బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు  | Four TDP MPs Sujana, TG Venkatesh, CM Ramesh, Garikapati Join BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు 

Published Thu, Jun 20 2019 6:23 PM | Last Updated on Fri, Jun 21 2019 12:52 AM

Four TDP MPs Sujana, TG Venkatesh, CM Ramesh, Garikapati Join BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం బీజేపీలో చేరారు. తెలుగుదేశం ఎంపీలైన సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. అయితే, కాలికి గాయం కావడంతో గరికపాటి మోహన్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని, కానీ, బీజేపీలో చేరేందుకు సమ్మతి తెలుపుతూ ఆయన కూడా పత్రం పంపించారని, దీంతో ఆయనను కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, ప్రగతి.. అమిత్‌ షా నేతృత్వంలో బీజేపీ సాధిస్తున్న విజయాలను చూసి.. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ చేరాలని చాలాకాలంగా నలుగురు టీడీపీ ఎంపీలు భావిస్తూ వచ్చారని, ఇందులో భాగంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తామని తమను వారు కోరారని తెలిపారు. ఇందుకు ప్రధాని మోదీ, అమిత్‌ షా సమ్మతించారని, ఈ మేరకు విలీన పత్రాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడికి అందజేశామని తెలిపారు. విలీనం పూర్తికావడంతో ఇకపై వీరు బీజేపీ ఎంపీలుగా మారిపోయారని తెలిపారు. బీజేపీ సానుకూల రాజకీయాలను విశ్వసిస్తోందని, సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అన్న నినాదం ధ్యేయంగా తాము ముందుకు సాగుతామన్నారు.  వీరి చేరికల వల్ల ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల అభీష్టం ఎలా ఉందో స్పష్టమైందని, దీనిని గమనించి.. దేశ నిర్మాణంలో భాగం కావాలని, ఏపీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతకుముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడును  టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని, అందువల్ల ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ 4వ పేరాగ్రాఫ్‌లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో రాజ్యసభలో టీడీపీ దాదాపు ఖాళీ అయింది. రాజ్యసభలో టీడీపీకి ప్రస్తుతం సీతారామలక్ష్మీ, రవీంద్రకుమార్‌ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement