ఆర్థిక నేరగాళ్లకు టీడీపీ అడ్డా | TDP is address to the corrupted leaders | Sakshi
Sakshi News home page

ఆర్థిక నేరగాళ్లకు టీడీపీ అడ్డా

Published Sun, Mar 24 2019 5:00 AM | Last Updated on Sun, Mar 24 2019 11:42 AM

TDP is address to the corrupted leaders - Sakshi

సాక్షి, అమరావతి: వ్యాపారవేత్తల ముసుగులో బ్యాంకులకు టోపీ పెడుతున్న వారికి తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది. రుణాలు, పన్నులు ఎగ్గొట్టిన వారికే చంద్రబాబు.. ప్రభుత్వ పదవుల్లో పెద్దపీట వేశారు. ప్రజల సొమ్మును అడ్డంగా దోచేసిన వారినే దగ్గరకు తీసుకుంటూ అండగా నిలుస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో దేశంలో ఏ మోసాన్ని వెలికితీసినా వాటి మూలాలు టీడీపీ దగ్గరకే చేరుతున్నాయి. టీడీపీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేశ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆర్థిక మోసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంతో పాటు వ్యాపారాలు చేయకుండానే పన్ను రాయితీలు పొందడంలో వీరిని మించిన ఘనాపాఠీలు లేరు. వీరే కాదు మంత్రులుగా చెలామణి అవుతున్న గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణ రెడ్డితో పాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు, బీద మస్తానరావు, వాకాటి నారాయణరెడ్డి, బొల్లినేని కృష్ణయ్య, వైస్రాయ్‌ ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి.. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే టీడీపీలోని గజదొంగల లిస్ట్‌ చాలా పెద్దగానే ఉంటుంది.

‘సుజనా’.. రూ.వేల కోట్లు తినేశాడు
బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల రుణాలు తీసుకొని మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు జరుగుతుండగా.. సుజనా చౌదరి మోసాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రూ.1,289 కోట్ల మోసం బయటపడింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే రూ.1,289 కోట్లకు ఇన్‌వాయిస్‌లను రూపొందించారు. ఈ మొత్తంపై రూ.224 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను తీసుకున్నారు. అంతే కాకుండా ఈ దొంగ ఇన్‌వాయిస్‌లను చూపించి బ్యాంకుల నుంచి రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. జీఎస్టీ విభాగం చేసిన దర్యాప్తులో ఈ మోసం బయటపడటంతో ఇప్పటికే ఈ గ్రూపునకు చెందిన డైరెక్టర్లలో కొందర్ని అరెస్ట్‌ చేశారు. చివరకు బ్యాంకు రుణాలు తీర్చడం లేదని సుజనా చౌదరికి తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఉన్న స్టీల్‌ ప్లాంటును బ్యాంకులు సీజ్‌ చేశాయి. విదేశీ బ్యాంకులను సైతం మోసం చేసిన చరిత్ర సుజనా చౌదరి సొంతం. మారిషస్‌ బ్యాంక్‌ నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకున్న సుజనా చౌదరి ఆ మొత్తం చెల్లించకుండా తప్పించుకొని తిరిగారు. దీంతో ఆ బ్యాంక్‌ వాళ్లు హైదరాబాద్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం ఏకంగా అరెస్ట్‌ వారెంట్లు కూడా జారీ చేసింది. అయినా కూడా సీఎం చంద్రబాబు పట్టుబట్టి సుజనా చౌదరికి గతంలో కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకున్నారు. 

అక్రమ లావాదేవీలకు కేరాఫ్‌ ‘సీఎం’ రమేశ్‌
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, బినామీగా పేరు పొందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అక్రమ లావాదేవీల గుట్టును ఆదాయ పన్ను శాఖ రట్టు చేసింది. సబ్‌ కాంట్రాక్టర్ల ముసుగులో పనులేమీ చేయకుండానే దాదాపు రూ.800 కోట్ల నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. పనులేమీ చేయకుండానే బిల్లులు మంజూరు చేయించుకున్నాడు. వాటిని చిరునామాల్లేని కంపెనీల్లోకి మళ్లించి.. ఆ కంపెనీల నుంచి నగదును వెనక్కి తీసుకోవడం సీఎం రమేశ్‌కు వెన్నతో పెట్టిన విద్య. రమేశ్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సుమారు రూ.800 కోట్ల నిధులను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్‌ కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపించగా.. రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో కూడా ఈ కంపెనీ ఆనవాళ్లు దొరకలేదు. పైగా రిత్విక్‌ ప్రాజెక్టులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు దొరకడంతో గుట్టు రట్టయ్యింది. ఇలా దొంగ వ్యాపారాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని టీడీపీకి ఇస్తుండటంతో ఆయన్ని చంద్రబాబు వరుసగా రెండో సారి కూడా రాజ్యసభకు పంపించారు. 

బకాయిల ‘గంటా’
మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రత్యూష గ్రూప్‌ కంపెనీలు వివిధ బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.196.51 కోట్ల మేర బకాయిలు పడ్డాయి. రూ.141 కోట్ల రుణం తీసుకొని ఇప్పటి వరకు ఒక్క వాయిదా కూడా చెల్లించకపోవడంతో ఇండియన్‌ బ్యాంకు ప్రత్యూష గ్రూప్‌కు చెందిన ఆస్తుల స్వాధీనానికి రంగంలోకి దిగింది. ఈ రుణానికి గంటా శ్రీనివాసరావు హామీ ఉండటంతో మంత్రికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఈ బకాయిల విలువ రూ.203.62 కోట్లకు చేరింది. దీంతో మంత్రికి చెందిన మరిన్ని ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు రంగంలోకి దిగాయి. 

రాయపాటి ఇంటి ముందు బ్యాంక్‌ సిబ్బంది ధర్నాలు..
ఇక టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఏకంగా వివిధ బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్ల రుణాలు తీసుకొని.. వాటిని తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు రూ.735 కోట్ల రుణానికి సంబంధించి పిటిషన్‌ దాఖలు చేసింది. ఆంధ్రా బ్యాంక్‌ ఉద్యోగులైతే తామిచ్చిన రూ.434 కోట్ల రుణం తిరిగి చెల్లించాలంటూ రాయపాటి ఇంటి ముందు ఏకంగా ధర్నాలు చేశారు.  పైగా ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును నిర్మించే సత్తా రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని అందరూ మొత్తుకున్నా కూడా చంద్రబాబు ఆ కంపెనీకి అండగా నిలబడ్డారు. 

‘ఆది’ రాకతో ‘కేశవరెడ్డి’ కేసు మూలకు..
బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రముఖ ఆర్థిక మోసాల్లో కేశవరెడ్డి స్కూల్‌ డిపాజిట్ల స్కీం ఒకటి. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్ల రూపంలో రూ.700 కోట్లకు పైగా నగదు సేకరించి కేశవరెడ్డి నాగిరెడ్డి బోర్డు తిప్పేశారు. ఈ కేసును బూచిగా చూపించి కేశవరెడ్డి వియ్యంకుడైన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకొని మంత్రినే చేశారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా డిపాజిట్‌దారులకు ఇప్పటికీ ఒక్క పైసా కూడా రాలేదు.

‘వైస్రాయ్‌’ ప్రభాకరరెడ్డి
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు వెన్నుపోటుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ‘వైస్రాయ్‌’ ప్రభాకర్‌రెడ్డి కూడా పెద్ద ఎత్తున బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో ఆయన ఆస్తుల స్వాధీనానికి బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. రూ.310 కోట్ల రుణం చెల్లించకపోవడంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బెంగళూరులోని ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది.

రూ.వందల కోట్లు ఎగవేసిన ‘వాకాటి’ 
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి చెందిన వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, పవర్‌టెక్, లాజిస్టిక్స్‌ కంపెనీలు వివిధ బ్యాంకుల నుంచి రూ.529.34 కోట్ల రుణాలు తీసుకొని తిరిగి చెల్లించటం లేదు. దీంతో ఈ రుణాలకు హామీగా ఉన్న వాకాటి నారాయణరెడ్డికి చెందిన స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. దీనిపై డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌.. ఈ ఆస్తులు అమ్మి రుణం తీర్చడానికి ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది. మరోవైపు తప్పుడు పత్రాలిచ్చి రుణం తీసుకున్నారంటూ బ్యాంకులు సీబీఐని ఆశ్రయించాయి. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ వాకాటి ఇంటిపై దాడులు కూడా నిర్వహించింది. 

చెప్పుకుంటూ పోతే ఎందరో ఎగవేతదారులు..
బోర్డులు తిప్పిసి రూ.వేల కోట్ల మేర మోసం చేసిన ఘనులు టీడీపీలో చాలా మందే ఉన్నారు. శేఖర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, బొల్లినేని కృష్ణయ్య వంటి వారితో పాటు.. టీడీపీకి పరోక్షంగా మద్దతిస్తున్న కంపెనీలు కూడా రూ.వందలాది కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టాయి. వీటిలో బి.శీనయ్య కంపెనీ, సోమా కనస్ట్రక్షన్స్, మిక్‌ ఎలక్ట్రానిక్స్, బార్‌ట్రానిక్స్, నంది గ్రూపు, ప్రొగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్, వెలగపూడి స్టీల్స్, టోటెమ్‌ ఇన్‌ఫ్రా ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.  

రూ.వేల కోట్లకు ‘నామా’
టీడీపీలో నిన్నమొన్నటి వరకు కీలక నేతగా ఉన్న నామా నాగేశ్వరరావుది కూడా ‘దొంగ’ చరిత్రనే. మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ చేపట్టిన ఎన్‌హెచ్‌–33 ప్రాజెక్టులో రూ.264.01 కోట్లను పక్కకు తరలించడం ద్వారా సీబీఐకి అడ్డంగా దొరికిపోయారు. రూ.1,655 కోట్ల విలువైన రాంచి–జంషెడ్‌పూర్‌ జాతీయ రహదారికి చెందిన ప్రాజెక్టులో.. బ్యాంకుల నుంచి మోసపూరితంగా రూ.1,029.39 కోట్ల రుణాలు తీసుకున్నాడు. అందులోంచి రూ.264.01 కోట్లను దారి మళ్లించినట్లు సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ గుర్తించింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లపై కేసులు నమోదు చేయడమే కాకుండా.. బ్యాంకు రుణాలకు గ్యారంటీగా పెట్టిన రూ.73.95 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ‘మధుకాన్‌’ మోసాలను ముందే గుర్తించిన ప్రపంచ బ్యాంకు తన ప్రాజెక్టుల నుంచి ఈ సంస్థను నిషేధిస్తూ గతేడాది నిర్ణయం తీసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement