అడ్రస్ లేని అయ్యన్న.. వేడుకలకే గంటా సరి
- కుండపోతతో జనం అష్టకష్టాలు
- జాడ లేని జిల్లా మంత్రులు
- పదిమంది మృత్యువాత పడినా స్పందించని సచివులు
- అడ్రస్ లేని అయ్యన్న.. వేడుకలకే గంటా సరి
విశాఖపట్నం: పెను తుపానులను తలదన్నేలా అల్పపీడనం ప్రభావంతో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలకు ఇప్పటివరకు పది మంది మృత్యువాత పడ్డారు. 14 వంతెనలు దెబ్బతిన్నాయి. 10 చెరువులకు గండ్లు పడ్డాయి. దాదాపు పది వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు అధికారులే నిర్ధారించారు.
మరో రెండురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శక్తి మేరకు చర్యలు చేపడుతున్నా.. దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షించాల్సిన.. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల జాడ మాత్రం కనిపించడం లేదు.
ప్రజలు కష్టాల్లో ఉన్నా వారు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం వర్షాల పరిస్థితి, సహాయ చర్యలపై సమీక్షించకపోవడం మంత్రుల అంతులేని నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
అడ్రస్ లేని అయ్యన్న: చీటికీ మాటికీ తాను సీనియర్ మంత్రినని చెప్పుకునే అయ్యన్న.. వర్షాల దెబ్బకు జిల్లా అతలాకుతలమవుతున్నా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పోనీ జిల్లాను పక్కనపెట్టి కనీసం తను ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గాన్ని కూడా ఆయన కన్నెత్తి చూడలేదు.
తను ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల బాగానే పర్యటిస్తున్న అయ్యన్న కనీసం భారీవర్షాల సమయంలోనైనా సొంత జిల్లాలో పర్యటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వ్యక్తిగత పనుల మీద కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన సోమవారం గుంటూరులో జరిగిన సమావేశంలో పాల్గొన్నారని, మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తారని తెలిసింది.
పండుగలు, పబ్బాలకే గంటా పరిమితం: ఇక మరో మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరి కూడా విమర్శలకు తావిచ్చేలానే ఉంది. ప్రభుత్వం విశాఖ వేదికగా అట్టహాసంగా నిర్వహిస్తున్న సదస్సులు, సమావేశాల్లో ఆడంబరంగా కనిపించే మంత్రి గంటాకు జిల్లా ప్రజల వర్షం కష్టాలు మాత్రం పట్టలేదు. సహజంగానే విశాఖనగరం దాటి జిల్లాలో పర్యటించని గంటా ఇటీవల కాలంలో నగరంలోని సదస్సులు, ఉత్సవాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు మూటకట్టుకుంటున్నారు.
ఆదివారం నగరంలోనే ఉన్న ఆయన వివిధ షాపుల ప్రారంభోత్సవాలకు హాజరై బిజీగా గడిపారే గానీ,, వర్షాలపై అధికారులతో మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు. ఇక సోమవారం మాతాఅమృతమయి జన్మదినవేడుకల్లో పాల్గొనేందుకు కేరళ వెళ్లారు. నాలుగు నెలల ముందు రోనూ తుపాను సంభవించినప్పుడు కూడా ఇదే నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించారు. ఇప్పుడు భారీవర్షాలు పడగెత్తిన సమయంలోనూ ఇద్దరు మంత్రులూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సామాన్యప్రజల నుంచే కాదు టీడీపీ శ్రేణుల నుంచి కూడా అసంతృప్తి పెల్లుబికుతోంది.