రుణమాఫీని నమ్ముకుని..
దేవరపల్లి : రుణమాఫీ పథకాన్ని నమ్ముకున్న వర్జీనియా పొగాకు రైతులు నిండా మునిగిపోయారు. రుణమాఫీ పథకంతో తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయని భావించి పొగాకు ధర బాగున్నప్పుడు విక్రయించుకోలేకపోయారు. తీరా రుణమాఫీ పొగాకు రైతులకు లేదని ప్రభుత్వం ప్రకటించడంతో పొగాకు బేళ్లను విక్రయాలకు పెట్టినా ధర పతనం కావడంతో తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
వర్జీనియా పొగాకు మార్కెట్ రైతులను తీవ్రంగా నిరాశపర్చింది. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా ధరలు పుంజుకోకపోవడంతో రైతులకు నష్టాలు తప్పలేదు. మూడు నెలలుగా పొగాకు మార్కెట్ సంక్షోభంలో నడుస్తోంది. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో సుమారు నెలరోజులు పొగాకు విక్రయాలను నెమ్మదిగా జరిపారు.
సమయంలో పొగాకును విక్రయిస్తే వచ్చే మొత్తం బ్యాంకులకు జమైపోతుందని, రుణమాఫీ చేస్తే తమకు లభించేది ఏమీ ఉండదని రైతులు భావించి తమ పొగాకు బేళ్లను విక్రయానికి పెట్టలేదు. తీరా రుణమాఫీ పొగాకు రైతులకు వర్తించదని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు జూలై 15 నుంచి అమ్మకాలను వేగం పెంచారు. పొగాకు అమ్మకాలు ఊపందుకున్నప్పుడు మార్కెట్‌లో ధరలు పతనమవడం ప్రారంభమయ్యాయి. రుణమాఫీని నమ్ముకుని అన్ని విధాలుగా నష్టపోయామని రైతులు
వాపోతున్నారు.
పతనమైన ధరలు
ఈ ఏడాది పొగాకు పండించిన రైతులకు కోలుకోని దెబ్బతగిలింది. జూన్‌లో కిలో గరిష్ట ధర రూ.177, సగటు ధర రూ.159 పలికింది. జూలైలో ఈ ధరలు పతనమయ్యాయి. గరిష్ట ధర రూ.154 నుంచి 168 మాత్రమే పలకగా సగటు ధర రూ.149 మాత్రమే నమోదైంది. ఆగస్టులో మార్కెట్ పూర్తిగా సంక్షోభంలో పడింది. ఎక్కువ కంపెనీలు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో ధర అంతంతమాత్రంగానే పలుకుతోంది. చిన్న కంపెనీలు కొనుగోళ్లకు పూర్తిగా దూరం అయ్యాయి. పెద్ద కంపెనీలైన ఐటీసీ, జీపీఐ మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. వీటికి పోటీలేకపోవడంతో వారు చెప్పిందే ధర అయ్యింది. శనివారం కిలో గరిష్ట ధర దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.166, కనిష్ట ధర రూ.10, సగటు ధర రూ.111.65 పలికింది.