కోవిడ్‌కంటే భయంకర రూపం చంద్రబాబు.. | Chandrababu Naidu Drama With COVID 19 on Local Elections | Sakshi
Sakshi News home page

రూ.250 కోట్లకు చంద్రగ్రహణం

Published Mon, Mar 16 2020 11:35 AM | Last Updated on Mon, Mar 16 2020 11:35 AM

Chandrababu Naidu Drama With COVID 19 on Local Elections - Sakshi

నువ్వొద్దుబాబూ అంటూ జనం భూస్థాపితం చేయగా...లోలోన కుళ్లిపోయిన చంద్రబాబు...ఇప్పుడు జనంపై పగ తీర్చుకునేందుకు కోవిడ్‌ పేరుతో అంతకంటే భయంకర రూపం దాల్చాడు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బూతంలా మారాడు. లోలోన మంత్రాంగం నడిపి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడేలా చేశాడు. మార్చి 31వ తేదీ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికాకపోతే 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు విడుదల కావాల్సిన రూ.250 కోట్లు నిలిచిపోనుండగా...ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.

అనంతపురం: దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు... ఇలాంటి గ్రామాలకు  రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి పడకేసింది. ఏడాదిన్నరకు పైగా పంచాయతీల ఖజానాల్లో పైసా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో  రూ.లక్షలు చేతినుంచి ఖర్చు చేసిన కార్యదర్శులు నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణ నిధులు అవకాశం ఉన్న పంచాయతీల్లో కాస్తోకూస్తో ఫర్వాలేదు కానీ, మధ్య, చిన్నస్థాయి పంచాయతీల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. 

జిల్లాలోని 1,044 పంచాయతీల్లో దాదాపు 29 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. అభివృద్ధిలో భాగంగా ఏడాదికి ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 2018 జూన్‌ వరకు నిధులు వచ్చాయి. అప్పటి నుంచి పెండింగ్‌ ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. పైగా గత పాలకవర్గాలు పంచాయతీల్లో పైసా ఉంచకుండా ఉన్న నిధులన్నీ భోంచేశారు. దీంతో గ్రామాల్లో తాగునీరు సమస్య తాండవిస్తోంది. పారిశుద్ధ్య పడకేసింది. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఆర్నెళ్లు, 2019–20కు సంబంధించి పూర్తి కోటా కేంద్రం నిధులు రావాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాలోని పంచాయతీలకు దాదాపు రూ. 221 కోట్ల దాకా రావాల్సి ఉంది. అలాగే మున్సిపాల్టీలకు సంబంధించి రూ. 29 కోట్లు కలిపి మొత్తం రూ. 250 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈనెల 31లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితేనే ఈ నిధులు వస్తాయి. లేదంటే ఈ నిధులన్నీ వెనక్కు పోయే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు.  

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఎక్కడికక్కడే
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయించడంతో ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది. జిల్లాలో 841 ఎంపీటీసీ స్థానాలకు గాను 50 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 49 మంది, టీడీపీ అభ్యర్థి ఒకరు ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవమైన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. తక్కిన స్థానాలకు ఈనెల 21న పోలింగ్‌ ఉండేది. బరిలో నిలిచే అభ్యర్థులు శనివారం ఖరారు కావడంతో అదేరోజు రాత్రే  బ్యాలెట్ల ప్రింటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌ నిలపకుండా పూర్తి చేసేసి మండలాలకు తరలించి స్ట్రాంగు రూంల్లో భద్రపరిచేలా జిల్లా అధికార యంత్రంగా చర్యలు తీసుకుంటోంది. ఇక అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు ఇప్పటికే అన్ని మండలాలకు  తరలించారు. పీఓ, ఏపీఓలు, ఓపీఓల నియామం కూడా పూర్తయింది. విధుల కేటాయింపునకు పరిశీలకుల సమక్షంలో  ఆదివారం ర్యాండమైజేషన్‌ జరగాల్సి ఉండగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నియామకమైన స్టేజ్‌–1 అధికారులకు శిక్షణ జరుగుతుండగా ఆదివారం మధ్యాహ్నానికి నిలుపుదల చేశారు. మైక్రో పరిశీలకులకు శిక్షణ కూడా ఈనెల 17న జరగాల్సి ఉండగా అదీ వాయిదా పడింది. కాగా ఎన్నికల కోడ్‌ మాత్రం ఈ ఆరు వారా>ల పాటు ఎన్నికల  అమలులో ఉంటుందని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement