నేనిచ్చిన లక్ష..రూ.50లక్షలు కావాలి...
రుణమాఫీపై మహిళలతో సీఎం బాబు వ్యాఖ్య
సాక్షి, అనంతపురం: ‘‘ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష రుణం మాఫీ చేశాను.. మాఫీ అయ్యే రూ.లక్షను మీ భర్తల చేతికివ్వద్దు.. మీరే ఆ సొమ్ముతో వ్యాపారాలు చేసి రూ.50 లక్షలు సంపాదించాలి. మరో నాలుగు నెలల తర్వాత నేను మళ్లీ జిల్లాకు వస్తాను.. అప్పుడు రూ.లక్షతో రూ.50 లక్షలు ఎలా సంపాదించాలో చెపుతా’’నని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం సీఎం అనంతపురం జిల్లాకు వచ్చారు. తొలిరోజు పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా పుట్టపర్తి ఎనుములపల్లి క్రాస్ మైదానంలో డ్వాక్రా మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ముఖాముఖితో పాటు నల్లమాడ, కదిరి రూరల్ మండలం కొండమనాయనిపల్లెల్లో మాట్లాడారు. ‘‘ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్లున్నాయి కానీ 60 శాతం మంది ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో వీటిని పూర్తి స్థాయిలో నిర్మిస్తాం’’ అని బాబు చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులు పుస్తకాల బరువును మోయకుండా ఉండేందుకు వీలుగా విద్యార్థికో ఐప్యాడ్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు సైతం సెల్‌ఫోన్ల స్థానంలో ఐప్యాడ్‌లు ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నారు.