Sadavarti Satram
-
సత్రం భూములు కొంటే.. తప్పేంటి?
చౌకగా వచ్చాయి కాబట్టే కొన్నాం : రామానుజయ సాక్షి, విశాఖపట్నం: ‘‘సదావర్తి సత్రానికి చెందిన భూములు చౌకగా వస్తున్నాయి కాబట్టే కొనుగోలు చేశాం.. దాంట్లో తప్పేముంది’’ అని రాష్ర్ట కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ప్రశ్నించారు. వేలంలో ఇతర పాటదారులు, మీడియా సమక్షంలోనే ఈ భూములను తన కుమారుడు సొంతం చేసుకున్నాడని స్పష్టం చేశారు. ఆయన గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. ఆక్రమణదారుల నుంచి భూములను పరిరక్షించుకోలేక సత్రం పాలకవర్గం వేలం నిర్వహించిందన్నారు. వీటి విలువ మార్కెట్లో భారీగానే ఉన్నప్పటికీ వివాదాల కారణంగా తక్కువ ధరకే వేలం వేశారని చెప్పారు. 83 ఎకరాల విక్రయానికి వేలం నిర్వహించారని వెల్లడించారు. ఇతర పాటదారుల మాదిరిగానే తన కుమారుడు కూడా పాల్గొని, భూములను సొంతం చేసుకున్నాడని చెప్పారు. ఈ వ్యవహారాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. -
సదావర్తి భూములు కొనుగోలు చేశాం
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ సాక్షి, విజయవాడ బ్యూరో: చెన్నైలో సదావర్తి సత్రం భూములను తాము కొనుగోలు చేసిన మాట నిజమేనని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సదావర్తి సత్రం భూముల వేలం పాటలో తన కుమారుడు, అతని వ్యాపార భాగస్వాములు పాల్గొనడం నిజమేనని ఒప్పుకొన్నారు. కానీ సత్రం భూముల వివరాలు పూర్తిగా తెలియక ఆ వ్యవహారంలోకి వెళ్లి ఇరుక్కుపోయామన్నారు. సత్రం భూములు అన్యాక్రాంతమయ్యాయని, కోర్టు వివాదాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ భూముల విలువ ఎకరం రూ. 6.5 కోట్లుంటుందని దేవాదాయ శాఖాధికారి తేల్చిన విషయం తెలియదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు. -
నేడు చెన్నైకి వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ
చెన్నై: ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని సదావతి సత్రం భూముల స్వాహా ఉదంతంపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పడిన నిజ నిర్ధారణ కమిటీ చెన్నైశివార్లు ఓఎమ్ఆర్ రోడ్డులోని సత్రం భూముల్లో ఆదివారం పర్యటించనుంది. భూముల వేలం వ్యవహారంపై కమిటీ ఆరా తీయనుంది. అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై ఓఎమ్ఆర్ రోడ్డులోని 471 ఎకరాలు ఓ దాత నుంచి సంక్రమించాయి. ఇందులోని 83.11 ఎకరాలను ఏపీ ప్రభుత్వ ఎండోమెంటు శాఖ ఈ ఏడాది మార్చిలో వేలం పాట ద్వారా రూ.23 కోట్లకు అమ్మి వేసింది. వెయ్యికోట్ల రూపాయల ఆస్తులను కారుచౌకగా అమ్మివేయడంపై పెద్ద దుమారమే రేగింది. పెదబాబు, చినబాబు సూత్రధారులుగా ఏపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు పాత్రధారులుగా వ్యవహరించి ఈ భూములను కాజేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ పత్రికల్లో ప్రకటన ఇస్తే పాట పెరుగుతుందన్న కుట్రతో ఎవ్వరి కంటపడని రీతిలో ప్రచురింపజేశారు. తద్వారా చెన్నై మహానగరంలో పేరెన్నిగన్న బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవ్వరూ ఓఎమ్ఆర్ రోడ్డులోని భూముల వేలంలో పాల్గొనకుండా చేశారు. మొత్తం నలుగురు వ్యక్తులు మాత్రమే పాటల్లో పాల్గొనగా, వీరిలో ముగ్గురు వ్యక్తులు అమరావతి సత్రం ఉన్న గుంటూరు జిల్లా నుంచే రావడం గమనార్హం. పైగా ముగ్గురు వ్యక్తులూ వేలం పాటల్లో పోటీపడినా, ముగిసిన తరువాత ఏకమై ధరావత్తు సొమ్మ చెల్లించడం నేతల, అధికారుల కుమ్మక్కుకు నిదర్శనం. పేరుకే బహిరంగ వేలమైనా అంతా గోప్యంగా సాగింది. భూములు కాజేయదలుచుకున్న పెద్దలు తెరవెనుక ఉండి నడిపించగా పాత్రధారులు మాత్రమే పాటల్లో పాల్గొన్నారు. వేలం పాటల నిర్వహణలో పాటించాల్సిన ప్రభుత్వ నిబంధనలను తుంగలోతొక్కి మమ అనిపించారు. ఓఎమ్ఆర్ రోడ్డులో ఎకరా రూ.6 కోట్ల వరకు పలుకుతుండగా కేవలం రూ.27 లక్షలకు అమ్మివేశారు. ఎకరా రిజిస్ట్రేషన్‌కు రూ.30లక్షల చెల్లించాల్సిన భూములను రూ.27లక్షలకు అమ్మడం ద్వారా భారీ కుంభకోణం బైటపడింది. 83 ఎకరాల ద్వారా రూ.1000 కోట్లు రాబట్టుకోవాల్సిన ఎండోమెంటు అధికారులు రూ.23 కోట్లకే సరిపెట్టుకోవడం ఉత్తుత్తి వేలం పాటల వ్యవహారాన్ని చెప్పకనే చెప్పాయి. వేలం పాటలు మొత్తం ఒక తంతులా సాగడంతో విస్తుపోయిన ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారిణి ఇదేమని ప్రశ్నించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా అమరావతి ఎమ్మెల్యేకు ఎండోమెంటు అధికారులు వెండి కిరీటం తొడిగి సంబరం జరుపుకున్నారు. చెన్నై లో జరిగింది భూముల వేలం పాటనా, సినిమా పాటల కచ్చేరీనా అనేలా హాస్యాస్పదంగా సాగాయి. ఓ దాత ఎంతో ద యాద్ర హృదయంతో సదావర్తి సత్రానికి ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన భూములు దారి మళ్లడాన్ని అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వేలం పాటల ను రద్దు చేయడం ద్వారా సదావర్తి సత్రానికి సత్వరం న్యా యం జరగాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పడింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్దన రెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, కృష్ణా జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు అదివారం చెన్నై చేరుకుంటున్నారు. ఉద యం ఓఎమ్ఆర్ రోడ్డులోని పలు ప్రాం తాల్లో ఉన్న సదావర్తి సత్రం భూములను సందర్శిస్తారు. -
'ఎవ్వరికీ భయపడం.. వెనుకడుగు వేయం'
అమరావతి: ప్రజల తరుపున పోరాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది విలువైన సదావర్తి సత్రం భూములను లక్షలకే అమ్మేశారని చెప్పారు. ఈ అమ్మకానికి సంబంధించిన మొత్తం వ్యవహారం తేల్చేందుకు తమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక నిజనిర్ధారణ కమిటీ వేశారని తెలిపారు. అందులో భాగంగానే తాము వాస్తవాలు తెలుసుకునేందుకు ఇక్కడి వచ్చామని చెప్పారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సరిహద్దులో ఉన్న విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం తన సన్నిహితులకు తక్కువ ధరకు కట్టబెట్టిన తీరుపై అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రూ. 1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నాయకుల నుంచి విడిపించి దేవస్థానానికి వెనక్కి ఇప్పించేలా పోరాడేందుకు పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో అమరేశ్వరుడి భూముల పరిరక్షణ కమిటీని నియమించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నాఉ. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ కమిటీ అమరావతిని సందర్శించింది. ఈ సందర్భంగా వారిని కొందరు టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, గ్రామస్తులు వారికి అండగా నిలిచి సత్రం ప్రాంతాన్ని సందర్శించేలా చేశారు. ఈ సందర్భంగా ధర్మానా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సత్రం భూముల అమ్మకాలకు సంబంధించి విలువైన సమాచారం సేకరించామని తెలిపారు. కోట్లాది విలువైన ఈ భూములను లక్షలకే అమ్మేయడం పెద్దలకు, పీఠాధిపతులకు విచారం కలిగించిందని అన్నారు. నిజనిజాలు ప్రజలకు దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళతామని అన్నారు. త్వరలోనే చెన్నై వెళతామని, అక్కడ భూముల రేట్లు కనుక్కుంటామని చెప్పారు. అసలు చట్టప్రకారం ఈ భూములు అమ్మకాలు చేశారా? కోర్టు పరిధికి లోబడి పనిచేశారా? ఈ కుట్రకు ప్రధాన కారకులు ఎవరనే విషయం త్వరలోనే తేల్చి ఐదుకోట్ల ప్రజానీకానికి తెలియజేస్తామని అన్నారు. -
‘సదావర్తి’ భూముల దోపిడీపై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సరిహద్దులో ఉన్న విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం తన సన్నిహితులకు తక్కువ ధరకు కట్టబెట్టిన తీరుపై అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రూ. 1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నాయకుల నుంచి విడిపించి దేవస్థానానికి వెనక్కి ఇప్పించేలా పోరాడటానికి పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ‘అమరేశ్వరుడి భూముల పరిరక్షణ కమిటీ’ని నియమించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. కమిటీ తన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రామచంద్రయ్య నేతృత్వంలో పీసీసీ కమిటీ: సదావర్తి సత్రం భూముల అమ్మకాల్లో జరిగిన కుంభకోణంపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య నేతృత్వంలో పీసీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. -
భూముల స్వాహాపై ప్రజాగ్రహం
తీవ్ర కలకలం సృష్టించిన ‘సాక్షి’ కథనం సాక్షి, విజయవాడ: సదావర్తి సత్రం భూముల దోపిడీపై రాష్ట్ర ప్రజానీకం భగ్గుమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సత్రం ఆస్తులను కొల్లగొట్టడం దారుణమని టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూ.1,000 కోట్ల విలువైన భూములను వేలంపాట పేరిట రూ.22.44 కోట్లకే కాజేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ‘అమరావతి సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటీ’ శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పక్కా స్కెచ్‌తో సాగించిన అడ్డగోలు భూదోపిడీపై వివిధ రాజకీయ పక్షాలు, ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. దీనిపై రహస్యంగా విచారణ జరుపుతున్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి వారసుడు, సదావర్తి సత్రం చైర్మన్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ ‘సాక్షి’ కథనంపై స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాతలు మంచి ఉద్దేశంతో ఇచ్చిన దేవస్థానం భూములను స్వాహా చేయడం దారుణమనీ, ఇది హిందూ మతానికి ద్రోహం చేయడమేననీ అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య సలహాదరాఉ కోటా శంకర శర్మ అన్నారు. సదావర్తి సత్రం భూముల దోపిడీపై విచారణ జరిపించాలని కోరారు. ఆ భూములను అమరావతి దేవస్థానానికి తిరిగి అప్పగించేవరకూ పోరాటం చేస్తామన్నారు. -
‘సత్రం’ ఫైల్.. సూపర్‌ఫాస్ట్
ఈవో, కమిషనర్ మధ్య నేరుగా ఉత్తరప్రత్యుత్తరాలు సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రం భూముల దోపిడీ వ్యవహారం బట్టబయలు కావడంతో దేవాదాయ శాఖ అధికారులుఆశ్చర్యచకితులవుతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో నామమాత్రపు ధరకు భూముల అమ్మకానికి సంబంధించిన ఫైల్ పట్ల కమిషనర్ కార్యాలయంలోని ముఖ్య అధికారులు ఎందుకంత ప్రత్యేక ఆసక్తి కనబరిచారో స్పష్టత వచ్చిందంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఫైల్ కదలాలంటే సుదీర్ఘకాలం వేచిచూడాల్సిందే. ఫైల్‌కు మోక్షం లభించాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. సదావర్తి సత్రం భూముల అక్రమం ఫైల్ మాత్రం చకచకా ముందుకు కదిలింది. బడాబాబుల ప్రమేయం వల్లే ఫైల్‌కు ప్రాధాన్యం సదావర్తి సత్రం భూముల ఫైల్లో ఎక్కువ భాగం ఉత్తరప్రత్యుత్తరాలను సత్రం కార్యనిర్వహణాధికారి(ఈవో) నేరుగా దేవాదాయ శాఖ కమిషనర్ వద్దకు చేర్చేవారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దేవాదాయ శాఖలో ఒక ఈవో నుంచి కమిషనర్ కార్యాలయానికి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు నడవాలన్నా మధ్యలో డిప్యూటీ కమిషనర్ లేదా జాయింట్ కమిషనర్ కార్యాలయాల్లో పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. సత్రం భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రమేయం లేకుండానే మొదట నుంచీ ఉత్తరప్రత్యుత్తరాలను ఈవోనే నేరుగా కమిషనర్‌కు చేరవేశారు. భూముల అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న వేలం నిర్వహించారు. ఎకరా రూ.13 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.27 లక్షలకే విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతి కోరే పత్రాలను సత్రం ఈవో స్వయంగా కమిషనర్‌కు అందజేశారు. మధ్యలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ఈ పత్రాలు పరిశీలనకు వెళ్లలేదని దేవాదాయ శాఖ వర్గాల సమాచారం. చివరకు టీడీపీ నేతల కుటుంబ సభ్యులకే ఆ భూముల అమ్మకానికి అనుమతులు మంజూరయ్యాయి. ‘అమరావతి సదావర్తి సత్రంలో వెయ్యి కోట్ల లూటీ!’ శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బడాబాబుల ప్రమేయం ఉండడం వల్లే భూముల అమ్మకం ఫైల్‌కు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. మార్కెట్ ధర ఎంతుందో తెలుసా? దేవాదాయ శాఖలో గజం భూమి విక్రయించాలన్నా ఆ భూమి మార్కెట్(ప్రభుత్వ) విలువ, బహిరంగ మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకొని తాము అమ్మాల్సిన ధరను నిర్ణయిస్తారు. అయితే, చెన్నై సమీపంలో సత్రానికి చెందిన భూమికి మార్కెట్ ధర ఎంత ఉందో పట్టించుకోకుండా నామమాత్రంగా ఎకరాకు రూ.50 లక్షల ధరనే నిర్ణయించారు. ఆ తర్వాత వేలంపాట పేరుతో టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబీకులు, వారి మిత్రబృందం అమరలింగేశ్వరస్వామి భూములను ఎకరా రూ.27 లక్షలకే కొట్టేశారు. వేలం పాట పూర్తయిన తర్వాత కూడా అమ్మిన భూమికి బేసిక్ ధర ఎంత ఉందన్న వివరాలను సత్రం ఈవోను అడిగినా ఆయన తనకు తెలియజేయలేదంటూ దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంభ స్వయంగా కమిషనర్‌కే లేఖ రాశారు. కొనుగోలుదారుల్లో ముగ్గురు చలమలశెట్టి కుటుంబీకులే కారుచౌకగా సదావర్తి సత్రం భూములను దక్కించుకున్న 8 మందిలో ముగ్గురు అధికార పార్టీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులే. ఆయన భార్య సీహెచ్ లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్‌బాబు, మేనల్లుడు బి.శివరామకృష్ణ కిషోర్‌లకు సత్రం భూములను వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ముగ్గురితోపాటు మందాల సంజీవరెడ్డి, ఆయన భార్య సునీతారెడ్డి, మేనల్లుడు చావలి కృష్ణారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని విద్యాసంస్థల అధినేత ఎం.సూర్యకిరణ్‌మౌళి, డి.పవన్‌కుమార్‌లు ఉన్నారు. సంజీవరెడ్డి మేనల్లుడు చావలి కృష్ణారెడ్డి, చలమలశెట్టి మేనల్లుడు బి.శివరామకృష్ణకిషోర్లు స్నేహితులు. వీరిద్దరూ లండన్‌లో కలిసి చదువుకున్నారు. శివరామకృష్ణకిషోర్ ప్రస్తుతం చలమలశెట్టి వద్దే ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చెప్పుల స్టాండ్ లీజుకు ఐదుసార్లు వేలం సత్రం భూములను ఎకరా రూ.50 లక్షల చొప్పున అమ్మడానికి వేలం పాట మొదలుపెట్టి అక్కడికక్కడే ఎకరా రూ.27 లక్షలకు తగ్గించడంపై దేవాదాయ శాఖలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగానే చెప్పుకుంటున్నారు. ఇటీవల విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద చెప్పుల స్టాండ్ లీజుకు వేలం పాట నిర్వహించారు. గతేడాది రూ.57 లక్షలకు జరిగిన పాట ఈ ఏడాది రూ.50 లక్షలకు తగ్గింది. దీంతో ఐదుసార్లు వేలం పాట నిర్వహించారు. అలాంటిది రూ.కోట్ల విలువైన భూముల విషయంలో ఒకేరోజు ఒకే వేలం పాటలో అమ్మకం ధరను సగానికి తగ్గించి అతి కారుచౌకగా కట్టబెట్టడం నిబంధనలకు విరుద్ధమని దేశాదాయ శాఖ అధికారులు అంటున్నారు. అమ్మకంపై నివేదిక ఇవ్వండి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆదేశం సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో ఉన్న 83.11 ఎకరాల భూమి అమ్మకం వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధను ప్రభుత్వ ముఖ్యకార్యదర్వి జేఎస్పీ ప్రసాద్ ఆదేశించారు. భూముల అమ్మకంలో రూ.1,000 కోట్ల లూటీ జరిగిందంటూ పూర్తి సాక్ష్యాధారాలతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ భూముల అమ్మకానికి సంబంధించి అనుమతుల మంజూరు వివరాలను సోమవారం నాటికి సమగ్రంగా తన ముందుంచాలని కమిషనర్ స్పష్టం చేశారు.