చంద్రబాబు x హరికృష్ణ
* రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న హరికృష్ణ
* ఆత్మావిష్కరణ పేరుతో సోమవారం ఢిల్లీలో ప్రకటన విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విభజన ప్రకటన తెలుగుదేశం పార్టీలో ముసలానికి కారణమవుతుందా? పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ఆయన బావమరిది నందమూరి హరికృష్ణ ఢీకొనబోతున్నారా? అందుకోసమే ఆయన సమైక్య నినాదాన్ని అందుకున్నారా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.
తెలంగాణ ఏర్పాటును సమర్థించడమే కాకుండా సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలను కేంద్రమే భరించాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీమాంధ్రలో ఎగిసిపడిన ఉద్యమ తీవ్రత చూసి ఇంటికే పరిమితమైన చంద్రబాబు గత 20 రోజులుగా ఏం చేయాలో అర్థంకాక దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు.
సీమాంధ్ర ప్రాంతంలో బస్సు యాత్ర చేయాలని భావిస్తున్నప్పటికీ ఉన్నట్టుండి సీమాంధ్ర ప్రజలపై ప్రేమ కనబరిస్తే ఆ ప్రాంత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సుయాత్ర చేస్తే అక్కడి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న అంశంపై గత పక్షం రోజులుగా సమాలోచనలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులో తిరుపతి లేదా విశాఖపట్నం నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని, అందుకు ఇప్పటినుంచే తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలను కోరుతున్నారు.
అయితే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంపీ నందమూరి హరికృష్ణ ఒకడుగు ముందుకేసి సమైక్య నినాదాన్ని తలకెత్తుకున్నారు. బావకంటే ముందే సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానంటూ ఆత్మావిష్కరణ పేరుతో సోమవారం ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యకర్తగా తాను తొలుత పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించానని, కానీ ఏకాభిప్రాయంతో విభజన జరపకుండా... ఒక ప్రాంతంవారికి ఆమోదయోగ్యం కాని రీతిలో జరిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావణ కాష్టం రగిలించిన నేపథ్యంలో సమైక్యాంధ్ర విధానానికే కట్టుబడి ఉండటం సమర్థనీయమని ఆత్మ ప్రబోధంతో అడుగు ముందుకు వేస్తున్నట్లు ప్రకటించారు.
పార్లమెంటు ఆవరణలోని టీడీపీపీ కార్యాలయం నుంచి తన ప్రకటనను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఫ్యాక్స్ చేయమని కోరితే... అక్కడి సిబ్బంది ముందుగా చంద్రబాబుకు చేరవేస్తారని భావించిన హరికృష్ణ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి దాన్ని పంపించే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. హరికృష్ణ, చంద్రబాబులకు ఎంతోకాలంగా పొసగటం లేదు. దాదాపు మాటలు కూడా కరువయ్యాయి. హరికృష్ణ కుమారుడు, సినీ నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ కూడా టీడీపీ అధినేతతో ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు ప్రకటనను చంద్రబాబు స్వాగతించడాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ సమైక్యరాగాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులతో సహా అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఏదో ఒక ప్రాంతంలో ఈ ఆందోళనల్లో పాల్గొనాలని హరికృష్ణ నిర్ణయించుకున్నారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి.
ఇప్పటికే పార్టీ నేతలెవ్వరినీ తన దరి చే రనివ్వని చంద్రబాబు తాను సమైక్య ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ పార్టీ నేతలను రానివ్వబోరని హరికృష్ణ అనుమానిస్తున్నారు. అందుకే ఎవరొచ్చినా రాకున్నా నమ్మిన సిద్ధాంతం కోసం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనే పట్టుదలగా ఉన్నారు. ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో హరికృష్ణ తన కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.