చంద్రబాబు ధనాస్త్రం
అనంతపురం: పదేళ్లుగా వరుస పరాజయాలతో కుదేలైన టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడుకు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. రాష్ట్ర విభజనలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించడం.. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటాలు చేసి ప్రతిపక్ష పాత్రను పోషించకపోవడం వల్ల ప్రజల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబుకుతోంది. దాని ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుందన్న భయంతో అన్నిదార్లూ తొక్కుతున్నారు. ఓటర్లపై ధనాస్త్రాన్ని వాడిగా ప్రయోగిస్తేనే విజయం సాధిస్తామని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే నిధుల సేకరణ, పంపిణీలో నిమగ్నమయ్యారు.
భారీగా ఫండ్స్ సేకరణ
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, సుజనాచౌదరి, గరికపాటి మోహనరావు ద్వారా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే వలసలకు తెరతీశారు. తాము చెప్పిన ప్యాకేజీలకు అంగీకరిస్తే.. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఎర వేశారు. వారినుంచి ప్యాకేజీల రూపంలో చంద్రబాబు భారీ ఎత్తున పార్టీ ఫండ్‌ను సేకరించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పారిశ్రామికవేత్తలు అయిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనాచౌదరి, గరికపాటి మోహన్‌రావు సేకరించిన నిధులు.. కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి తీసుకున్న పార్టీ ఫండ్‌ను సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే జిల్లాలకు చేర్చాలని చంద్రబాబు భావించారు. కానీ.. ఆలోగానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు, జెడ్పీ ఎన్నికల షెడ్యూలు వెలువడిన విషయం విదితమే. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ధనం, మద్యం, అక్రమాయుధాల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి డీజీపీ ప్రసాదరావు భారీ ఎత్తున చెక్‌పోస్టులు ఏర్పాటు చేయించారు.
ఇందులో భాగంగా ఒక్క అనంతపురం జిల్లాలోనే 113 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల్లో రోజూ వారీ చేసే తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తోన్న డబ్బులు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జిల్లాలకు పార్టీ ఫండ్‌ను చేరవేయడానికి ఏకంగా ఓ పోలీసు ఉన్నతాధికారి సహాయం అర్థించారు.
పోలీసు ఉన్నతాధికారి స్వామి భక్తి
ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి అనుకూలంగా పోలీసు యంత్రాగాన్ని మలచడంలో కీలక భూమిక పోషించే ఓ పోలీసు ఉన్నతాధికారి ఈ సారికూడా అదే పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నిధులను చేరవేసే బాధ్యతను ఆ పోలీసు ఉన్నతాధికారి తలకెత్తుకున్నారు. చంద్రబాబు తన కోటరీలోని నేతల ద్వారా వివిధ జిల్లాలకు ప్రత్యేక వాహనాల్లో పార్టీ ఫండ్‌ను చేరవేస్తున్నారు. చెక్‌పోస్టుల్లో ఆ వాహనాలను తనిఖీ చేయడానికి పోలీసులు సిద్ధమైతే.. ఓ పోలీసు ఉన్నతాధికారి లైన్‌లోకి వస్తూ.. ఆ వాహనాన్ని తనిఖీ చేయకుండా వదిలివేయాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం.
ఇదే పద్ధతిలో హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు పార్టీ ఫండ్‌ను తరలిస్తోన్న వాహనాన్ని సోమవారం అనంతపురం-కర్నూలు జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఆ వాహనంలోనే చంద్రబాబు కోటరీలోని కీలకనేత ఉండటం.. ఆ నేత తన ఫోన్ ద్వారా ఓ పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడించినట్లు సమాచారం. దాంతో.. ఆ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయకుండానే వదిలేశారు. సోమవారం అనంతపురంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు దూత రహస్యంగా సమావేశాన్ని నిర్వహించి.. పార్టీ ఫండ్‌ను పంపిణీ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.