'ఎవ్వరికీ భయపడం.. వెనుకడుగు వేయం'
అమరావతి: ప్రజల తరుపున పోరాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది విలువైన సదావర్తి సత్రం భూములను లక్షలకే అమ్మేశారని చెప్పారు. ఈ అమ్మకానికి సంబంధించిన మొత్తం వ్యవహారం తేల్చేందుకు తమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక నిజనిర్ధారణ కమిటీ వేశారని తెలిపారు.
అందులో భాగంగానే తాము వాస్తవాలు తెలుసుకునేందుకు ఇక్కడి వచ్చామని చెప్పారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సరిహద్దులో ఉన్న విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం తన సన్నిహితులకు తక్కువ ధరకు కట్టబెట్టిన తీరుపై అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రూ. 1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నాయకుల నుంచి విడిపించి దేవస్థానానికి వెనక్కి ఇప్పించేలా పోరాడేందుకు పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో అమరేశ్వరుడి భూముల పరిరక్షణ కమిటీని నియమించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నాఉ. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ కమిటీ అమరావతిని సందర్శించింది. ఈ సందర్భంగా వారిని కొందరు టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, గ్రామస్తులు వారికి అండగా నిలిచి సత్రం ప్రాంతాన్ని సందర్శించేలా చేశారు. ఈ సందర్భంగా ధర్మానా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
సత్రం భూముల అమ్మకాలకు సంబంధించి విలువైన సమాచారం సేకరించామని తెలిపారు. కోట్లాది విలువైన ఈ భూములను లక్షలకే అమ్మేయడం పెద్దలకు, పీఠాధిపతులకు విచారం కలిగించిందని అన్నారు. నిజనిజాలు ప్రజలకు దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళతామని అన్నారు. త్వరలోనే చెన్నై వెళతామని, అక్కడ భూముల రేట్లు కనుక్కుంటామని చెప్పారు. అసలు చట్టప్రకారం ఈ భూములు అమ్మకాలు చేశారా? కోర్టు పరిధికి లోబడి పనిచేశారా? ఈ కుట్రకు ప్రధాన కారకులు ఎవరనే విషయం త్వరలోనే తేల్చి ఐదుకోట్ల ప్రజానీకానికి తెలియజేస్తామని అన్నారు.