ఈ భారం మోయలేం.. | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

ఈ భారం మోయలేం..

Published Thu, Jun 19 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

ఈ భారం మోయలేం..

ఈ భారం మోయలేం..

సాక్షి, కాకినాడ :డ్వాక్రా సంఘాల పొదుపు సొమ్ముకు వేతనాల సాకుతో కోత పెట్టనుంది సర్కారు. ఈ భారం మోయలేమన్న డ్వాక్రా మహిళల గగ్గోలును పెడచెవిన పెట్టి సంఘానికి రూ.1000 చొప్పున జిల్లాలోని మహిళా సంఘాల పొదుపు ఖాతాల నుంచి ఏటా రూ.8.5 కోట్లకు పైగా బలవంతంగా వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీతో కలిపి   90 వేల సంఘాల పరిధిలో సుమారు 9.50 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారు నెలకు రూ.50 చొప్పున తమ పొదుపు ఖాతాలో జమ చేసుకుంటారు. సంఘాల నెలవారీ సమావేశాలు, రుణాల మంజూరు, ఇతర పనుల్లో సహకరించేందుకు జిల్లావ్యాప్తంగా 2900 మంది యానిమేటర్లు, బుక్ కీపర్లు పనిచేస్తున్నారు. ఒక్కో యానిమేటర్, బుక్ కీపర్ల పరిధిలో పది నుంచి ముప్ఫై సంఘాల వరకు ఉంటాయి. వీరికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నుంచి రూ.2000, మండల సమాఖ్యల ద్వారా మరో రూ.వెయ్యి నుంచి రూ.1300 చొప్పున ఇచ్చేవారు.
 
 అయినా వీరు  ప్రతి నెలా జరిగే సంఘ సమావేశం మినిట్స్ రాసే నెపంతో రూ.50 చొప్పున వసూలు చేస్తుంటారు. ఇక మంజూరైన రుణాన్ని బట్టి ఒక్కో సంఘం వద్దా రూ.50 నుంచి రూ.500 వరకు దండుకోవడం పరిపాటి. ఈ అనధికారిక వసూళ్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు వీరికి క్రమం తప్పకుండా వేతనాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. సెర్ప్  ఇచ్చే రూ.2000కు అదనంగా సీనియారిటీని బట్టి రూ.1000 నుంచి రూ.2500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ అదనపు సొమ్మును ప్రభుత్వం ఇవ్వడం కాక ప్రతి సంఘం నుంచి ఏటా రూ.1000 చొప్పున వసూలు చేయాలని గత నెలలో జరిగిన జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో తీర్మానం చేశారు.
 
 ఆరునూరైనా అమలుకే సిద్ధం..
 సమాఖ్య నిర్ణయాన్ని మండల, గ్రామసమాఖ్యలు తీవ్రంగా వ్యతిరేకించి, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని తేల్చిచెప్పినా అధికారులు ఖాతరు చేయడం లేదు.  ఈ నెలాఖరులోగా జిల్లాలోని సంఘాల పొదుపుఖాతాల నుంచి రూ.1000 చొప్పున మినహాయించుకోవాలని బుధవారం సామర్లకోటలో జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో తీర్మానించారు. ఈ నెల 25 నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలనీ నిర్ణయించారు. సమాఖ్యలు, సంఘాలు గగ్గోలు పెడుతున్నా జిల్లా అధికారులు మొండిగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 ప్రతి నెలా ఠంచన్‌గా వేతనాలు అందజేస్తున్నా సంఘాల నుంచి బుక్ కీపింగ్, సమావేశాల నిర్వహణ, రుణాల మంజూరు తదితర సేవలకు గతంలో మాదిరిగానే వసూళ్లను కొనసాగిస్తారని, అవగాహన లేని సంఘాల సభ్యులు వారికి ప్రతి నెల  మాదిరిగా ముట్టజెబుతుంటారని పలువురు అంటున్నారు. జిల్లా సమాఖ్య నిర్ణయం వల్ల సంఘాల నెలవారీ చెల్లింపులతో పాటు పొదుపు ఖాతాలో కూడా కోత పడే పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు. కాగా జిల్లా సమాఖ్య తీర్మానం మేరకే సంఘాల పొదుపు ఖాతాల నుంచి రూ.1000 వసూలు చేయనున్నట్టు డీఆర్‌డీఏ ప్రాజెక్టు మేనేజర్ బాబూరావు చెప్పారు. సెర్ప్ నుంచి ఇచ్చే మొత్తానికి అదనంగా మండల సమాఖ్యల నుంచి సీనియారిటీని బట్టి చెల్లించనున్నందున, సంఘాలు నేరుగా యానిమేటర్లకు ఎలాంటి చెల్లింపులు చేయనవసరం లేదన్నారు.
 
 మా పొదుపు నుంచి జీతాలా?
 ఇంత దారుణం ఎక్కడా ఉండదు. 1995 నుంచి డ్వాక్రా సంఘాలను నడుపుకొంటున్నాం. డబ్బులు పోగేసుకుంటున్నాం. ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. మేము పొదుపు చేసుకున్న సొమ్ములో నుంచి యానిమేటర్లకు జీతాలివ్వడం అన్యాయం
 - గురిమెళ్ల గంగారత్నం, డ్వాక్రా సంఘ సభ్యురాలు,
 పోలేకుర్రు, తాళ్లరేవు మండలం
 
 మేము చెల్లించే ప్రసక్తే లేదు..
 క్షేత్ర స్థాయిలో డ్వాక్రా సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ వసూళ్లకు పాల్పడడం సరికాదు. గ్రామ సమాఖ్యల ఆమోదం లేకుండా జిల్లా సమాఖ్య తీర్మానాన్ని అమలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము చెల్లించే ప్రసక్తే లేదు.
 - కె.వెంకటరమణ, శ్రీవిజయలక్ష్మి డ్వాక్రా సంఘ సభ్యురాలు,
 తూర్పుపేట, తాళ్లరేవు మండలం
 
 వారి జీతాల్ని ప్రభుత్వమే చెల్లించాలి
 యానిమేటర్ల జీతాల చెల్లింపుల భారాన్ని డ్వాక్రా సంఘాల సభ్యులపై మోపడం భావ్యం కాదు. వారి పొదుపు సొమ్ముకు ఎసరు పెట్టే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకోవడం అన్యాయం. ప్రభుత్వమే యానిమేటర్ల జీతాలను నేరుగా చెల్లించాలి.
 - గునిపే అన్నామణి, తాళ్లరేవు మండల మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement