్యన్న పాత్రుడు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అనకాపల్లి శాసనసభ్యుడు, మంత్రి గంటా శ్రీనివాసరావును తెలుగుదేశంలో పార్టీలోకి తీసుకునే విషయంపై వారు ఆ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. అయితే గంటాను తెలుగుదేశంలో చేర్చుకోనే విషయంపై అయ్యన్నపాత్రుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేర్చుకుంటే తాను ఒప్పుకునేది లేదని కరాకండిగా బాబు ముఖానే అయ్యన్నపాత్రుడు చెప్పినట్లు సమాచారం. గతంలో టీడీపీలో అనేక ఉన్నత పదవులు అలంకరించిన గంటా ఆ తర్వాత ప్రజారాజ్యంపార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి చేపట్టారని చంద్రబాబుకు అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. ఓడ ఎక్కినంత సేపు ఓడ మల్లన్న ఓడ దిగిన తర్వా బోడి మల్లన్న అనే వైఖరి గంటాకు అచ్చు గుద్దినట్లు సరిపోతుందని అయ్యన్నపాత్రుడు చంద్రబాబు వద్ద ఆక్రోశాన్ని వెళ్లగక్కారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో టీడీపీ ఎంపీగా పని చేశారు. అనంతరం ప్రముఖ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ణ్యా ప్రజారాజ్యాం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో గంటాను మంత్రి పదవి వరించింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తనదైన శైలీలో దూసుపొతుంది. కాంగ్రెస్ వైఖరిపై సీమాంధ్రులు మరింత గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలు గెలుపు గుర్రాలపై స్వారీ చేసే పార్టీలలో చేరేందుకు సమాయత్తమైయ్యారు.