అమరావతికి ఏడు డైమండ్లు: చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో ఏడు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతిలో పరిపాలన భవనాలకు చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఏడు రహదారుల నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. రూ.915 కోట్లతో నిర్మించనున్న ఈ ఏడు రోడ్లను నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు రోడ్లు రాజధానికి ఏడు డైమండ్లు అని అభివర్ణించారు. ఈ ఏడు రోడ్లను వచ్చే ఉగాదికల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అందుకు అందరూ సహకరించాలని కోరారు.
భవిష్యత్‌లో ఒలింపిక్స్ ఇక్కడే నిర్వహించేలా అమరావతిని తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు ప్రధాన రహదారులతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుందన్నారు. స్థిర నివాసంతో పాటు పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు అమరావతి కేంద్రం అవుతుందని చంద్రబాబు అన్నారు. ఇక ఉండవల్లి, పెనుమాక, నిడమర్రులో కొంతమంది రైతులు భూములు ఇవ్వలేదని, వారు కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించి భూములు ఇవ్వాలని ఆయన సూచించారు.
కాగా ఈ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం 331 ఎకరాలను సమీకరించింది. అయితే యర్రబాలెంలో మరో 12.50 ఎకరాలను రైతులు సమీకరణకు ఇవ్వలేదు. మరోవైపు రహదారుల నిర్మాణానికి రూ.915 కోట్లను ప్రపంచ బ్యాంక్ ఇస్తుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నప్పటికీ ... ఆ ప్రతిపాదనలకు ఇప్పటివరకూ ప్రపంచ బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. దీంతో హడావుడిగా శంకుస్థాపన చేసినా...పనులు జరగడం కష్టమేనని కొందరు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.