తిరుపతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరోమారు మండిపడ్డారు. చంద్రబాబు సందర్బం లేకుండా ఆస్తులు ప్రకటించడంపై పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్తుల ప్రకటనలో నిజాయితీ ఉంటే బాబు గారూ..కాణిపాకంలో ప్రమాణ చేయగలరా అని చెవిరెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ బాబు అలా చేస్తే తన నిజాయితీని నిరూపించుకున్నట్లేనని ఆయన తెలిపారు. కాగా, బాబు తనంతట తానుగా సీబీఐ విచారణకు సిద్దపడాలన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన ఆస్తుల మొత్తం విలువ రూ. 42.06 లక్షలని ఆయన తెలిపారు. తన భార్య భువనేశ్వరి పేరిట రూ. 33.03 కోట్ల విలువైన ఆస్తులున్నాయన్నారు. తన కుమారు లోకేష్ ఆస్తుల విలువ రూ. 4.92 కోట్లు, కోడలు బ్రహ్మణి ఆస్తులు విలువ 3.30 కోట్లు అని వెల్లడించారు.. తాను ప్రకటించిన ఆస్తులు కాకుండా తనకింకా ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే వాటా ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.