కేసీఆర్‌ను కాపీ కొట్టిన చంద్రబాబు
అమరావతి: తెలంగాణ ముఖ్యమత్రి కె.చంద్రశేఖరరావును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్...తనయుడు కేటీఆర్‌కు ఏ శాఖలను అయితే కేటాయించారో...తాజాగా చంద్రబాబు కూడా అదే ఫాలో అయ్యారు. ఎమ్మెల్సీగా రాజకీయ రంగప్రవేశం చేసిన నారా లోకేశ్‌కు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కొత్తగా తీసుకున్న మంత్రులకు సీఎం చంద్రబాబు సోమవారం శాఖలు కేటాయించారు.
తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తరహాలోనే నారా లోకేశ్‌కు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ కేటాయించారు. ఐటీ శాఖ తన చేతుల్లో ఉంటే తాను కూడా కేటీఆర్ లాగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువుగా ఉంటుందని లోకేశ్...చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మరీ ఆ శాఖను తీసుకున్నట్లు సమాచారం. ఐటీ శాఖ కారణంగానే తెలంగాణలో కేటీఆర్ ఇమేజీ పెంచుకుంటున్నారని, ఆ కారణంగానే లోకేశ్ సైతం ఐటీ శాఖను అప్పగించాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
కాగా గతంలో ఐటీ శాఖ నిర్వహించిన పల్లె రఘునాథరెడ్డిని కేబినెట్ నుంచి చంద్రబాబు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. దాంతో ఆ శాఖను తన కుమారుడికి కేటాయించారు. మరోవైపు కీలకమైన ఐటీ శాఖను లోకేశ్‌కు అప్పగిస్తే...దాన్ని సమర్థవంతంగా నిర్వహించకపోతే... రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుందనే పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.