29న సింగపూర్ వెళ్లనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం(29న) సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ టూర్‌లో నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్న ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమవుతారు. నూతన రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్‌ను రూపొం దిస్తున్న ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్(సింగపూర్) సంస్థ ప్రతినిధులు దాని గురించి ప్రజెంటేషన్ ద్వారా బాబుకు వివరించనున్నారు.
సీఎంతోపాటు సింగపూర్ టూర్‌కు మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, కమ్యూనికేషన్స్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రణాళికాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, మున్సిపల్, పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి రావత్ వెళ్లనున్నారు. అక్కడినుంచి బాబు 30న రాత్రికి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు. 31న రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమవుతారు.
నేడు చిత్తూరులో పర్యటన: ఇదిలా ఉండగా చంద్రబాబు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. సత్యవేడు నియోజకవర్గంలో ఐఐఎస్‌ఈఆర్, ఐఐటీ, ఐఐఐటీలకు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. 29న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌టీఆర్ ఘాట్‌లో ఆయన నివాళులర్పిస్తారు. అక్కడినుంచి పశ్చిమగోదావరి జిల్లాకు వెళతారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయటంతోపాటు బహిరంగసభలో ప్రసంగిస్తారు. తరువాత గుంటూ రు జిల్లా తుళ్లూరు చేరుకుని పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే పార్టీ వ్యవస్థాపకదినోత్సవంలోనూ పాల్గొంటారు. ఆ తరువాత సింగపూర్ బయల్దేరి వెళ తారు. ఢిల్లీ వెళ్లిన బాబు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రికి అక్కడే బసచేసిన ఆయన శనివారం నేరుగా తిరుపతి వెళతారు.
ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను శాసనసభకు సమర్పించారు. ఏటా మార్చిలో బడ్జెట్ సమావేశాలు ముగిసేనాటికి తన ఆస్తులు, అప్పుల వివరాలను బాబు సభకు సమర్పిస్తున్నారు. తాజాగా ఆయన వీటిని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అందజేశారు.