తెలంగాణ వచ్చినా ఇబ్బంది లేదు: చంద్రబాబు | No Problem with Separate Telangana State: Chandrababu Naidu | Sakshi

తెలంగాణ వచ్చినా ఇబ్బంది లేదు: చంద్రబాబు

Published Wed, Aug 21 2013 2:26 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

తెలంగాణ వచ్చినా ఇబ్బంది లేదు: చంద్రబాబు - Sakshi

తెలంగాణ వచ్చినా ఇబ్బంది లేదు: చంద్రబాబు

హైదరాబాద్‌లో నివసించే వారిని తాము కాపాడతామంటే తాము కాపాడతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, మన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి నివసిస్తున్నపుడు లేని ఇబ్బంది హైదరాబాద్‌లో నివసించే వారికి ఎందుకు వస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాలవారికి సమస్య ఏమీ ఉండదు
 విలేకరుల సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు
 మేం అధికారంలోకి వస్తామన్న ఆందోళనతోనే విభజన ప్రకటన
 పార్టీలో నామాటే వేదం.. అందరూ నా వెనుక నడవాల్సిందే
 హరికృష్ణతో కలిసి బస్సుయాత్ర చేసే ఆలోచన లేదు
 త్వరలోనే ‘తెలుగు వారి ఆత్మగౌరవయాత్ర’ చేపడతా..

 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నివసించే వారిని తాము కాపాడతామంటే తాము కాపాడతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, మన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి నివసిస్తున్నపుడు లేని ఇబ్బంది హైదరాబాద్‌లో నివసించే వారికి ఎందుకు వస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినా హైదరాబాద్‌లో నివసించే వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు. మంగళవారం చంద్రబాబు తన నివాసంలో సుమారు గంటకు పైగా విలేకరులనుద్దేశించి ప్రసంగించారు. యథావిధిగా ‘సాక్షి’ దినపత్రిక, చానల్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. తాము తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
 
 రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళతానని, ఈ పరిస్థితికి కారణమైన పార్టీల బాగోతాన్ని వివరిస్తానని చెప్పారు. పార్టీలో తన నిర్ణయం అంతిమమని చెప్పారు. ఇక్కడ బంధుత్వాలకు తావులేదని, అందరూ తన వెనక నడవాల్సిందేనన్నారు. తాను, నందమూరి హరికృష్ణ ఉమ్మడిగా బస్సుయాత్ర చేసే ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఒకరిద్దరు నేతలు ఉద్వేగానికిలోనై చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజలు స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆందోళనలు చేస్తున్నారని కొత్త భాష్యం చెప్పారు. తాను ‘తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర’ను చేపడతానని, అయితే ఎక్కడి నుంచి అనేది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. తాను పదవుల కోసం రాజకీయం చేయటం లేదన్నారు. సీఎం పదవి రాకపోయినా తనకు ఇబ్బంది లేదని చెప్పారు.
 
 టీడీపీని ఇబ్బంది పెట్టడానికే: వచ్చే ఎన్నిక ల్లో విజయం సాధించి టీడీపీ అధికారంలోకి వస్తుందన్నఏకైక కారణంతో అనాలోచితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిందని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నిజస్వరూపం గురించి ప్రజలకు వివరిస్తానన్నారు. రాష్ర్ట విభజన ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి లాభం లేకపోయినా ఓట్ల ద్వారా లబ్ధిపొందే టీ ఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుని ఈ ప్రాంతంలో చక్రం తిప్పాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో తన వ్యతిరేక ఓటును వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు బదిలీ చే సి ఎన్నికల తరువాత విలీనం చేసుకోవాలని చూస్తోందన్నారు. ఇందుకోసం సీబీఐని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటోందన్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎలాంటి అరెస్టులూ జరగలేదని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి కూడా జైలు నుంచి నేడో, రేపో విడుదలవుతారని చంద్రబాబు తీర్పిచ్చారు.
 
 జగన్‌మోహన్‌రెడ్డి ఇల్లు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల మధ్య హాట్‌లైన్ ఉందన్నారు. ఒకవేళ హాట్‌లైన్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకోకముందే అందుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఎలా రాజీనామాలు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు, దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీనే  కారణమని చంద్రబాబు ఆరోపించారు.
 
 ఈ ప్రశ్నలకు బదులేది?
 ఈ విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ‘సాక్షి’ ఈ వార్త ప్రచురిస్తోంది. మీడియా సమావేశానికి అనుమతించి ఉంటే చంద్రబాబును ‘సాక్షి’ ఈ ప్రశ్నలు అడిగేది..
 
- టీడీపీ అధికారంలోకి రాకుండా చేసేందుకే కాంగ్రెస్ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని అంటున్నారు కదా, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది మీరు కాదా? ఆ తర్వాత తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చమని, అఖిల పక్ష సమావేశం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా?
- జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి, సీడబ్ల్యూసీకి మధ్య హాట్‌లైన్ ఉందని ఆరోపిస్తున్నారు కదా, సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్‌లోని కీలకమైన ముగ్గురు నేతలతో మీరు ఫోన్‌లో మాట్లాడిన అంశం హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. అంటే కాంగ్రెస్ నేతలు మీతో టచ్‌లో ఉన్నారని భావించాలా? లేక జగన్‌తోనా?
 
- ‘మీ పార్టీ నాయకుడు (చంద్రబాబు) నన్ను కలిశారని’ స్వయంగా కేంద్ర మంత్రి చిదంబరం పార్లమెంట్ వేదికగా మీ పార్టీ ఎంపీలకు చెప్పారు కదా. అంటే కాంగ్రెస్ నేతలు ఎవరితో టచ్‌లో ఉన్నారంటారు?
- నా రాజకీయ జీవితంలో ఇంత చెత్త నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదంటున్న మీరు ఎఫ్‌డీఐలకు సంబంధించిన బిల్లు రాజ్యసభలోకి వచ్చినప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందేలా స్వయంగా టీడీపీ ఎంపీలు సభ నుంచి గైర్హాజరై పరోక్షంగా బిల్లు నెగ్గడానికి ఉపయోగపడలేదా?
 
- రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రతిపక్షాలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే దానికి మద్దతివ్వకుండా ప్రభుత్వాన్ని కాపాడిన మీరే కాంగ్రెస్‌పై నిందలు వేయడంలో ఆంతర్యమేంటి?
- విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించగానే సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని కేంద్రాన్ని కోరింది మీరు కాదా? ఇప్పుడేమో హైదరాబాద్‌లో నివసించే ఇతర ప్రాంతాల వారికి ఇబ్బందులుండవని చెబుతున్నారు కదా.. అలాంటప్పుడు ఆత్మగౌరవ యాత్ర ఎందుకు చేపట్టాలనుకుంటున్నారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement