డ్వాక్రా మహిళలకు బాబు ఢోకా
సాక్షి, కాకినాడ :రుణమాఫీ అంటూ ఆశపెట్టి, చివరికి శఠగోపం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై డ్వాక్రా మహిళలు మండి పడుతున్నారు. రైతు రుణాలతో పోలిస్తే తమ రుణాలు చిన్నమొత్తాలు కావడంతో కచ్చితంగా మొత్తం మాఫీ చేస్తారని గంపెడాశలు పెట్టుకున్న డ్వాక్రా మహిళలు ఆరేడు నెలల నుంచి వాయిదాలు కట్టడం మానేశారు. చివరికి రైతులకు కుటుంబం యూనిట్‌గా లక్షన్నర రుణమాఫీతో సరిపెట్టినట్టే డ్వాక్రా సంఘాలకుకూడా లక్ష వరకు మ్యాచింగ్‌గ్రాంట్ అదీ గరిష్టంగా ఇస్తామని ప్రకటించిన బాబు సర్కార్ మహిళలను హతాశులను చేసింది. రూ.లక్ష లోపు ఎంత రుణముంటే ఆ మేరకే ఆ గ్రాంట్ ఉంటుందని, తామిచ్చేది గ్రాంటే తప్ప రుణమాఫీ కాదని తేల్చేసింది. దీంతో ఈ మొత్తం సంఘాల
పొదుపు ఖాతాకే తప్ప రుణఖాతాలకు జమ కాదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. డ్వాక్రా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినట్టేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో పలు ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్‌లు ఇచ్చాయంటున్నారు.జిల్లాలో 74 వేల సంఘాలకు రూ.1343 కోట్ల రుణబకాయిలున్నాయి. గరిష్టంగా రూ. లక్ష వరకు మ్యాచింగ్ గ్రాంట్ ప్రకటించడంతో లక్షలోపు రుణాలున్న సంఘాలకే మే లు జరుగుతుందని తేలిపోయింది. ఆ సంఘాలకు కూడా గ్రాంట్‌లో కనీసం 20 నుంచి 30 శాతం వడ్డీకే సరిపోతుందని అంచనా. ఇక లక్షకు పైబడి రుణాలున్న సంఘాల పరిస్థితి మరీ దయనీయం కానుంది.
బాబు మాటలు నమ్మి ఆరేడు నెలలుగా వాయిదాలు చెల్లించక ఓపక్క వడ్డీ రాయితీని కోల్పోగా, మరోపక్క వడ్డీతో చెల్లించాల్సిన వాయిదాల మొత్తం తడిసి మోపెడవనుంది. లక్షలోపు రుణాలున్న సంఘాలు 21,970 ఉంటే లక్షకు పైబడినవి 55 వేలకు పైగా ఉన్నాయి. గరిష్టంగా రూ.50 వేల వరకు రుణాలున్నవి ఐదారు వేలుంటే, రూ.75 వేల వరకు ఉన్నవి మరో నాలుగైదు వేలు. రూ.2 లక్షల వరకు రుణాలున్నవి 12 వేల వరకు, రూ.3 లక్షల వరకు రుణాలున్నవి 10 వేల వరకు, రూ.4 లక్షల వరకు రుణాలున్నవి ఐదువేల వరకు, ఐదులక్షల వరకు రు ణాలున్నవి 30 వేల వరకు ఉన్నాయి. 74 వేల సంఘాలకు కనీసం రూ.740 కోట్ల వరకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చెపుతు న్నా.. ఇందులోనూ మెలిక ఉందని, లక్ష లోపు బకాయి ఉన్న సంఘాలకు ఆ బకాయి మొత్తం మాత్రమే గ్రాంట్‌గా ఇస్తారని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి సంఘాలకున్న రుణాల్ని బట్టి చూస్తే చేకూరే లబ్ధి రుణంలో సగం కూడా ఉండదంటున్నారు.
ఒక్కొక్కరికీ ఒరిగేది అత్యల్పమే..
ఐదులక్షల రుణం తీసుకున్న సంఘం క్రమం తప్పకుండా 14 శాతం వడ్డీతో వాయిదాలు చెల్లిస్తే వడ్డీరాయితీగా వచ్చేది రూ.2.20 లక్షల వరకు ఉంటుంది. రూ.5 లక్షలు తీసుకున్న సంఘాల్లో పెక్కింటికి ఇంకా రూ.3 లక్ష ల వర కు అప్పు ఉంది. ఈ మొత్తానికి గత ఆరేడు నెలలకు రూ.60 వేలకు పైగా వడ్డీఅవుతుంది. రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్‌లో సగానికిపైగా ఈవడ్డీకే సరిపోతుంది. ఇక సంఘానికి మిగి లేది రూ.40 వేలలోపే. అంటే 10 నుంచి 12 వరకు ఉండే సంఘసభ్యుల్లో ఒక్కొక్కరికీ రూ.4 వేలు కూడా దక్కదన్న మాట.
రుణాల కోసం బ్యాంకర్ల ఒత్తిడి
ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ మెలిక పెట్టడంతో వెంటనే బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని అప్పుడే బ్యాంకులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టాయి. ఆ గ్రాంట్ ఎప్పుడు, ఎలా వేస్తారో స్పష్టత లేనందున ఆ లస్యం చేయకుండా వాయిదాలు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వడ్డీతో సహా వాయిదాల మొ త్తం ఏ విధంగా చెల్లించాలో తెలియక డ్వాక్రా మహిళలు తల్లడిల్లిపోతున్నారు. బాబును నమ్మి నిలువునా మునిగిపోయామని లబోదిబోమంటున్నారు.