సమైక్య ముసుగులో విభజనవాది చంద్రబాబు
Published Sun, Dec 29 2013 2:16 AM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన దాచేపల్లి మండలం నడికుడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రాత్రి సమైక్య శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. సభలో అంబటి రాంబాబు మాట్లాడుతూ బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర విభజనకు నూటికి నూరు పాళ్లు సహకరించిన టీడీపీని రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేస్తారని చెప్పారు. కొబ్బరికాయలు, సమన్యాయం, ఇద్దరు కొడుకులు లాంటి ముతక సామెతలను పక్కన పెట్టి బాబు ఏ వాదో ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విభజనకు అనుకూలంగా బాబు ఇచ్చిన లేఖను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో టీడీపీని ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.
ఈ జన్మలో కాదుకదా ఏ జన్మలోనూ చంద్రబాబు ఇక సీఎం కాలేరన్నారు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే సమైక్యాంధ్ర అని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న వెంటనే సీమాంధ్రలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేస్తే విభజన ఆగేదన్నారు. విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనన్నారు. సీఎం ఇప్పటికైనా విభజన ముసుగును తొలగించి సమైఖ్యాంధ్ర కోసం పాటు పడుతున్న పార్టీలతో జత కలవాలన్నారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ఇటలీ నుంచి వచ్చిన సోనియా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళా విభాగం జిల్లా కన్వీనర్ లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి ఓట్లు సీట్లు కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న పంట భూములన్నీ బీడుగా మారతాయన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం కృషి చేస్తున్న జగన్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని పిలుపునిచ్చారు. సభలో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ సాయిబాబు, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ మాబు, ఎస్టీ సెల్ కన్వీనర్ హనుమంతు నాయక్, సేవాదళ్ కన్వీనర్ చిన్నపరెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ ఉత్తమరెడ్డి, విద్యార్థి సంఘం నాయకుడు నర్సిరెడ్డి, దాచేపల్లి మండల కన్వీనర్ జాకీర్‌హుస్సేన్, మాజీ ఎంపీపీ అంబటి శేషగిరిరావు పాల్గొన్నారు.
Advertisement