‘సింగపూర్’వెలుగులో చీకటి కోణాలు! | chandrababu naidu master plan | Sakshi
Sakshi News home page

‘సింగపూర్’వెలుగులో చీకటి కోణాలు!

Published Wed, Dec 10 2014 1:44 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

chandrababu naidu master plan

* ఇది చంద్రబాబు ‘మాస్టర్ ప్లాన్’
* ఒప్పందంపై అనుమానాలెన్నో
* రాజధాని ప్రణాళిక కోసం ప్రభుత్వాల మధ్య ఒప్పందం అంటూ పైకి ప్రచారం
* నిజానికి సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నట్లు ఒప్పందంలో ఎక్కడా కనిపించదు
* ఏపీ మౌలిక సదుపాయాల సంస్థతో సింగపూర్ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్ ఒప్పందం
* సీఎల్‌సీ, ఎస్‌సీఈ అంటూ మరో రెండు సంస్థలను ఎంఓయూలో చేర్చిన వైనం
* ఏపీ తరఫున సీఆర్‌డీఏ - సింగపూర్ తరఫున     ఆ రెండు సంస్థలు భాగస్వాములని వివరణ
* ఆ సంస్థలకు ఎక్కడా కనీసం టౌన్‌షిప్ నిర్మించిన అనుభవమైనా లేదంటున్న నిపుణులు
* నైపుణ్యం పేరుతో భవిష్యత్తులో మరిన్ని ప్రైవేటు సంస్థలను చేర్చుకోవడానికి ఆస్కారం
* అస్మదీయులకు రాజధాని కాంట్రాక్టులు
* ఎంఓయూ గోప్యతపై అధికారుల్లోనూ విస్మయం
 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసమంటూ సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ఆసాంతం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒప్పందంలోని విషయాలపై పూర్తి స్పష్టత లేదు. ఈ ఒప్పందం విలువ ఎంతో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సింగపూర్ ప్రభుత్వానికి మధ్య కుదరిన ఒప్పందంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇందులో సింగపూర్‌కు చెందిన రెండు సంస్థలు వచ్చి చేరటం సందేహాలను రేకెత్తిస్తోంది. కేవలం మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఒప్పందం అన్నట్లు పైకి చెప్తున్నప్పటికీ.. లోతుల్లోకి వెళితే పక్కా వ్యాపార ధోరణితో కుదుర్చుకున్న ఒప్పందంలాగే ఉందని.. మున్ముందు సింగపూర్‌లోని ప్రయివేటు సంస్థలకు, ఆ ముసుగులో తమ అనుయాయుల సంస్థలకు భారీ కాంట్రాక్టులు కట్టబెట్టడమే ఈ ఒప్పందం సారాంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆ రెండు కంపెనీల ప్రతినిధి ఒక్కరే...
నిజానికి ఈ ఎంఓయూలో ఆంధ్రప్రదేశ్‌కు చెంది న మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు ఇంట ర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్ సింగపూర్ సంస్థకు మధ్య కుదిరింది. అయితే ఒప్పందం మధ్యలో అకస్మాత్తుగా సింగపూర్‌కు చెందిన మరో రెండు సంస్థలు చేరడం గమనార్హం. ఎంఓయూలోని సెక్షన్ 2 లో సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సీఎల్‌సీ), సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్‌ప్రజైస్ (ఎస్‌సీఈ) లు చేరాయి. ఈ రెండు సంస్థలు సిం గపూర్ తరఫున పార్టీలుగా పేర్కొన్నారు. పైగా ఎంఓయూలో ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్ సింగపూర్ సంస్థ సీఈఓ టియో ఎంగ్ చియాంగ్ సంతకం చేశారు. ఆ వ్యక్తే సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సీఎల్‌సీ) సంస్థ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇవి రెండు వేర్వేరు సంస్థలు. కానీ దానికి ప్రతినిధి మాత్రం ఒక్కరే.

సీఎల్‌సీ పూర్తిగా ప్రభుత్వ సంస్థ కాదు
సింగపూర్‌లో ఉన్న ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీ స్’ పూర్తిగా ప్రభుత్వం సంస్థ కాదు. ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న అకడమిక్ బాడీ. 2008లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. సింగపూర్ ప్రభుత్వం నామినేట్ చేసినట్లుగా చెప్తున్న ఆ సంస్థ సీఈఓ ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఈ సంస్థలో విద్యావేత్తలు, వ్యాపారులు, పరిశ్రమల అధిపతులు.. సంస్థ పాలక, సలహా మండళ్లలో సభ్యులు. సింగపూర్ ఎదుర్కొంటున్న నగరీకరణ సమస్యలకు పరిష్కారం కనుగొనడం దాని ప్రధాన ఉద్దేశం. పరిశోధన, సామర్థ్యాల వృద్ధి, పరిశోధన ఫలితాలను మిగతా దేశాల్లోని పరిశోధన సంస్థలతో పంచుకోవడం.. దాని ప్రధాన విధులని ఆ సంస్థ వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

టౌన్‌షిప్ నిర్మించిన చరిత్ర కూడా లేదు...
మాస్టర్ ప్లాన్‌రూపకల్పన వరకే ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్ పరిమిత మవుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సింగపూర్ సంస్థలు మాస్టర్ ప్లాన్ రూపకల్పన, రాజధాని అభివృద్ధి, దాని పరిసరాల అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. అయితే.. సింగపూర్ కంపెనీలు, సంస్థల వ్యాపారాలు, అంతర్జాతీయ వ్యాపారాలను వృద్ధి చేయడం, వాటి ప్రయోజనాలు కాపాడే దిశగా వ్యూహాలు ఖరారు చేసి అమలును పర్యవేక్షించడం ‘ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రజైస్ సింగపూర్’ లక్ష్యమని దాని వెబ్‌సైట్‌లోనే ఉంది.

‘ప్రపంచంలో ఎక్కడైనా పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేసిన అనుభవం కానీ, కనీసం టౌన్‌షిప్పులను నిర్మించిన చరిత్ర గాని సీఎల్‌సీ సంస్థకు లేవు. ఆ సంస్థ పాలకమండలి, సలహామండలిలో సభ్యులుగా ఉన్న బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు చెందిన సంస్థలకు ఆ అనుభవం ఉంది. అవన్నీ ప్రయివేటు సంస్థలే. అలాంటివి భారత్‌లో బోలెడు న్నాయి’ అని మన వ్యాపారులు వివరిస్తున్నారు.

లేని ‘సీఆర్‌డీఏ’ భాగస్వామా?
మరోవైపు ఆంధ్రప్రదేశ్ తరఫున రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)ను ఒప్పం దంలో మరో పార్టీగా రెండో పేజీ (ఆర్టికల్ 2.1) లో పేర్కొన్నారు. సీఆర్‌డీఏను ఇంకా ఏర్పాటు చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలా భాగస్వామి అవుతుందనే ప్రశ్నకు సమాధానం లేదు. సీఆర్‌డీఏ ఏర్పాటు ప్రతిపాదన బిల్లును శాసనసభలో పెట్టనే లేదు. పైగా భూ సమీకరణకు సంబంధించి మార్గదర్శకాలేవీ ప్రభుత్వం నోటిఫై చేయలేదు. అలాగే భూ సమీకరణకు కూడా నోటిఫికేషన్ జారీ చేయలేదు. ప్రతిపాదన దశలోనే ఉన్న సీఆర్‌డీఏను ఒప్పందంలో భాగస్వామిని చేయడం చట్టపరంగా ఎలా చెల్లుబాటవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎంఓయూ విలువపై ఎందుకంత గోప్యం?
మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సోమవారం సంతకాలు చేసిన ఎంఓయూ పారదర్శకత లోపించి అంతా గోప్యంగా సాగింది. రాష్ట్ర రాజధానికి అవసరమైన సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి గాను సింగపూర్ రూ. 1,200 కోట్ల మేర చార్జీల రూపంలో లేదా అంత మొత్తంలో కొత్త రాజధాని ప్రాంతంలో లబ్ధిపొందేందుకు వీలు కల్పిస్తున్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. అయితే అవగాహనా ఒప్పందంలో ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా స్పష్టతనివ్వలేదు.

భారీ మొత్తంలో లావాదేవీలు జరిగే ఒప్పందం విషయలో పారదర్శకత పాటించకుండా దాచిపెట్టినట్లుగా వ్యవహరించడాన్ని అధికారులే తప్పుపడుతున్నారు. ఈ ఒప్పందంపై ఎప్పటికప్పుడు సమావేశమై అవసరమైన మేరకు నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పించారు. అంటే.. మాస్టర్ ప్లాన్‌తో పాటు రాజధానిలో నిర్మాణాలు కూడా కట్టబెడితే భారీ స్థాయిలో మరో ఒప్పందం కుదుర్చుకోవడానికి, సింగపూర్ కంపెనీలు, వాటి ముసుగులో తమ అనుయాయుల కంపెనీలకు భారీ కాంట్రాక్టులు కట్టబెట్టడమే లక్ష్యంగా కనిపిస్తోందనే అనుమానాలు అన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రయివేటు కంపెనీలకు రాచబాట వేశారా?
ఒకరకంగా చూస్తే భవిష్యత్తులో రాజధానికి సంబంధించి సర్వం ప్రైవేటు ఒప్పందాలు జరిగే రీతిలో ఎంఓయూ ఉన్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎంఓయూలోని లక్ష్యాలకు అనుగుణంగా భవిష్యత్తులో సంబంధిత నైపుణ్యత కోసం బయటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నట్టు స్పష్టంగా ఉంది. అంటే రేపటి రోజున.. సింగపూర్ కంపెనీలకు భారీ కాంట్రాక్టులను భారీ ధరలకు ఎలాంటి తనిఖీలు, ముందస్తు పరిశీలనలు లేకుండా అప్పగించడానికి ఈ తతంగం సాగుతోందని.. అందులో భాగంగానే ప్రభుత్వాల మధ్య ఒప్పందం అంటూ ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్ కంపెనీల ముసుగులో తమ అనుయాయుల కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికే తెరవెనుక తతంగం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement