అటు తిరకాసు..ఇటు నోటీసు
మండపేట :రుణ మాఫీపై చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీతో గత నాలుగు నెలలుగా రైతులు బ్యాంకులకు వాయిదాలు చెల్లించడం మానేశారు. ఇక రుణమాఫీనే అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు తన హామీ అమలుకు అంటూ కమిటీ వేయడం రైతుల్లో ఆందోళనను నింపగా బ్యాంకర్లను ‘వసూళ్ల’కు పురిగొల్పింది. నిన్నమొన్నటి వరకు మిన్నకున్న బ్యాంకర్లు రుణాలు చెల్లించమని నోటీసులివ్వడానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వరంగంలోని ఓ బ్యాంకు మండపేట శాఖ ఇప్పటికే బంగారు రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులిచ్చింది.
అన్నదాతలు ఆశించినట్టు.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే చంద్రబాబు రుణాలను మాఫీ చేయడంపై కాక.. ఆ హామీ అమలుపై విధివిధానాలు రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ మాత్రమే సంతకం చేశారు. 45 రోజుల తర్వాత కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మార్గదర్శకాలు రూపొందిస్తామని మెలిక పెట్టారు. టీడీపీ ఎన్నికల హామీతో గత కొద్ది నెలలుగా రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించడం లేదు. కమిటీ నివేదిక వచ్చేందుకు మరో 40 రోజులు పడుతుంది.
ఏ రుణాలు, ఎంత కాలం వరకు రద్దు చేస్తారో కూడా స్పష్టత లేదు. నివేదికపై మార్గదర్శకాలు రూపొందించి, వాటిని అమల్లోకి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. అప్పటి వరకు రైతులు రుణాలు చెల్లించకుంటే ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయన్న ఆందోళనతో బ్యాంకర్లు నిబంధనల మేరకు రైతుల నుంచి రుణాలు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మండపేటలోని ఆ బ్యాంకు శాఖ చెల్లింపు గడువు ముగిసిన సుమారు రూ.20 కోట్ల రుణాలకు సంబంధించి మండపేట, అర్తమూరు, పెడపర్తి తదితర గ్రామాల్లోని సుమారు 170 మంది రైతులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరికొన్ని బ్యాంకులూ నోటీసుల జారీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో రుణమాఫీ కోసం గంపెడాశతో ఎదురుచూసిన రైతులు హతాశులవుతున్నారు. గతంలోనే చెల్లించి ఉంటే వడ్డీ భారమైనా తగ్గేదని, టీడీపీ హామీ తమ కొంప ముంచేలా ఉందని వాపోతున్నారు. తీరా చెల్లించాక రుణాలు రద్దు చేస్తే నష్టపోతామని, అలాగని చెల్లించకుండా ఉండి.. అప్పుడు రుణమాఫీ జరగకపోతే వడ్డీ తడిసి మోపెడవుతుందని, ఈలోగా కాలపరిమితి ముగిస్తే బంగారం వేలం వేస్తారని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. బ్యాంకుల నుంచి ఒత్తిడి లేకుండా, తాము నష్టపోకుండా ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రుణాలు రద్దు చేయకుంటే
ఆందోళన : పాపారాయుడు
రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకోమని వైఎస్సార్ కాంగ్రెస్ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు అన్నారు. బ్యాంకు నుంచి వచ్చిన నోటీసులను కొందరు రైతులు ఆయనకు చూపి ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ బూటకపు వాగ్దానమనడానికి ఈ నోటీసులే నిదర్శనమన్నారు. షరతులు లేని రుణమాఫీని అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. పార్టీ నాయకులు పిల్లా వీరబాబు, సిరసపల్లి నాగేంద్ర, రైతులు ద్వారంపూడి శివభాస్కరరెడ్డి, చిర్ల వీర్రెడ్డి పాల్గొన్నారు.
ఏం చేయాలో తోచడం లేదు..
తుపాన్లతో తీవ్రంగా నష్టపోయాం. రుణా లు మాఫీ చేస్తారన్న గంపెడాశతో ఎన్నికల్లో టీడీపీని గెలిపించాం. రుణం చెల్లించమంటూ ఇప్పుడు బ్యాంకు నుంచి నోటీసులు పంపారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
- కోనాల ధ నరెడ్డి, రైతు, అర్తమూరు, మండపేట మండలం
హామీని నిలబెట్టుకోవాలి..
బంగారు రుణాలు చెల్లించమని నోటీసులు వచ్చాయి. ఇప్పటి వరకూ రుణం రద్దవుతుందన్న ఆశతో ఉన్నాం. రుణమాఫీపై ప్రభుత్వం త్వరగా స్పందించి, అన్ని రుణాలూ రద్దు చేస్తామన్న హామీని నిలుపుకోవాలి.
- తాడి జయరామారెడ్డి, రైతు,
అర్తమూరు మండపేట మండలం