ముట్టడి... కట్టడి
మంత్రి గంటాకు చెక్‌పెడుతున్న ప్రత్యర్థులు
చేతులు కలిపిన అయ్యన్న, ఎంవీవీఎస్ మూర్తి
జారుకుంటున గంటా వర్గీయులు
అనకాపల్లి, పెందుర్తి పరిణామాలతో సంకట స్థితి
రాసకందాయంలో జిల్లా టీడీపీ వర్గపోరు
జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రాభవానికి చెక్ పడుతోందా! సొంతింటి ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా ఆయనను బలహీనపరుస్తున్నారా? అందుకోసం ఆయన వ్యతిరేకులంతా ఏకమవుతున్నారా! జిల్లా టీడీపీలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఓ వైపు గంటా వ్యతిరేకులు అంతా ఏకమవుతూ... మరోవైపు ఆయన వర్గీయులను ఒక్కొక్కరిగా దూరం చేస్తూ ద్విముఖ వ్యూహంతో రాజకీయం సాగిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు తెలిసే ఈ వ్యవహారం సాగుతుండటంతో మంత్రి గంటా చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వస్తోంది.
విశాఖపట్నం : మంత్రి గంటాను రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు ఆయన ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారు. మంత్రి నారాయణ సహకారంతో చక్రం తిప్పొచ్చన్న ధీమాతో గంటా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ జిల్లా రాజకీయ సమీకరణలు తమకు అనుకూలంగా మలచుకుంటూ అయ్యన్నవర్గం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇంతకాలం మంత్రి అయ్యన్న, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రమే గంటాను బహిరంగంగా వ్యతిరేకిస్తూ వచ్చారు.
కానీ తాజాగా ఆ జాబితాలో ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి వచ్చి చేరారు. మంత్రి పదవిపై కన్నేసిన ఆయన జీవీఎంసీ పరిధిలో పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం నగరంలోని పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఎమ్మెల్సీ మూర్తితో సన్నిహితంగా ఉంటున్నారు. మరోవైపు అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల రాజకీయ సమీకరణలు కూడా గంటాను బలహీనపరిచేవిగానే ఉన్నాయి.
మంత్రి అయ్యన్న, ఎమ్మెల్సీ మూర్తి చాపకింద నీరులా అనకాపల్లి, పెందుర్తిలలో రాజ కీయ సమీకరణలను ప్రభావితం చేస్తున్నారు. తనకు కనీస సమాచారం కూడా లేకుండా జరుగుతున్న ఈ పరిణామాలతో గంటా వర్గం ఆత్మరక్షణలో పడిపోయింది. మంత్రి గంటాగానీ ఆయన వర్గీయుల సమ్మతితో నిమిత్తం లేకుండానే తాను నిర్ణయాలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దాంతో ఎదురుదాడి చేసేందుకు కూడా గంటా వర్గీయులకు అవకాశం లేకుండాపోయింది.
జారుకుంటున్న నేతలు
తాజా పరిణామాలతో మంత్రి గంటా వర్గంలోని కీలక నేతలు పునరాలోచనలో పడ్డారు. ఆయన నీడలో ఉండేకంటే తాము స్వతంత్రంగానో ఎమ్మెల్సీ మూర్తికి సన్నిహితంగానో వ్యవహరిస్తేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు స్వతంత్ర వైఖరి అవలంబిస్తున్నారు. సీనియర్ అయిన ఆయన కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
గంటాను తప్పిస్తే ఎమ్మెల్సీ మూర్తికిగాని, తనకుగాని మంత్రియోగం పడుతుందని... అన్నీ కలసివస్తే ఇద్దరం కూడా కేబినెట్ బెర్త్‌లు దక్కవచ్చన్నది ఆయన యోచన. కాబట్టి గంటా వర్గీయుడిగా ముద్రపడి అమాత్య యోగం అవకాశాలను ఎందుకు జారవిడుచుకోవాలని ఆయన భావిస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో తన ప్రయోజనాలు కాపాడలేని మంత్రి గంటా వర్గీయుడిగా కొనసాగడం శుద్ధ దండగన్నది ఎమ్మెల్యే బంగారు సత్యనారాయణమూర్తి ఉద్దేశంగా ఉన్నట్లు తెలిసింది.
అదే కోణంలో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కూడా గంటా పట్ల కినుక వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా టీడీపీలో మంత్రి గంటా రాజకీయ ప్రాభవానికి క్రమంగా గ్రహణం పడుతోందని. మరీ పట్టు నిలుపుకునేందుకు మంత్రి గంటా ఏ రీతిలో ఎదురుదాడి చేస్తారన్నది ప్రస్తుతం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. గంటా అంత సులువుగా ప్రత్యర్థులకు రాజకీయ మైదానాన్ని విడిచిపెట్టరని... రాజకీయ ఆట కొనసాగిస్తారని ఆయన సన్నిహితులు చెబతున్నారు. అదే జరిగితే జిల్లా టీడీపీలో పరిణామాలు మునుముందు మరింత రసకందాయంలో పడనుండటం ఖాయంగా కనిపిస్తోంది.