మాస్టర్‌ప్లాన్‌లో ఐదు దశలు | Masterplan In Five steps | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ప్లాన్‌లో ఐదు దశలు

Published Sun, Jul 26 2015 4:08 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

మాస్టర్‌ప్లాన్‌లో ఐదు దశలు - Sakshi

మాస్టర్‌ప్లాన్‌లో ఐదు దశలు

(ఆంధ్రప్రదేశ్ బ్యూరో): అమరావతిలో రాజధాని ప్రధాన కేంద్రం (సీడ్ కేపిటల్) ఐదు దశల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ బృందం సమర్పించిన మాస్టర్ ప్లాన్‌లో పేర్కొంది. 4,185.965 ఎకరాల రాజధాని ప్రధాన కేంద్రం అభివృద్ధి ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మొత్తం 6.97 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. 17.20 మిలియన్ చదరపు మీటర్ల గరిష్ట నిర్మిత ప్రాంతం ఏర్పాటు చేయాలని పేర్కొంది. మొత్తమ్మీద ఈ ప్రాంతంలో 2.98 లక్షల మంది జనాభాకు ఆవాసాలు ఏర్పాటవుతాయని వివరించింది.

ఈ ఐదు దశల రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యక్రమం ఎప్పట్లోగా పూర్తవుతుందో, 6.97 లక్షల మందికి ఎప్పటికి కొత్త ఉద్యోగాలు వస్తాయో మాత్రం అందులో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. మాస్టర్‌ప్లాన్‌లోని ముఖ్యమైన అంశాలిలా ఉన్నాయి. అమరావతి అభివృద్ధిలో రాజధాని ప్రాంతం అత్యంత ప్రధానమైనది. రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి గుండెకాయ లాంటి సచివాలయం, శాసనసభ, రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం(హైకోర్టు), ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయమూర్తుల అధికారిక నివాసాలు ఇందులోనే ఉంటాయి.  ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం మధ్య ప్రధాన రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు.
 
మొదటి దశ
మొత్తం విస్తీర్ణం    :    901.93 ఎకరాలు
సీడ్ కేపిటల్‌లో దీని  నిష్పత్తి    :    18 శాతం
అందుబాటులోకి రానున్న నిర్మిత ప్రాంతం    :    2.49 మిలియన్ల చ.మీ.
అందుబాటులోకి వచ్చే అదనపు ఉద్యోగాలు    :    95 వేలు


ప్రధానమైనవి: సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు. కీలకమైన ప్రభుత్వ పరిపాలనా కేంద్రం దీని పరిధిలోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రభుత్వ పరిపాలనా కేంద్రం మొత్తాన్ని ఈ ప్రాంతానికి తరలించడంవల్ల వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఇక్కడకు వస్తాయి. అందువల్ల ఇక్కడ 26 వేల మందికి నివాస గృహాలు ఏర్పాటవుతాయి. లింగాయపాలెం గ్రామం కూడా దీని పరిధిలోకి వస్తుంది. మొదటి దశ అభివృద్ధి పనుల వల్ల 45 వేల ప్రభుత్వ, 50 వేల ప్రైవేటు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

సచివాలయం, శాసనసభ, హైకోర్టు, పౌర పరిపాలనా కేంద్రాలు మొదటి దశ సీడ్ కేపిటల్‌లో అత్యంత ముఖ్యమైనవి. పౌర పరిపాలనా కేంద్రం, ప్రాంతీయ ఆస్పతి, బిజినెస్ పార్కు కూడా ఈ దశలోనే రూపుదిద్దుకుంటాయి. ఇక్కడ వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిపాలనా కేంద్రాలవల్ల నివాస ప్రాంతాలు రూపుదిద్దుకుంటాయి. మెరుగైన రవాణా సౌకర్యం కల్పనలో భాగంగా సీడ్ డెవలప్‌మెంట్ కేంద్రం నుంచి డౌన్ టౌన్ రోడ్డు నిర్మిస్తారు.
 
రెండో దశ
మొత్తం విస్తీర్ణం    :    941.471 ఎకరాలు
సీడ్ కేపిటల్‌లో దీని  నిష్పత్తి    :    18 శాతం
అందుబాటులోకి రానున్న నిర్మిత ప్రాంతం    :     4.03 మిలియన్ల చ.మీ.
అందుబాటులోకి వచ్చే అదనపు ఉద్యోగాలు    :    1. 60 లక్షలు

 
ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు: ట్రాన్సిట్ ఓరియంటెడ్ హై డెన్సిటీ కమర్షియల్ నోడ్, బిజినెస్ పార్కు క్లస్టర్,  బొటానికల్ గార్డెన్. కృష్ణా నది ఒడ్డు వెంబడి పచ్చని వనాలతో రూపుదిద్దుకోనున్న బొటానికల్ గార్డెన్ దీనికి ప్రత్యేక ఆకర్షణ కానుంది. రెండో దశ సీడ్ కేపిటల్ ప్రస్తుత ఉద్దండరాయునిపాలెం ప్రాంతంలో ఏర్పాటవుతుంది. మొదటి దశలో రూపుదిద్దుకున్న అమరావతి ప్రధాన రాజధాని కేంద్రంలోకి రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తం తరలిరావడంతో ప్రధాన వాణిజ్య ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాలకు అభివృద్ధి బాటలు పడతాయి.

వాణిజ్య ప్రాంతం మొదటి దశ నుంచి రెండో దశ ప్రాంతంలోకి సహజంగానే విస్తరిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు ప్రధాన అభివృద్ధి రహదారికి అనుసంధానంగా రోడ్లు, మౌలిక సదుపాయాలు రూపొందిస్తారు. ప్రస్తుతం ఉద్దండరాయునిపాలెంలో ఉన్న 1,500 మంది జనాభా సీడ్ కేపిటల్ రెండో దశ అభివృద్ధి ప్రణాళికలో ఇమిడిపోతారు. రవాణా అవసరాలు తీర్చేందుకు బస్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ అందుబాటులోకి తెస్తారు. ఈ శలో పది వేల ప్రభుత్వ, 1.50 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. 94 వేల మంది జనాభాకు ఆవాసాలు ఏర్పాటవుతాయి.
 
మూడో దశ
మొత్తం విస్తీర్ణం    :    726.49 ఎకరాలు
సీడ్ కేపిటల్‌లో దీని నిష్పత్తి    :    18 శాతం
అందుబాటులోకి రానున్న నిర్మిత ప్రాంతం    :    4.04 మిలియన్ల చ.మీ.
అందుబాటులోకి వచ్చే అదనపు ఉద్యోగాలు    :    1. 52 లక్షలు

ప్రస్తుత తాళ్లాయపాలెం ప్రాంతంలో 726.49 చదరపు ఎకరాల్లో మూడో దశ సీడ్ కేపిటల్ అభివృద్ధి పనులు చేపడతారు. రాజధాని ప్రాంత నడిబొడ్డున వాణిజ్య  అభివృద్ధి, తూర్పు భాగంలో బిజినెస్ పార్కు ఏర్పాటు మూడో దశలో ప్రధానమైనవి.
 
నాలుగో దశ
మొత్తం విస్తీర్ణం    :    558.45 ఎకరాలు
సీడ్ కేపిటల్‌లో దీని  నిష్పత్తి    :    11 శాతం
అందుబాటులోకి రానున్న నిర్మిత ప్రాంతం    :    3.29 మిలియన్ల చదరపు మీటర్లు
అందుబాటులోకి వచ్చే అదనపు ఉద్యోగాలు    :    1. 77 లక్షలు

అత్యంత విలువైన వాణిజ్య ప్రాంతాలు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. వాణిజ్య సముదాయం, కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన ఈ దశలో రూపుదిద్దుకోనున్న ప్రధాన మైలురాళ్లు. బహుళ విభాగాల విశ్వవిద్యాలయం, నివాస సముదాయాలు ఈ దశలో ఏర్పాటవుతాయి.  చిత్తడినేల పార్కు ప్రధాన ఆకర్షణ కానుంది. 29 వేల మందికి ఆవాసాలు రూపుదిద్దుకుంటాయి.
 
ఐదో దశ
మొత్తం విస్తీర్ణం    :    1053.55 ఎకరాలు
సీడ్ కేపిటల్‌లో దీని  నిష్పత్తి    :    35 శాతం
అందుబాటులోకి రానున్న నిర్మిత ప్రాంతం    :    3.35 మిలియన్ల చ.మీ.
అందుబాటులోకి రానున్న అదనపు ఉద్యోగాలు    :    1.13 లక్షలు

అత్యధిక భూమిని వినియోగించే దశ ఇదే. అందువల్ల ఇక్కడ వాణిజ్య, వినోద కేంద్రాలు రూపొందిస్తారు. సందర్శకుల కోసం బహుళ అంతస్తుల భవనాల ఎదుట వాటర్‌ఫ్రంట్, యాంప్లీ థియేటర్లు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ప్రధాన వాణిజ్య సముదాయాలు, గోల్ఫ్ కోర్టులు, విల్లాలు ఇక్కడ ఏర్పాటవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement