సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన బ్యాచ్ పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, రాజధాని ప్రకటన సమాచారం ముందే తెలుసుకుని భూములు కొనుగోలు చేసి అక్రమాలకు తెగించారని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. ఈ విధంగా టీడీపీ నేతలు 4,069.94 ఎకరాల భూమిని కాజేశారని.. జూన్ 1, 2014 – డిసెంబర్31, 2014 మధ్యకాలంలో బినామీల పేరిట ఆ భూములను దోచేశారని నివేదికలో స్పష్టం చేసింది. ఇలా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిలో సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రులు పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీఎస్ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్‌రావు, లంకా దినకర్, పుట్టా మహేష్‌యాదవ్(అప్పటి ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు) తదితరులు ఉన్నారని గుర్తించింది.
అసైన్డ్, లంక భూముల్లోనూ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని.. అస్మదీయుల కోసం రాజధాని సరిహద్దులను మార్చేసి లబ్ధి పొందారని ఉపసంఘం నిర్ధారించింది. ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో పొందుపర్చారు. టీడీపీ సర్కార్ హయాంలో అమరావతి ప్రాంతంలో జరిగిన భూఅక్రమాలపై విచారణకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డిల నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలోని భూదోపిడీపై ఉపసంఘం విచారణ చేసి సీఎంకు శుక్రవారం నివేదిక అందచేసింది.
మంత్రివర్గ ఉపసంఘం నివేదికలోని ముఖ్య వివరాలు
అధికారిక రహస్యాలు వెల్లడించనని చేసిన ప్రమాణాన్ని(ఓత్ ఆఫ్ సీక్రసీ) తుంగలోకి తొక్కి.. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై తన వందిమాగధులకు లీకులిచ్చి అప్పటి సీఎం చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెరదీశారు. తన కోటరీ నేతలు, బినామీలు తక్కువ ధరకు భూములు దోచేశాక, రాజధానిపై అధికారిక ప్రకటన చేశారు. ఇదో అంతర్జాతీయ కుంభకోణమని అప్పట్లో ప్రసార మాధ్యమాలు, రాజకీయ పక్షాలు, మేధావులు ఆరోపించారు.
►టీడీపీ సర్కార్ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇచ్చిన లీకుల మేరకు ఆయన, ఆయన బినామీలు, మంత్రుల బినామీల ద్వారా రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కాజేశారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 మధ్య జరిగిన రిజిస్ట్రేషన్‌లు పరిశీలించాక.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా 4,069.94 ఎకరాలను కొల్లగొట్టారు.
►చంద్రబాబుకు సన్నిహితుడైన లింగమనేని రమేష్.. తన పేరిట, భార్య ఎల్.సుమన, బంధువులు ఎల్.ప్రశాంతి, ఎల్.స్వర్ణకుమారి, ఎల్వీ రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్‌ల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారు.
►మాజీ మంత్రి నారాయణ.. తన వద్ద పనిచేసే అవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల, కోతపు వరుణ్‌కుమార్‌ల పేర్లతో 55.27 ఎకరాల భూమిని కొన్నారు.
►నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరిట 38.84 ఎకరాల భూమి.., అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తన బినామీ సంస్థ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.
►చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరు రవికుమార్ ప్రసాద్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోష్పాద గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ ట్రెండ్స్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ పేరిట 62.77 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది.
►మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు తన బినామీ సంస్థ మైత్రి ఇన్‌ఫ్రా పేరిట 40.85 ఎకరాలు.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బినామీ సంస్థ శశి ఇన్‌ఫ్రా పేరిట 17.13 ఎకరాలు కొనుగోలు చేసినట్లు స్పష్టమైంది.
అసైన్డ్, లంక భూముల పేరిట దగా
రాజధాని ప్రాంతంలో 2353.28 ఎకరాల అసైన్డు, లంక భూములను మాజీ సైనికులు, రాజకీయ బాధితులు మొదలైనవారికి 1954కు ముందు, ఆ తర్వాత అసైన్డ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములున్నాయి. అసైన్డ్ భూముల మార్పిడి అక్రమం. అడ్డగోలుగా అసైన్డు, లంక భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు అండ్ కో ల్యాండ్ పూలింగ్ కింద వాటిని ఇచ్చినట్లు గుర్తించారు.
►నవులూరు, కురగల్లు గ్రామాల్లో అటవీ భూమిని డీ–రిజర్వ్‌గా వర్గీకరించారు. అటవీ భూమిని పోరంబోకు భూమిగా మార్చేసి వాటిని 1954కు ముందు సిపాయిలు తదితరులకు అసైన్ చేసినట్లు చూపారు. నిజానికి ఈ భూములను నిషేధిత జాబితా(సెక్షన్22(1) కింద చేర్చి రిజిస్ట్రేషన్‌లు నిషేధించారు. అయితే వాటిని ఆ జాబితా నుంచి తొలగించి దోచుకున్నారని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది.
సన్నిహితుల సంస్థలకు 850 ఎకరాలు ధారాదత్తం
భూసమీకరణ ద్వారా రైతుల నుంచి తీసుకున్న భూముల కేటాయింపులోనూ టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. రాజధాని ప్రాంతంలో 850 ఎకరాల భూములను సన్నిహితుల సంస్థలకు ధారాదత్తం చేసినట్లు గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఒక ధరకు.. ప్రైవేటు సంస్థలకు మరో ధరకు కేటాయించారని ఎత్తిచూపింది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో 1691 ఎకరాలను సింగపూర్ సంస్థలు అసెండాస్–సిన్‌బ్రిడ్జ్–సెమ్బ్‌కార్ప్‌లకు కట్టబెట్టారని.. ఈ సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసిన ఏడీపీ(అమరావతి డెవలప్ పార్టనర్)లో 58 శాతం సింగపూర్ సంస్థలకైతే.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతమేనని తేల్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర రహదారుల అలైన్‌మెంట్లు మార్చడం ద్వారా అస్మదీయులకు భారీగా చంద్రబాబు ప్రయోజనం చేకూర్చినట్లు మంత్రివర్గ ఉప సంఘం గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment