పుష్కరాల ప్రారంభం సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట మరణాలకు బాధ్యత వహిస్తూ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ
కిర్లంపూడి :పుష్కరాల ప్రారంభం సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట మరణాలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఏ మాత్రం నైతిక విలువలున్నా ఆయన తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలన్నారు. కిర్లంపూడి మదీనా జామియా మసీదులో పార్టీ నాయకులు తూము కుమార్, కుర్ల చినబాబు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో జ్యోతుల ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైన నెల అని, నియమనిష్టలతో వారు ఉపవాస దీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. గోదావరి పుష్కరాల్లో అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన కారణమని అన్నారు. ప్రపంచంలో తన ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో ఆయన చేసిన తప్పిదంవల్లే తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు. గవర్నర్‌కు ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించి గాడి తప్పిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి, పుష్కర పర్యవేక్షణ బాధ్యతను అధికారులకు అప్పగించాలని, పుష్కరాలకు వచ్చిన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పుష్కరాలను విజయవంతం చేయాలని జ్యోతుల డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి కాశింబాబు, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం కార్యదర్శి కర్రి సూర్యనారాయణమూర్తి(దత్తుడు), జిల్లా సంయుక్త కార్యదర్శి జంపన సీతారామచంద్రవర్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తూము చినబాబు, కంచుమర్తి రాఘవ, భూపాలపట్నం ప్రసాద్, గౌతు చిన్న, గుడాల రాంబాబు, కాల దొంగబాబు, నీలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.