చంద్రబాబుది రెండుకళ్ల సిద్ధాంతం
Published Wed, Aug 28 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
మేదరమెట్ల, న్యూస్‌లైన్ :టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుది రెండుకళ్ల సిద్ధాంతమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ విమర్శించారు. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని ఆ పార్టీ నాయకులతో రెండు రకాలుగా ఆయన మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో చేపట్టిన దీక్షకు మద్దతుగా మేదరమెట్ల సెంటర్లో ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిందని, ఆ విషయంపై ఆ పార్టీ నాయకులు ఎవరైనా తమతో బహిరంగ చర్చకు రావచ్చని సవాల్ విసిరారు.
యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే ముందుగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. అలాకాకుండా టీడీపీ వంటి రాజకీయ పార్టీల నాయకులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. విభజన ప్రకటన చేసే సమయంలో శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని బాలాజీ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని, అలా చేయలేకుంటే సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష చేయడం గొప్ప విషయమన్నారు. జైల్లో ఉన్నప్పటికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే ఉద్దేశంతో దీక్ష చేపట్టడాన్ని ఆయన కొనియాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అందరికంటే ముందుగానే రాజీనామాలు చేశారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజన ప్రకటనకు ముందే జలాలు, విద్యుత్ పంపిణీ, ఉద్యోగుల సమస్యలపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన అంశంపై తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి బలికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకుంటే సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులంతా తగినమూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దీక్షలో వైఎస్‌ఆర్ సీపీ మండల కన్వీనర్ జజ్జర ఆనందరావు, మేదరమెట్ల సర్పంచ్ పేరం నాగలక్ష్మి, ఆరుమళ్ల సామ్యేలు, బొనిగల ఎలిసమ్మ, మస్తాన్, డేవిడ్‌సన్ కూర్చోగా, ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, శింగమనేని శ్రీనివాసరావు, అన్నెం అంజి రెడ్డి, రంపతోటి సాంబయ్య, కర్నాటి వెంకట్రావు పాల్గొని మద్దతు తెలిపారు.
Advertisement
Advertisement