టీడీపీలోకి గంటానా... నే నొప్పుకోను
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉత్తరాంధ్రలోని ఆ పార్టీ నేతలతో విశాఖపట్నంలో బుధవారం అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్లో ఆ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యే పయ్యావుల కేశవలుతోపాటు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సిహెచ్ అయ్యన్న పాత్రుడు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అనకాపల్లి శాసనసభ్యుడు, మంత్రి గంటా శ్రీనివాసరావును తెలుగుదేశంలో పార్టీలోకి తీసుకునే విషయంపై వారు ఆ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
అయితే గంటాను తెలుగుదేశంలో చేర్చుకోనే విషయంపై అయ్యన్నపాత్రుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేర్చుకుంటే తాను ఒప్పుకునేది లేదని కరాకండిగా బాబు ముఖానే అయ్యన్నపాత్రుడు చెప్పినట్లు సమాచారం. గతంలో టీడీపీలో అనేక ఉన్నత పదవులు అలంకరించిన గంటా ఆ తర్వాత ప్రజారాజ్యంపార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి చేపట్టారని చంద్రబాబుకు అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. ఓడ ఎక్కినంత సేపు ఓడ మల్లన్న ఓడ దిగిన తర్వా బోడి మల్లన్న అనే వైఖరి గంటాకు అచ్చు గుద్దినట్లు సరిపోతుందని అయ్యన్నపాత్రుడు చంద్రబాబు వద్ద ఆక్రోశాన్ని వెళ్లగక్కారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో టీడీపీ ఎంపీగా పని చేశారు. అనంతరం ప్రముఖ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ణ్యా ప్రజారాజ్యాం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో గంటాను మంత్రి పదవి వరించింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తనదైన శైలీలో దూసుపొతుంది. కాంగ్రెస్ వైఖరిపై సీమాంధ్రులు మరింత గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలు గెలుపు గుర్రాలపై స్వారీ చేసే పార్టీలలో చేరేందుకు సమాయత్తమైయ్యారు.