సాక్షి, హైదరాబాద్: బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని ఉహాగానాలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన నేపథ్యంలో అసలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందో, లేదో స్పష్టం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. సిరియాకు సంఘీభావ సదస్సు సందర్భంగా రాఘవులు ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిపై చంద్రబాబు దేశ రాజధానిలో వివిధ రాజకీయ పార్టీల నేతల్ని కలవడంలో తప్పేమీ లేదన్నారు.
అయితే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో శనివారం ఢిల్లీలో చర్చలు జరిపినందున పొత్తుపై వస్తున్న ఉహాగానాలు వాస్తవమో కాదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బీజేపీతో టీడీపీ పొత్తు లేకపోతే కమ్యూనిస్టులు జత కట్టేందుకు సిద్ధమా, కాదా? అనేది అప్రస్తుతమని, పొత్తులకు, సయోధ్యలకు ఇంకా చాలా సమయం ఉందన్నారు. హైదరాబాద్‌ను ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ చేస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటనపై స్పందిస్తూ, దీనిపై మీడియా ప్రచారం తప్ప ఒరిగేదేమీ ఉండదని అన్నారు. ఎస్‌ఈజెడ్‌లను తీసుకున్న రహేజాలాంటి కంపెనీలే తిరిగి భూముల్ని ఇచ్చేస్తుంటే కొత్తగా వచ్చేదెవరని ప్రశ్నించారు.
అమెరికాది అధర్మ యుద్ధం
ధర్మ సంరక్షణ పేరిట అమెరికా అధర్మయుద్ధానికి కాలుదువ్వుతోందని వామపక్షాలు మండిపడ్డాయి. సిరియాలో జీవ రసాయన ఆయుధాల్ని వినియోగించిందెవరో తెలుసుకోకుండానే యుద్ధానికి సిద్ధమైందని ధ్వజమెత్తాయి. సిరియాలో యుద్ధమంటే భారత్ సహా వర్ధమాన దేశాలన్నీ ఇక్కట్లు పాలు కావడమేనని ఆందోళన వ్యక్తం చేశాయి. అఖిలభారత శాంతి సంఘం (అయిప్సో) ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ సిరియా సంఘీభావ సదస్సు ఏర్పాటు చేశారు. అయిప్సో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, బీవీ రాఘవులు (సీపీఎం), కె.నారాయణ (సీపీఐ), పీఎల్ శ్రీనివాస్ (టీడీపీ), అజీజ్‌పాషా (అయిప్సో), డాక్టర్ జస్వంత్ (సీపీఐ ఎంఎల్), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యు), జానకీరామ్ (ఆర్‌ఎస్పీ), వినోద్ (కాంగ్రెస్) తదితరులు ప్రసంగించారు.