కొత్తగా మంజూరైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
సాక్షి, ప్రొద్దుటూరు : ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడి మంజూరు చేయించుకున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సైతం బ్యాంకుల్లో డబ్బు లేక బౌన్స్ చేయించిన ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. అలాంటి పేదవారికి తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా మళ్లీ చెక్కులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నానన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన 60 మంది బాధితులకు రూ.21.90లక్షల విలువైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికే సుమారు రూ.కోటి వరకు సీఎం రిలీఫ్‌ఫండ్, ఎల్‌ఓసీ లెటర్లను మంజూరు చేయించామన్నారు. చౌడూరు గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి స్రవంతికి ఈ ఏడాది మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన రూ.1,02,722 విలువగల చెక్కును చూపించారు.
ఎంతో ఆశతో బాధితురాలు బ్యాంకుకు వెళితే డబ్బు లేదని బౌన్స్ అయినట్టు తెలిపారన్నారు. ఇలాంటి కేసులు నియోజకవర్గంలో సుమారు 100 వరకు ఉంటాయని, జిల్లాలో, రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న బాధితుల చెక్కులు కూడా బౌన్స్ అయితే ఇంతకంటే దయనీయ పరిస్థితి మరొకటి ఉంటుందా అన్నారు. బౌన్స్ అయిన చెక్కులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, మల్లేల లింగారెడ్డి 25 శాతం చొప్పున చెల్లిస్తే తాను మిగతా 50 శాతం చొప్పున చెల్లించి డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి రాదని తెలిపారు. అలాంటి పరిస్థితి వస్తే తాను రాజీనామా చేయడానికి వెనుకాడనన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మీ, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రరెడ్డి, రాజుపాళెం మండల కనీ్వనర్ ఎస్‌ఏ నారాయణరెడ్డి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, పోసా భాస్కర్, మద్దూరి దేవి, షమీమ్‌బాను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment