‘సత్రం’ ఫైల్.. సూపర్‌ఫాస్ట్
ఈవో, కమిషనర్ మధ్య నేరుగా ఉత్తరప్రత్యుత్తరాలు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రం భూముల దోపిడీ వ్యవహారం బట్టబయలు కావడంతో దేవాదాయ శాఖ అధికారులుఆశ్చర్యచకితులవుతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో నామమాత్రపు ధరకు భూముల అమ్మకానికి సంబంధించిన ఫైల్ పట్ల కమిషనర్ కార్యాలయంలోని ముఖ్య అధికారులు ఎందుకంత ప్రత్యేక ఆసక్తి కనబరిచారో స్పష్టత వచ్చిందంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఫైల్ కదలాలంటే సుదీర్ఘకాలం వేచిచూడాల్సిందే. ఫైల్‌కు మోక్షం లభించాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. సదావర్తి సత్రం భూముల అక్రమం ఫైల్ మాత్రం చకచకా ముందుకు కదిలింది.
బడాబాబుల ప్రమేయం వల్లే ఫైల్‌కు ప్రాధాన్యం
సదావర్తి సత్రం భూముల ఫైల్‌లో ఎక్కువ భాగం ఉత్తరప్రత్యుత్తరాలను సత్రం కార్యనిర్వహణాధికారి(ఈవో) నేరుగా దేవాదాయ శాఖ కమిషనర్ వద్దకు చేర్చేవారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దేవాదాయ శాఖలో ఒక ఈవో నుంచి కమిషనర్ కార్యాలయానికి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు నడవాలన్నా మధ్యలో డిప్యూటీ కమిషనర్ లేదా జాయింట్ కమిషనర్ కార్యాలయాల్లో పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. సత్రం భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రమేయం లేకుండానే మొదట నుంచీ ఉత్తరప్రత్యుత్తరాలను ఈవోనే నేరుగా కమిషనర్‌కు చేరవేశారు.
భూముల అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న వేలం నిర్వహించారు. ఎకరా రూ.13 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.27 లక్షలకే విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతి కోరే పత్రాలను సత్రం ఈవో స్వయంగా కమిషనర్‌కు అందజేశారు. మధ్యలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ఈ పత్రాలు పరిశీలనకు వెళ్లలేదని దేవాదాయ శాఖ వర్గాల సమాచారం. చివరకు టీడీపీ నేతల కుటుంబ సభ్యులకే ఆ భూముల అమ్మకానికి అనుమతులు మంజూరయ్యాయి. ‘అమరావతి సదావర్తి సత్రంలో వెయ్యి కోట్ల లూటీ!’ శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బడాబాబుల ప్రమేయం ఉండడం వల్లే భూముల అమ్మకం ఫైల్‌కు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు.
మార్కెట్ ధర ఎంతుందో తెలుసా?
దేవాదాయ శాఖలో గజం భూమి విక్రయించాలన్నా ఆ భూమి మార్కెట్(ప్రభుత్వ) విలువ, బహిరంగ మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకొని తాము అమ్మాల్సిన ధరను నిర్ణయిస్తారు. అయితే, చెన్నై సమీపంలో సత్రానికి చెందిన భూమికి మార్కెట్ ధర ఎంత ఉందో పట్టించుకోకుండా నామమాత్రంగా ఎకరాకు రూ.50 లక్షల ధరనే నిర్ణయించారు. ఆ తర్వాత వేలంపాట పేరుతో టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబీకులు, వారి మిత్రబృందం అమరలింగేశ్వరస్వామి భూములను ఎకరా రూ.27 లక్షలకే కొట్టేశారు. వేలం పాట పూర్తయిన తర్వాత కూడా అమ్మిన భూమికి బేసిక్ ధర ఎంత ఉందన్న వివరాలను సత్రం ఈవోను అడిగినా ఆయన తనకు తెలియజేయలేదంటూ దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంభ స్వయంగా కమిషనర్‌కే లేఖ రాశారు.
కొనుగోలుదారుల్లో ముగ్గురు
చలమలశెట్టి కుటుంబీకులే
కారుచౌకగా సదావర్తి సత్రం భూములను దక్కించుకున్న 8 మందిలో ముగ్గురు అధికార పార్టీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులే. ఆయన భార్య సీహెచ్ లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్‌బాబు, మేనల్లుడు బి.శివరామకృష్ణ కిషోర్‌లకు సత్రం భూములను వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ముగ్గురితోపాటు మందాల సంజీవరెడ్డి, ఆయన భార్య సునీతారెడ్డి, మేనల్లుడు చావలి కృష్ణారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని విద్యాసంస్థల అధినేత ఎం.సూర్యకిరణ్‌మౌళి, డి.పవన్‌కుమార్‌లు ఉన్నారు. సంజీవరెడ్డి మేనల్లుడు చావలి కృష్ణారెడ్డి, చలమలశెట్టి మేనల్లుడు బి.శివరామకృష్ణకిషోర్‌లు స్నేహితులు. వీరిద్దరూ లండన్‌లో కలిసి చదువుకున్నారు. శివరామకృష్ణకిషోర్ ప్రస్తుతం చలమలశెట్టి వద్దే ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
చెప్పుల స్టాండ్ లీజుకు ఐదుసార్లు వేలం
సత్రం భూములను ఎకరా రూ.50 లక్షల చొప్పున అమ్మడానికి వేలం పాట మొదలుపెట్టి అక్కడికక్కడే ఎకరా రూ.27 లక్షలకు తగ్గించడంపై దేవాదాయ శాఖలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగానే చెప్పుకుంటున్నారు. ఇటీవల విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద చెప్పుల స్టాండ్ లీజుకు వేలం పాట నిర్వహించారు. గతేడాది రూ.57 లక్షలకు జరిగిన పాట ఈ ఏడాది రూ.50 లక్షలకు తగ్గింది. దీంతో ఐదుసార్లు వేలం పాట నిర్వహించారు. అలాంటిది రూ.కోట్ల విలువైన భూముల విషయంలో ఒకేరోజు ఒకే వేలం పాటలో అమ్మకం ధరను సగానికి తగ్గించి అతి కారుచౌకగా కట్టబెట్టడం నిబంధనలకు విరుద్ధమని దేశాదాయ శాఖ అధికారులు అంటున్నారు.
అమ్మకంపై నివేదిక ఇవ్వండి
ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆదేశం
సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో ఉన్న 83.11 ఎకరాల భూమి అమ్మకం వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధను ప్రభుత్వ ముఖ్యకార్యదర్వి జేఎస్పీ ప్రసాద్ ఆదేశించారు. భూముల అమ్మకంలో రూ.1,000 కోట్ల లూటీ జరిగిందంటూ పూర్తి సాక్ష్యాధారాలతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ భూముల అమ్మకానికి సంబంధించి అనుమతుల మంజూరు వివరాలను సోమవారం నాటికి సమగ్రంగా తన ముందుంచాలని కమిషనర్ స్పష్టం చేశారు.