ఆంధ్రజ్యోతికే ఎందుకు కనిపిస్తుందో...
హైదరాబాద్: మంత్రి వర్గ సహచరుడు గంటా శ్రీనివాసరావుకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏపీ అటవీశాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ అనంతరం అయ్యన్నపాత్రుడు విలేకర్లతో మాట్లాడుతూ... గంటాకు తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు మీడియానే లేనిపోని రాద్దాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. తమ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ఒక్క ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చింది.... అయితే ఏ మీడియాకు కనిపించని వివాదం ఒక్క ఆంధ్రజ్యోతికే ఎందుకు కనిపిస్తుందో అర్థం కావడం లేదన్నారు.
ఆర్డీవోల బదిలీ విషయంలో ఏ ఐఏఎస్ అధికారిని దూషించలేదని తెలిపారు. ఐఏఎస్ అధికారులంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. అధికారుల బదిలీ కోసం పోట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోమవారం సీఎం చంద్రబాబు తమ జిల్లాలో పర్యటించనున్నారు.. ఆ విషయంపై చర్చించేందుకే చంద్రబాబుతో భేటీ అయినట్లు అయ్యన్నపాత్రుడు వివరించారు.