‘సదావర్తి’ భూముల దోపిడీపై వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై నగర సరిహద్దులో ఉన్న విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం తన సన్నిహితులకు తక్కువ ధరకు కట్టబెట్టిన తీరుపై అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రూ. 1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నాయకుల నుంచి విడిపించి దేవస్థానానికి వెనక్కి ఇప్పించేలా పోరాడటానికి పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ‘అమరేశ్వరుడి భూముల పరిరక్షణ కమిటీ’ని నియమించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు, రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. కమిటీ తన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
రామచంద్రయ్య నేతృత్వంలో పీసీసీ కమిటీ: సదావర్తి సత్రం భూముల అమ్మకాల్లో జరిగిన కుంభకోణంపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య నేతృత్వంలో పీసీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.