ప్యాకేజీని అంగీకరించడానికి మీరెవరు?
విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలందరి హక్కు అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజలందరు సాధించుకున్న హక్కు అయిన హోదాను కాదని, ప్యాకేజీని అంగీకరించడానికి ప్రభుత్వం ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ప్రజలందరి ఆకాంక్షలను తెలియజేయడానికే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ‘ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ ప్రకటనను సమర్థించిన అప్పటి ప్రతిపక్షం బీజేపీ పదేళ్లు హోదా కావాలని కోరింది’ అని గుర్తుచేశారు. విభజనతో జరిగే నష్టాన్ని పూడ్చేందుకు, విభజన ఇష్టం లేని ప్రజలందరినీ సముదాయించేందుకు ప్రత్యేక హోదా హామీని అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు.
ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను వదిలేసుకుంటున్నట్టు చంద్రబాబు చల్లగా చెప్పారని విమర్శించారు. దీంతో అర్ధరాత్రి ప్యాకేజీ ఇస్తే చాలన్నట్టుగా అరుణ్ జైట్లీ అర్ధరాత్రి ప్రకటన చేశారని, ఒక ప్రాంతం ప్రజలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ఎలా వదిలేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలతో, ప్రతిపక్షంతో ఏమాత్రం సంప్రదించకుండా గుట్టుచప్పుడు కాకుండా హోదా అంశాన్ని పక్కనపెట్టేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.