సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్ వ్యవహారంపై నిక్కచ్చిగా ఆడిట్ చేసినందుకే ఐఆర్‌ఎస్ అధికారి కృష్ణకిషోర్‌పై కక్ష గట్టి పద్ధతి లేకుండా ఆయన్ను సస్పెండ్ చేశారని ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇది ఉన్మాది చర్య కాకుంటే మరేంటన్నారు. శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూకుమ్మడిగా తనపై దాడి చేయాలనుకుంటున్నారని, మీరింతలా కక్ష సాధిస్తారని తెలిస్తే ప్రజలు వైఎస్సార్‌సీపీకి అధికారం ఇచ్చేవారు కాదని అన్నారు. సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు స్పీకర్ ఎప్పుడంటే అప్పుడు మైక్ ఇస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అడ్డుకునే అధికారం చీఫ్ మార్షల్‌కు ఉంటుందా? అని మండిపడ్డారు.
చీఫ్ మార్షల్‌ను బాస్టర్డ్ అన్నానని వక్రీకరించారని, సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి అనని మాటలు అన్నట్లు చెబుతున్నారని అన్నారు. సీఎం విలువలు, విశ్వసనీయత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కృష్ణకిషోర్ అంశం చర్చకు రాకుండా సబ్జెక్ట్ డైవర్ట్ చేశారని ఆరోపించారు. సీఎంపై సభాహక్కుల నోటీసిచ్చామని చెప్పారు. ఇదిలా ఉంటే.. ‘ప్రతిపక్ష సభ్యుల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమనే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది వైఎస్సార్‌సీపీవాళ్లే. తిరిగి నేనే అనని పదాన్ని అన్నట్లుగా వాళ్లు సభలో సృష్టించారు. ఎంత కోపంలోనైనా వైఎస్సార్‌సీపీ వాళ్లలాగా సంస్కారహీనమైన భాష ఉపయోగించడం, అమర్యాదకరంగా ప్రవర్తించడం నాకు రాదు’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment