
బాబుకన్నా నేనే సీనియర్: అయ్యన్నపాత్రుడు
పార్టీలోకి ‘గంటా’ లాంటి గజదొంగలొస్తున్నారు
పవన్ పార్టీ పెడితే వారు అందులోకీ వెళతారు
ప్రతిష్ట దెబ్బతింటోంది.. బాబు ఆలోచించాలి
నర్సీపట్నం, న్యూస్‌లైన్: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చ ర్యలు చేపడితే పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అధ్యక్షుడు చంద్రబాబునాయుడినైనా ప్రశ్నించే హక్కు తనకు ఉందని పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. చంద్రబాబు కంటే తానే పార్టీలో సీనియర్‌నని, ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కొనసాగుతున్నానని చెప్పారు. ఇంటింటికీ తెలుగుదేశం వంద రోజుల పండుగను బుధవారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి ఉద్దేశంతో ఆ మహనీయుడు స్థాపించిన టీడీపీకిలోకి మాజీ మంత్రిగంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కన్నబాబు వంటి గజదొంగలు రావడంతో ప్రతిష్ఠత దెబ్బతింటుందని ఆందోళనవ్యక్తంచేశారు.
దీనిపై చంద్రబాబు పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే గంటా అండ్‌కో వల్ల పార్టీకి ప్రమాదమని హెచ్చరించారు. తనకు ప్రజాబలం ఉందని, ఎక్కడైనా పోటీచేసే సత్తా ఉందని చెప్పే ‘గంటా’ దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేయాలని సవాల్ విసిరారు. గంటా ఎక్కడ అడుగుపెట్టినా ఆ పార్టీలు భూస్థాపితమవుతున్నాయని విమర్శించారు. చిరంజీవితో జతకట్టి పార్టీ జెండాయే పీకేశారని, కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టడం వల్ల ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైం దని తెలిపారు. రేపోమాపో పవన్‌కళ్యాణ్ కొత్తపార్టీని ప్రకటించే అవకాశం ఉందని, గంటా ఆ పార్టీలోకి కూడా జంప్ అవుతారేమోనని ఎద్దేవాచేశారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించడం వల్ల తనకు నష్టం కలుగుతుందన్న విషయం తెలుసని, ఆయన అవునన్నా, కాదన్నా, తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా టీడీపీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.