విజయవాడ : ప్రభుత్వ తీరును ఎండగట్టడమే ప్రతిపక్ష పార్టీ లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వ దొంగ విధానాలను ప్రజలకు చెప్పడమే ప్రతిపక్షం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ 'దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో పాలన నడుస్తోంది.
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు అన్యాయమైన పాలన చేస్తున్నారు. అవినీతి దశ వైపు ఈ ప్రభుత్వం పయనిస్తోంది. ముడుపుల కోసం పోలవరాన్ని పక్కనపెట్టి...పట్టిసీమపై దృష్టి పెట్టారు.
24 గంటల విద్యుత్ విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదు. కానీ బాబు మహానాడు వేదికగా విద్యుత్పై గొప్పలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వాలు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజు అవసరానికి మించి దేశంలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. పంచాయతీలను నిర్వీర్యం చేసి గ్రామాల్లో కిరికిరి కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు రూ.1000 పింఛన్కు రూ.100 నొక్కేస్తున్నారు.
గతంలో చంద్రబాబు 9ఏళ్ల పాలనలో మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ...వైఎస్ఆర్ ఆ వ్యవస్థలకు మళ్లీ జీవం పోశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వితండ వాదం చేస్తున్నారు. ఒకవైపు జీడీపీ పెరుగుతుందంటునే...మరోవైపు డబ్బులు లేవంటున్నారు. జీడీపీ పెరిగితే ఆ మేరకు రాష్ట్రాదాయం కూడా పెరగాలి కదా?. మరి ఆ పెరిగిన రెవెన్యూను ఏం చేశారు?. కమీషన్లు, కక్కుర్తి, కన్సల్టెన్సీలకు చంద్రబాబు డబ్బు తగలేస్తున్నారు. చంద్రబాబు అవాస్తవ ప్రచారాలను వైఎస్ఆర్ సీపీ శ్రేణులు తిప్పి కొట్టాలి' అని పిలుపునిచ్చారు.