బొత్స... బీజేపీ మధ్యలో బాబు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేం దుకు సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. బద్ధ శత్రువు మిత్రపక్షంలో చేరితే తమకు ముప్పు వస్తుందని భయంతో... సత్తిబాబును బదనాం చేసేస్తే పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ అగ్రనేతలు పునరాలోచనలో పడతారని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే వ్యూహాత్మకం గా పావులు కదుపుతున్నారు. బొత్సకు సంబంధించిన వ్యవహారాలన్నీ వెలుగులోకి తీసుకురావాలని, అవసరమైతే అసెంబ్లీలో ప్రస్తావించాలని జిల్లాలోని తమ నేతలకు చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. ఆమేరకే టీడీపీ నేతల కూడా నడుచుకుని బొత్సపై ఉన్న అవి నీతి ఆరోపణల వ్యవహారాలను బయటకు తీసుకువస్తున్నారని సమాచారం. సీబీసీఐడీ, ఏసీబీల చేత విచారణ జరిపించి బొత్సను ఇరకాటంలో పెట్టేందుకు పక్కా వ్యూహరచన చేసినట్టు తెలిసింది.
కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని, ఇంకా పార్టీలో కొనసాగడం మంచిది కాదన్న ఉద్దేశానికి బొత్స సత్యనారాయణ వచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపడమే కాకుండా ఆ పార్టీ అగ్రనేతల్ని కూడా కలిసినట్టు బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. ఒకసారి పురందేశ్వరి ద్వారా, ఇంకోసారి కన్నా లక్ష్మీనారాయణ ద్వారా, మరోసారి కావూరి సాంబశివరావు ద్వారా, చివరిగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసినట్టు సమాచారం. పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు ద్వారా కలిసినప్పుడు పెద్ద ఆసక్తిగా చూపకపోయినా పవన్ కళ్యాణ్‌తో కలిసి వచ్చినప్పుడు అమిత్ షా కాస్త ఆలోచనలో పడినట్టు బీజేపీ వర్గాల సమాచారం. అందులో భాగంగా ఇక్కడి బీజేపీ వర్గాలకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి బొత్స విషయాన్ని వాకబు చేసినట్టు సమాచారం.
బొత్స పరిస్థితేంటని అమిత్ షా అడిగిన సందర్భంలో ఓక్స్ వ్యాగన్ వ్యవహారం, డీసీసీబీలో చోటు చేసుకున్న పరిణామాలు, కుటుంబ పాలన, మద్యం వ్యాపారం, చెరువుల ఆక్రణమల ఆరోపణలు తదితర విషయాల్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లగా, అవన్నీ షరా మూమూలేనని, పార్టీలో చేర్చుకుంటే ప్రయోజనం ఉంటుందా? లేదా?, ఆయన్ని చేర్చుకుంటే మన కార్యకర్తలకు ఇబ్బందులుంటాయా? అని అడిగే సరికి పర్వాలేదని ఇక్కడి నేతలు చెప్పినట్టు తెలిసింది. ఇదే సందర్భంలో ఆయన పార్టీలో చేరితే మీరంతా సహకరిస్తారా? అని కూడా అమిత్‌షా అడిగినట్టు తెలియవచ్చింది. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్థానిక నేతలు చెప్పినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలోనే బొత్స ఈనెలలో గాని, జనవరి 29,30వ తేదీల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్న జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరవచ్చనే ప్రచారం కూడా ఊపందుకుంది.
దీంతో బొత్స బీజేపీలోకి వెళ్లడం ఖాయమని తెలుసుకున్నాక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అప్రమత్తమైనట్టు సమాచారం. బొత్స... బీజేపీలో చేరితే తమకు ఇబ్బం దులొస్తాయని, బీజీపీ సఖ్యత చెడిపోతుందని, ఓవర్‌టేక్ చేసే బొత్సతో భవిష్యత్‌లో సమస్యలు తప్పవన్న ముందస్తు ఆలోచనతో ఆ పార్టీలోకి వెళ్లకుండా బొత్సకు బ్రేకులు వేయాలని చంద్రబాబు పథక రచన చేసినట్టు తెలిసింది. అందులో భాగంగానే జిల్లాలోని తమ నాయకుల ద్వారా తన ఆలోచనలను అమలు చేస్తున్నట్టు సమాచారం. బొత్సను ముందుగా ఇరకాటంలో పెట్టాలంటే ఆయన రాజకీయ జీవితానికి నాంది అయిన డీసీసీబీపై పడాలని యోచించినట్టు సమాచారం. ఎలాగూ సొసైటీల్లో బినామీ రుణాలుంటాయని ఆ గుట్టు విప్పడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న ఆలోచనతో ప్రస్తుత డీసీసీబీ చైర్‌పర్సన్ మరిశర్ల తులసీని టార్గెట్ చేశారు. అనుకున్నట్టే తన రావివలస సొసైటీ చిక్కింది.
ప్రాథమిక విచారణలో బినామీ రుణాల వ్యవహారం వెలుగు చూడటంతో 51స్టాట్యూటరీ విచారణకు ఉపక్రమించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా జరిగాయని, డీసీసీబీ కేంద్రంగా నడిచాయంటూ ఇప్పుడేకంగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. తద్వారా బదనాం చేయవచ్చని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు కూడా ప్రస్తావించారు. బొత్స సత్యనారాయణ డీసీసీబీ చైర్మన్ అయిన దగ్గరి నుంచి అవకతవకలు జరిగాయని, బినామీల పేరుతో కోట్లాది రూపాయల రుణాలను బొత్స సత్యనారాయణ, ఆయన అనుచరులు నొల్లుకున్నారని సభలో ప్రస్తావిస్తూ ఆరోపించారు.
ఒక్క రావివలసలోనే బినామీ పేర్ల మీద 6నుంచి 7కోట్లు రూపాయలు దిగమింగారని, జిల్లాలోని 94సొసైటీల్లో విచారణ జరిపితే మరింత అవినీతి వెలుగు చూస్తుందని కోరారు. ఒక్క బినామీ రుణాల్నే కాదు గతంలో నడిచిన మద్యం సిండికేట్ కేసును తిరగదోడాలని చూస్తున్నారు. దానిపై కూడా ఏదొక రోజు అసెంబ్లీలో ప్రస్తావించాలని టీడీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇలా కేసులతో ఇరకాటంలో పెట్టి, బదనాం చేసి బీజేపీ ఆగ్రనేతలు పునరాలోచనలో పడేలా చేయడమే టీడీపీ లక్ష్యంగా తెలుస్తోంది.