బాబు చేతికి రాజధాని మాస్టర్‌ప్లాన్ | Launches hand, the capital of the masterplan | Sakshi
Sakshi News home page

బాబు చేతికి రాజధాని మాస్టర్‌ప్లాన్

Published Tue, Mar 31 2015 2:55 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

బాబు చేతికి రాజధాని మాస్టర్‌ప్లాన్ - Sakshi

బాబు చేతికి రాజధాని మాస్టర్‌ప్లాన్

  • తొలిదశ మాస్టర్‌ప్లాన్ బ్లూప్రింట్‌ను అందజేసిన సింగపూర్
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణ  తొలి దశ మాస్టర్‌ప్లాన్ బ్లూప్రింట్‌ను సింగపూర్ సంస్థలు సీఎం చంద్రబాబుకు అందచేశాయి. సింగపూర్‌లో పర్యటిస్తున్న బాబుకు సోమవారం ఆ దేశ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ బ్లూప్రింట్‌ను అందించారు. రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్న అంశాలను తొలిదశలో పేర్కొన్నారు.  ప్రస్తుతం ఉన్న పట్టణాలు, వ్యవసాయ క్షేత్రలు, హెరిటేజ్ నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుని బ్లూప్రింట్‌ను తయారు చేశారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించే విషయంలో రాష్ట్రం ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (సింగపూర్)తో డిసెం బర్‌లో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 7,235 చ.కి.మీ. మేర ప్రాంతానికి సంబంధించి తొలిదశ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. 220 చ.కి.మీ. విస్తీర్ణంలో రాజధాని సిటీ మాస్టర్‌ప్లాన్, 8 చ.కి.మీ. మేర సీడ్ డెవలప్‌మెంట్ మాస్టర్‌ప్లాన్‌ను ఇవ్వనున్నట్టు సింగపూర్ తెలియజేసింది. వీటిని ఈ ఏడాది మధ్యలో అందజేస్తామంది. కాగా ఈ మాస్టర్‌ప్లాన్‌ను సుర్భానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, జురాంగ్ కన్సల్టెంట్స్ సంయుక్తంగా రూపొందించారు.
     
    మార్పుచేర్పులు సూచించిన బాబు..

    మాస్టర్‌ప్లాన్‌లో చంద్రబాబు కొన్ని మార్పులు చేర్పులు సూచించారని రాష్ట్రప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆ మేరకు ఆరు నుంచి ఎనిమిది వారాల్లో సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌ను అందజేస్తుంది. ఇక రెండోదశ మాస్టర్ ప్లాన్‌ను ఈ ఏడాది మధ్యలో అందిస్తుంది. రాజధాని ప్రాంతాన్ని రెండు రింగురోడ్లు, రేడియల్ రోడ్లు నిర్మించటం ద్వారా కోర్ క్యాపిటల్ ఏరియాతోపాటు పరిసర పట్టణ ప్రాంతాలను కలుపుతారు.కొత్త రాజధాని మరో వెయ్యేళ్ల పాటు ప్రపంచ శ్రేణి నగరంగా ఉండాలన్నది తన ఆకాంక్ష అని సీఎం తెలిపారు. సోమవారం ఉదయం సింగపూర్ చేరుకున్న బాబుకు ఆ దేశ విదేశాంగ మంత్రి షణ్ముగంతోపాటు రాయబారి గోపీనాథ్ పిళ్లై అల్పాహార విందు ఇచ్చారు.విశాఖను స్మార్ట్ సిటీగా రూపొం దించేందుకు అమెరికాతో ఒప్పందం జరిగిందని, దాన్ని తలదన్నేలా కొత్త రాజధానిని  తీర్చిదిద్దాలని సీఎం అన్నారు.
     
    సింగపూర్ మంత్రి ఈశ్వర న్‌తో చర్చలు

    సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఈశ్వరన్‌తో నూతన రాజధాని అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సింగపూర్ ప్రతినిధులు ఛీర్ హాంగ్ టాట్, టో యంగ్ చాంగ్, ఫ్రాన్సిస్ చోంగ్, వాంగ్ కై యంగ్, బెంజిమన్ యాప్, ఏపీ ప్రతినిధి బృంద సభ్యులు పాల్గొన్నారు.  అసెండాస్, సెమ్ కార్ప్ సంస్థ ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ చేపట్టిన సమీకృత ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు.
     
    లీ క్వాన్ యీ మృతికి సంతాపం

    సింగపూర్ వ్యవ స్థాపక పితామహుడు లీ క్వాన్ యీ మృతికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. తన ప్రగతిశీల విధానాలతో యీ సింగపూర్ దశ, దిశ మార్చారని, అవినీతి రహిత పాలనతో సింగపూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దారని కీర్తించారు.
     
    పెట్టుబడులతో రండి: బాబు

    ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలిరావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (ఐఈ), సింగపూర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రంలో సింగిల్ డెస్క్ విధానాన్ని అమలు చేస్తున్నామని, 21 రోజుల్లోనే ఆన్‌లైన్ ద్వారా అన్ని అనుమతులిస్తున్నామన్నారు.  రాష్ట్రంలో విద్యుత్ రంగం పటిష్టంగా ఉందన్నారు. విద్యుత్, కొరత, కోతలు, లేవన్నారు. ఏపీ... 2022 నాటికి దేశంలోనే మూడో రాష్ట్రంగా, 2029 నాటికి అగ్ర రాష్ట్రంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానాలిచ్చారు. అనంతరం ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ సంస్థ సీఈఓ టియో యంగ్ చెయాంగ్ మాట్లాడుతూ ఏపీలో కొత్త రాజధాని నగరంతో పాటు, అనేక శాటిలైట్ పట్టణాల్ని నిర్మిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement