
సాక్షి, విశాఖపట్నం:జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ నూతన పాలకవర్గ నియామకం జిల్లా మంత్రులు సీహెచ్ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య మరోసారి చిచ్చు రేపింది. చీటికీ మాటికీ వీరిద్దరి మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న జిల్లా యంత్రాంగానికి ఈ పరిణామం ప్రాణసంకటంగా మారింది. తొలుత గంటా సిఫార్సుతో కొత్త పాలకవర్గ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ అయ్యన్న ఆగ్రహంతో యూ టర్న్ తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ ఆదేశాల మేరకే నియామకాలు.. ఎన్నికలు నిర్వహించామని, ఇప్పుడు తమపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమంటూ పశుసంవర్ధక శాఖాధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సిన తరుణంలో..
పాలకవర్గ ఎన్నిక జరిగి 65 రోజులు దాటిపోయింది. మరో రెండ్రోజుల్లో పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఎన్నిక ముగిసి బాధ్యతలు చేపట్టే సమయంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పాత పాలకవర్గాన్నే కొనసాగించాలంటూ తాను సిఫార్సు చేసినా పట్టించుకోకుండా కొత్త పాలకవర్గాన్ని ఎందుకు నియమించారంటూ సోమవారం ఉన్నట్టుండి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై ఫైర్ అయ్యారు. ఎన్నికలు ఆపమని, పాత పాలకవర్గాన్ని కొనసాగించాలంటూ తాను సిఫార్సు చేసినా పట్టించుకోకుండా ఎన్నికలు ఎందుకు నిర్వహించారంటూ ఒంటికాలిపై లేచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఈ కమిటీకి చైర్మన్‌గా ఎలా నియమిస్తారంటూ కలెక్టర్‌పై చిందులు తొక్కారు. అంతా నీ ఇష్టమేనా? అంటూ ఆయనపై మండిపడ్డారు. అంతే కాకుండా సీఎంఒ కార్యాలయంతోపాటు ఇన్‌చార్జి మంత్రి చినరాజప్పకు కూడా ఫిర్యాదు చేశారు. పైగా ఈ ఎన్నికను సాయంత్రంలోగా నిలుపుదల చేయకపోకే మంత్రి పదవికే తాను రాజీనామా చేస్తానంటూ బెదిరింపులకు దిగారు. మంత్రి అయ్యన్నతోపాటు ఇన్‌చార్జి మంత్రి చినరాజప్ప సైతం ఫైర్ అవడంతో కలెక్టర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు పశుగణాభివృద్ధి సంస్థ ఈవోతోపాటు పశుసంవర్ధక శాఖ జేడీ, ఇతర అధికారులను పిలిపించుకొని పరిస్థితిని సమీక్షించారు. తొలుత 17మందిని నామినేట్ చేయడమే కాకుండా ఎన్నికల నిర్వహణకు స్వయంగా ఆదేశాలిచ్చిన కలెక్టర్ మంత్రి అయ్యన్న ఒత్తిళ్లతో కొత్త పాలకవర్గ నియామకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ వివాదం
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ పాలకవర్గం ప్రస్తుత పదవీ కాలం ఈ నెల 5వ తేదీతో ముగియనుంది. రాఘవేంద్రరావు అధ్యక్షునిగా ఉన్న ఈ పాలకవర్గాన్ని కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేశారు. రెండు దఫాలుగా ఈ కమిటీయే కొనసాగుతోంది. కొత్త పాలకవర్గం ఏర్పాటు కోసం కసరత్తు మొదలైంది. ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న రాఘవేంద్రరావు నేతృత్వంలోని పాత పాలకవర్గాన్ని కొనసాగించడంపై మరో మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాల్సిందేనని కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో 17మందిని నామినేట్ చేస్తూ కలెక్టర్ జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. నామినేట్ చేసిన 21 రోజుల తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నికల కోసం జనవరి 21న కలెక్టర్ పేరిటే నోటీసులు జారీ చేశారు. సరిగ్గా అదే సమయంలో 23వ తేదీన పాతపాలకవర్గాన్ని కొనసాగించాలంటూ మంత్రి అయ్యన్న పాత్రుడు సిఫార్సు లేఖ పంపారు. అయితే అప్పటికే ఎన్నికకు నోటీసులు జారీ చేయడం, మంత్రి గంటా ఒత్తిళ్లు కారణంగా 27వ తేదీన బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో భీమిలికి చెందిన మాజీ ఎంపీపీ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గాడు వెంకటçప్పడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ మేరకు కలెక్టర్‌తోపాటు ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో కూడా అదే నెలలో నియమామకం పూర్తయినట్టుగా లేఖ కూడా రాశారు.
నా నియామకాన్ని ఎందుకుఅడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదు
బీసీ మంత్రి అయి ఉండి కూడా బీసీ అభ్యర్థినైన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. నేనే పార్టీలో సీనియర్ కార్యకర్తను. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడగా ఉన్నాను. గతంలో రెండుసార్లు భీమునిపట్నం ఎంపీపీగా చేశాను. మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మండల పార్టీ అధ్యక్షునిగా కూడా చేశా. పార్టీలో సీనియర్ అయిన నన్ను కాదని కాంగ్రెస్‌కు చెందిన పాత పాలకవర్గ అధ్యక్షుడు రాఘవేంద్రరావు నేతృత్వంలోని కమిటీని కొనసాగించాలంటూ అయ్యన్న సిఫార్సు చేయడం ఎంతవరకు సమంజసం? నా ఎన్నిక పూర్తిగా నిబంధనల మేరకే జరిగింది. నాతో సహా 17 మందిని కలెక్టర్ స్వయంగా నామినేట్ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అంతా బైలా ప్రకారం జరిగిన ఈ ఎన్నికలో నేను అధ్యక్షునిగా ఎన్నికయ్యా. నేనేమీ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కాదు.. పక్కా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఏ కారణంతో అయ్యన్న నా నియామకాన్ని అడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదు.–గాడు వెంకటప్పడు, డీఎల్‌డీఎ చైర్మన్‌గా ఎన్నికైన వ్యక్తి
Comments
Please login to add a commentAdd a comment