కాపులను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే...!  | Chandrababu Naidu Speech In Kakinada | Sakshi
Sakshi News home page

కాపులను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే...! 

Published Sat, Sep 7 2019 11:00 AM | Last Updated on Sat, Sep 7 2019 11:00 AM

Chandrababu Naidu Speech In Kakinada - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: గురివింద తన నలుపు ఎరగదన్న సామెతను తలపిస్తోంది చంద్రబాబు తీరు. అధికారంలో ఉన్నన్నాళ్లు తప్పులమీద తప్పులు చేశారు. తీరా అధికారం కోల్పోయేసరికి నీతి వాక్యాలు వల్లిస్తున్నారని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.కాకినాడలో రెండు రోజులపాటు తెలుగుదేశం పార్టీ నేతలతో నియోజకవర్గాల సమీక్షల్లోను, సమీక్షల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశాల్లో బాబు పలుకులు పాత చింతకాయ పచ్చడిని తలపించాయి.

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా జనాన్ని భ్రమింపచేయడంలో సిద్ధహస్తులనే పేరున్న చంద్రబాబు పార్టీ ఘోర ఓటమి తరువాత తొలిసారి జిల్లాకు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో బాబు మాటలతో పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్తేజం ఎంత నింపారో చెప్పలేము కానీ పలికిన ప్రతి పలుకులో పచ్చి అబద్ధాలు వండి వార్చినట్టుగా కనిపించింది. అధికారంలో ఉంటే ఒకరకంగా, ప్రతిపక్షంలోకి వస్తే మరో రకంగాను మాట్లాడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటారు. అదే విషయాన్ని ఈ పర్యటనలో బాబు నిరూపించుకున్నారు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో కూడా ఆయనకు మరెవరూ సాటిరారంటారు. 

ఖాకీలకు ‘పచ్చ’ చొక్కాలేసిందెవరో...
చంద్రబాబు సీఎంగా ఉన్న గత ఐదేళ్లూ పోలీసులకు పచ్చచొక్కాలు అంటే వేయలేదు కానీ అంతకంటే ఎక్కువగానే ఉపయోగించుకున్నారు. చివరకు పోలీసు బాస్‌ ఆర్‌పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావులను వినియోగించి పోలీసు వ్యవస్థనే భ్రష్టుపట్టించారు. ఈ విషయం పలు సందర్భాల్లో పత్రికలకు పతాక శీర్షికలయ్యాయి. అటువంటిది అధికారం కోల్పోయే సరికి ఒక్కసారే పోలీసు వ్యవస్థ అంతా నిర్వీర్యమై పోయినట్టు, వైఎస్సార్‌సీపీ చెప్పినట్టే నడుస్తున్నారని అవాకులు, చవాకులతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. పోలీసు డ్రెస్‌ వేసుకునేది ప్రజా సేవ కోసమంటూ నీతి పలుకులు పలకడం చర్చనీయాంశమైంది.

బాబు మరో అడుగు ముందుకేసి పోలీసులు దిగజారిపోయారంటూ కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అవమానకరంగా మాట్లాడటంపై పోలీసు వర్గాలు మండిపడుతున్నాయి. నిరుద్యోగులకు తాను ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న నిరుద్యోగ భృతి మాటే ఎత్తని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మాటకు కట్టుబడి గ్రామ, వార్డు వలంటీర్లను నియమిస్తే వారిని ‘బస్తాలు మోసే’ వారిగా అభివర్ణిస్తూ అవమానకరంగా మాట్లాడటం విజ్ఞులను విస్మయానికి గురిచేసింది.

జిల్లాలో ఒకేసారి 24 వేల మంది వలంటీర్లను నియమించి గ్రామాల్లో నిరుద్యోగానికి పుల్‌స్టాప్‌ పెట్టే ప్రభుత్వ ప్రయత్నాన్ని స్వాగతించాల్సింది పోయి  కువిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు సొంత పార్టీలో కూడా చంద్రబాబు తీరు సరికాదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించేది లేదని సీఎం జగన్‌ పదేపదే చెబుతుంటే చంద్రబాబు మాత్రం ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, డ్వాక్రా యానిమేటర్లను తొలగించేస్తున్నారని ప్రజలను పక్కదోవపట్టించారు. రూ.3000 వేతనం ఉన్న ఆశ వర్కర్లకు సీఎం అయ్యాక జగన్‌ ఏకా ఎకిన రూ.10 వేలు వేతనం పెంచి వారికి సమాజంలో గౌరవాన్ని రెట్టింపుచేశారు.

కానీ 30 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆశ వర్కర్లను బెదిరిస్తున్నారని వాస్తవాలకు ముసుగేసే ప్రయత్నం చేశారు. పోలవరం సహా నీటివపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతిని వెలికి తీసేందుకు సీఎం జగన్‌ రివర్స్‌ టెండర్లతో ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం జగన్‌కు ఇరిగేషన్‌పై అవగాహన లేదని వ్యాఖ్యానించడంలో రాజకీయకోణమే కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

కాపుల విషయంలో రాజకీయమే...
ఎన్నికల్లో  ఓటు బ్యాంక్‌గా పరిగణించి ఎన్నికలయ్యాక కాపులను నమ్మించి దగా చేసి ఇప్పుడేమో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం తపా అని ప్రశ్నించడంపై ఆ సామాజికవర్గం మండిపడుతోంది. తన సహజ నైజాన్ని మరోసారి బాబు చాటుకోవడానికి ఎక్కడా వెనుకాడలేదు. హైదరాబాద్‌ అభివృద్ధి, ఔటర్‌ రింగురోడ్డు, శంషాబాద్‌ విమానాశ్రయం, సైబరాబాద్‌ తన గొప్పతనమేనని మరోసారి పాత పాటనే అందుకున్నారు.

పార్టీ సమీక్షలు కూడా మొక్కుబడిగానే పూర్తి చేయడంపై పార్టీ శ్రేణులు అసహనాన్ని వ్యక్తం చేశాయి. ఒకేసారి రెండు, మూడు నియోజకవర్గాల సమీక్షలను నిర్వహించడం, ఒక నియోజకవర్గం నుంచి ఒకరు లేదా, ఇద్దరికి మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వడంపై పార్టీ నేతలు బాబు తీరుపై గుర్రుగా ఉన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారిని ఉద్దేశించి ఒకరిద్దరు పోతే పోయేదేమీ లేదనడం పార్టీ ఘోర ఓటమి తరువాత కూడా బాబులో మార్పు రాలేదనే విషయం రుజువైందంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరినీ సమన్వయం చేసుకుంటూ అండగా ఉన్న పార్టీ సీనియర్‌ నేతలను దూరంగా ఉండాలనడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పవన్‌దీ అదే బాట
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌Š  సైతం బాబు బాటనే పట్టారనిపించారు. పవన్‌ పర్యటన జిల్లాలో ఒకే ఒక సీటు, అదీ కూడా బొటాబొటీ మెజార్టీతో బయటపడ్డ కోనసీమలోని రాజోలు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. గురువారం రాత్రి 8 గంటలకు దిండి వచ్చిన పవన్‌ అప్పటికే మేధోమథనం పేరుతో పార్టీ పీఏసీ సభ్యులు నిర్వహించిన సమీక్షలో ఇలా ముఖం చూపించి అలా వెళ్లిపోవడంతో పార్టీ అభిమానులు నిరాశకు గురయ్యారు. నియోజకవర్గాల్లో పనిచేసిన పార్టీ నేతలు, అభిమానులతో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం,

తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను దగ్గరకు కూడా రాకుండా అడ్డుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ తోపులాటల్లో కానిస్టేబుల్‌కు గాయాలపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు అమరావతి అంతా అవినీతి మయమైందని, రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని నిప్పులు చెరిగిన పవన్‌ ఇప్పుడు అమరావతికి వంత పాడటం బాబు రెండు నాల్కల ధోరణికి ఏమాత్రం తీసిపోనిదిగా కనిపించింది. బాబు, పవన్‌ ఒకే తానులో ముక్కలనే అభిప్రాయం ఆయా వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement