విశాఖ టీడీపీలో కలకలం
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా టీడీపీలో మళ్లీ కలకలం మొదలైంది. జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, సిహెచ్ అయ్యన్నపాత్రుడి మధ్య వర్గ పోరు సద్దుమణిగినట్లే ఉండి... మళ్లీ వారి మధ్య వైరం తారస్థాయికి చేరింది. ఉన్నతవిద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకి చెక్ పెట్టేందుకు పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చకచకా పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా జిల్లాలోని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు మంగళవారం ఉదయం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
సదరు నేతలిద్దరిని మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు, ఏపీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్, ఆ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్వయంగా చంద్రబాబు నివాసానికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా వారు చంద్రబాబుతో మంతనాలు సాగించారు. కాగా ఈ భేటీని గంటాకు తెలియకుండా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అయితే చంద్రబాబుతో కొణతాల భేటీ కావడంపై మీడియా ద్వారా తెలుసుకున్న గంటా వర్గం వెంటనే అప్రమత్తమైంది. అయ్యన్న వర్గం చంద్రబాబుతో భేటీపై చర్చించేందుకు స్వయంగా గంటా ఛాంబర్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, పీలా గోవింద్, పి.గణబాబు అత్యవసరంగా సమావేశమయ్యారు. అయితే టీడీపీలో కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీల చేరికను గంటా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.