
కాసేపట్లో కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ
అమరావతి: కర్నూలు జిల్లా టీడీపీ నేతల పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. జిల్లా నేతలతో చంద్రబాబు నాయుడు ఇవాళ సమావేశం అవుతున్నారు ఈ భేటీకి జిల్లా ఇన్‌ఛార్జ్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి భూమా అఖిలప్రియ, టీజీ వెంకటేష్, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు హాజరు కానున్నారు పార్టీలో సమన్వయం, నేతల్లో విభేదాలు, నంద్యాల ఉప ఎన్నిక తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
భూమా అఖిలప్రియ మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి భూమా నాగిరెడ్డికి సన్నిహితుడు అయిన ఏవీ సుబ్బారెడ్డిని మరింత దూరం పెడుతున్నట్టు సమాచారం. దీంతో అసంతృప్తి చెందిన ఆయన అఖిలప్రియపై తిరుగుబాటు ప్రకటించారు. మరోవైపు నంద్యాలలో భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరాయి. ఆయన మరణం తర్వాత కూడా అవేవీ చల్లారకపోగా మరింత రాజుకున్నాయి. ప్రధానంగా సీటు ఎవరిదనే విషయంలో తగాదాలు మరింత ముదిరాయి.
ఇదే నేపథ్యంలో సీటు తమకేనని.. భూమా కుటుంబానికి కాకుండా శిల్పాకు ఇస్తే ఓడిస్తామని ఫరూఖ్, ఎస్పీవై రెడ్డిలు తెగేసి చెప్పారు. ఈ పరిస్థితుల్లో శిల్పా మోహన్ రెడ్డి కాస్తా పార్టీ మారారు. ఇక నంద్యాల సీటు విషయంలో తమకు ఎదురులేదనుకున్న భూమా కుటుంబానికి తాజాగా ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్ కాస్తా చెమటలు పుట్టిస్తోంది.
ఈ నేపథ్యంలో నంద్యాల సీటు విషయంపై చర్చించడంతో పాటు తగాదాలను పరిష్కరించేందుకు జిల్లానేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు ఎవరికి ఇద్దామనే అంశంపై భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు మాజీ మంత్రి ఫరూఖ్, ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డిల పేర్లను కూడా ఆ పార్టీ అధిష్టానం తాజాగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇది భూమా కుటుంబానికి మింగుడుపడని వ్యవహారంగా మారినట్టు సమాచారం.