రుణమాఫీ కోరుతూ డ్వాక్రా మహిళల ధర్నా
ఆకివీడు : ఎటువంటి షరతులు లేకుండా డ్వా క్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయూలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా కార్యదర్శి జి.విజయలక్ష్మి డిమాండ్ చేశారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో స్థానిక మండల సమాఖ్య కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు గురువారం ధర్నా చేశారు. అనంతరం సమాఖ్య కార్యాలయంలో బైఠయించి చంద్రబాబు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇవ్వడంతో మహిళలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. రుణమాఫీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తే.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నేటికీ రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. సంక్షేమ, పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారికి రుణమాఫీ వర్తించదనడం దుర్మార్గమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయూలని డిమాండ్ చేశారు. ఐద్వా డివిజన్ శాఖ కార్యదర్శి డి.కల్యాణి మాట్లాడుతూ రుణమాఫీ కోసం ఆశతో ఎదురుచూస్తున్న డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయన్నారు. సభ్యులకు తెలియకుండానే పొదుపు సొమ్ముల్ని బ్యాం క్‌లు బకాయిలకు జమచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల అశలు వమ్ము అయితే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా మండల శాఖ అధ్యక్షులు దొడ్డి పద్మ, కార్యదర్శి బి.సత్యవతి, పట్టణ శాఖ అధ్యక్షులు యర్రా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.